Hyderabad vs Kolkata: కప్పు ఏ తీరానికో...

మునుపెన్నడూ చూడని విధ్వంసక విన్యాసాలతో క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ 17వ సీజన్‌లో అంతిమ ఘట్టానికి రంగం సిద్ధమైంది. లీగ్‌లో ఉత్తమ ప్రదర్శన చేసిన రెండు జట్ల మధ్య టైటిల్‌ పోరు ఆదివారమే.

Updated : 26 May 2024 03:58 IST

కోల్‌కతాతో హైదరాబాద్‌ ఢీ
సమవుజ్జీల పోరుపై సర్వత్రా ఆసక్తి
నేడే ఐపీఎల్‌-17 ఫైనల్‌
రాత్రి 7.30 నుంచి

సీజన్లో అందరికంటే ముందుగా ప్లేఆఫ్స్‌ బెర్తు ఖాయం చేసుకున్న జట్టు ఒకటి. లీగ్‌ దశలో అత్యధికంగా తొమ్మిది విజయాలతో అగ్రస్థానం.. క్వాలిఫయర్‌-1లో గెలిచి నేరుగా ఫైనల్లో చోటు సంపాదించింది. 

వామ్మో ఇదేం దూకుడు అనిపిస్తూ.. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరును ఒకటికి రెండుసార్లు బద్దలు కొట్టి లీగ్‌ దశలో రెండో స్థానంతో ప్లేఆఫ్స్‌కు దూసుకొచ్చిన జట్టు ఇంకోటి. తొలి క్వాలిఫయర్‌లో కంగు తిన్నా.. రెండో అవకాశాన్ని గొప్పగా ఉపయోగించుకుని స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఫైనల్లో అడుగు పెట్టింది.

ఒక జట్టుది భయపెట్టే బ్యాటింగ్‌. కానీ బౌలింగ్‌లో తక్కువేమీ కాదు. ఇంకో జట్టుది కంగారెత్తించే బౌలింగ్‌.. అలా అని బ్యాటింగ్‌ బలహీనమేమీ కాదు.

లీగ్‌లో రెండు అత్యుత్తమ జట్లే టైటిల్‌ కోసం తలపడుతున్నాయనడంలో సందేహం లేదు. మరి సమవుజ్జీల పోరులో పైచేయి సాధించేదెవరు?

మూడో కప్పు కోసం పదేళ్ల నిరీక్షణకు కోల్‌కతా తెరదించుతుందా? ఎనిమిదేళ్ల తర్వాత హైదరాబాద్‌ మళ్లీ కప్పును ఒడిసిపడుతుందా?

చెన్నై

మునుపెన్నడూ చూడని విధ్వంసక విన్యాసాలతో క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించిన ఇండియన్‌ ప్రిమియర్‌ లీగ్‌ 17వ సీజన్‌లో అంతిమ ఘట్టానికి రంగం సిద్ధమైంది. లీగ్‌లో ఉత్తమ ప్రదర్శన చేసిన రెండు జట్ల మధ్య టైటిల్‌ పోరు ఆదివారమే. లీగ్‌ దశను తొలి రెండు స్థానాలతో ముగించిన కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. చెన్నైలో కప్పు కోసం కొట్లాడబోతున్నాయి. 2012, 2014లో టైటిల్‌ సాధించిన కోల్‌కతా మూడో కప్పు కోసం ఉవ్విళ్లూరుతుండగా.. 2016లో తొలిసారి ఛాంపియన్‌ అయ్యాక మళ్లీ కప్పు గెలవని సన్‌రైజర్స్‌ ఈసారి అవకాశాన్ని వదులుకోకూడదనుకుంటోంది. బలాబలాల్లో సమవుజ్జీల్లా కనిపిస్తున్న రెండు జట్ల మధ్య చెపాక్‌లో హోరాహోరీ పోరు ఖాయం.

దూకుడు × నిలకడ

సీజన్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే ఫైనల్లో తలపడుతుండడాన్ని బట్టి ఫేవరెట్‌ ఎవరని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అయితే బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్‌దే కొంత పైచేయి. పైగా చివరగా క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ను చెన్నైలోనే ఆడి రాజస్థాన్‌ను ఓడించడం సన్‌రైజర్స్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. ఈ సీజన్‌ ఆరంభం నుంచి హైదరాబాద్‌ దూకుడుకు మారుపేరుగా ఉంటోంది. హెడ్, అభిషేక్,    క్లాసెన్‌ల త్రయం ప్రత్యర్థులను బెంబేలెత్తించేసింది. చివరి దశలో హైదరాబాద్‌ దూకుడు తగ్గినా.. బ్యాటింగ్‌ మాత్రం బలంగానే కనిపిస్తోంది. రాహుల్‌ త్రిపాఠి గత కొన్ని మ్యాచ్‌ల్లో అదిరే ప్రదర్శన చేయడం సానుకూలాంశం. అయితే మార్‌క్రమ్‌ మాత్రం ఫామ్‌లో లేడు. సమద్, షాబాజ్‌ల ప్రదర్శనా అంతంతమాత్రమే కావడంతో మిడిలార్డర్‌ బలహీనంగా మారింది. ఓపెనర్లు విఫలమైతే క్లాసెన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. హెడ్, అభిషేక్‌ ఎంత ప్రమాదకరమో తెలుసు కాబట్టి వాళ్లిద్దరినీ వీలైనంత త్వరగా ఔట్‌ చేయడానికి కోల్‌కతా ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. క్వాలిఫయర్‌-2లో చెపాక్‌ పిచ్‌ను చక్కగా ఉపయోగించుకున్న షాబాజ్, అభిషేక్‌ ఈ మ్యాచ్‌లోనూ కీలకం కానున్నారు. కోల్‌కతాకు హైదరాబాద్‌తో పోలిస్తే బలమైన బౌలింగ్‌ విభాగం ఉంది. పేసర్లు స్టార్క్, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా మంచి ఫామ్‌లో ఉన్నారు. స్పిన్నర్లు వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ ఎంత ప్రమాదకరమో చెప్పాల్పిన పని లేదు. నరైన్‌ బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నాడు. సాల్ట్‌ దూరం కావడంతో బ్యాటింగ్‌ కొంత బలహీనపడినా.. నరైన్, శ్రేయస్, వెంకటేశ్‌ అయ్యర్, రసెల్, రింకులతో బ్యాటింగ్‌ ఆర్డర్‌తో ప్రత్యర్థి బౌలర్లకు కష్టమే. సీజన్లో ఎంతో నిలకడగా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన జట్టయిన కోల్‌కతాను హైదరాబాద్‌ ఎంతమాత్రం తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు.

స్పిన్‌ యుద్ధంలో నెగ్గేదెవరో?

చెన్నై చెపాక్‌ స్టేడియం అనగానే అందరికీ స్పిన్నర్ల   ఆధిపత్యమే గుర్తుకు వస్తుంది. ఇక్కడ జరిగిన రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ స్పిన్నర్లు షాబాజ్‌ అహ్మద్, అభిషేక్‌ శర్మ ఎలా రెచ్చిపోయారో తెలిసిందే. అయితే కోల్‌కతాకు వరుణ్‌ చక్రవర్తి, సునీల్‌ నరైన్‌ రూపంలో నాణ్యమైన స్పిన్నర్లున్న నేపథ్యంలో హైదరాబాద్‌కూ ఇబ్బందులు తప్పవు. రాత్రి మంచు ప్రభావం లేకుంటే స్పిన్నర్లను ఆడడం కష్టమే. మందకొడిగా ఉండే ఈ పిచ్‌పై భారీ షాట్లు ఆడడం కష్టమే. పిచ్‌ను ఏ జట్టు స్పిన్నర్లు సద్వినియోగం చేసుకుంటే వారిదే విజయం.

24.75 కోట్లు × 20.5 కోట్లు

ఐపీఎల్‌కు ముందు వేలంలో రికార్డు స్థాయిలో రూ.24.75 కోట్ల ధర పలికి ఔరా అనిపించాడు ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌. ఆ దేశానికే చెందిన ప్యాట్‌ కమిన్స్‌ రూ.20.5 కోట్లు పలికాడు. వీరికి ఈ ధర మరీ ఎక్కువ అనే చర్చ జరిగింది. ముఖ్యంగా స్టార్క్‌ సీజన్‌ ఆరంభంలో పేలవ ప్రదర్శన చేయడంతో తీవ్ర విమర్శలు తప్పలేదు. కానీ తర్వాత స్టార్క్‌ పుంజుకున్నాడు. కీలక మ్యాచ్‌ల్లో సత్తా చాటాడు. క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో 3 వికెట్లతో జట్టును ఫైనల్‌ చేర్చాడు. ఇక కమిన్స్‌ విషయానికొస్తే.. అతను కెప్టెన్‌గా సన్‌రైజర్స్‌ దృక్పథాన్ని, ఆటతీరును మార్చేశాడు. బౌలర్‌గా చక్కటి ప్రదర్శనతో జట్టును ముందుండి నడిపించాడు. ఇప్పుడీ ఇద్దరు మేటి ఆటగాళ్లు ఫైనల్లో తలపడబోతున్నారు. మరి ఈ భారీ రేటు ఆటగాళ్లలో పైచేయి ఎవరిదో?

గంభీర్‌ వ్యూహమేంటో?

సీజన్లో అత్యంత నిలకడైన ప్రదర్శన అంటే కోల్‌కతాదే. గత సీజన్‌తో పోలిస్తే జట్టులో పెద్దగా మార్పులు లేకున్నా.. లీగ్‌ దశను అగ్రస్థానంతో ముగించింది. ఇప్పుడు ఫైనల్లోనూ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ ప్రదర్శన వెనుక గంభీర్‌ ఉన్నాడన్నది విశ్లేషకుల మాట. నరైన్‌ను తిరిగి ఓపెనర్‌గా తీసుకురావడం నుంచి ఈ సీజన్లో అతడి వ్యూహాలన్నీ గొప్పగా పని చేశాయి. ఆటగాళ్లలో పట్టుదల, దూకుడు పెరగడంలో, జట్టులో సమష్టితత్వం రావడంలో గంభీర్‌ కీలకంగా మారాడు. కోల్‌కతాకు కోచ్‌ చంద్రకాంత్‌ పండిట్‌ అయినప్పటికీ.. వ్యూహ రచన అంతా మెంటార్‌ అయిన గంభీరే చూసుకుంటున్నాడు. ఫైనల్లో గంభీర్‌ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తాడన్నది ఆసక్తికరం.

వర్షం ముప్పు.. రిజర్వ్‌ డే

పీఎల్‌-17 ఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. చెన్నైలో ఆదివారం రాత్రి జల్లులతో కూడిన వర్షం పడొచ్చని అంచనా. అయితే మ్యాచ్‌ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం అయితే లేదు. ఒకవేళ అలా జరిగినా సోమవారం రిజర్వ్‌ డే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు.

తుది జట్లు (అంచనా)

హైదరాబాద్‌: హెడ్, అభిషేక్, త్రిపాఠి, మార్‌క్రమ్, క్లాసెన్, నితీశ్‌ కుమార్, షాబాజ్‌ అహ్మద్, కమిన్స్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్, నటరాజన్, ఉనద్కత్‌.

కోల్‌కతా: నరైన్, రహ్మనుల్లా, వెంకటేశ్‌ అయ్యర్, శ్రేయస్‌ (కెప్టెన్‌), రసెల్, రింకు సింగ్, రమణ్‌దీప్, స్టార్క్, వైభవ్‌ అరోరా, హర్షిత్‌ రాణా, వరుణ్‌ చక్రవర్తి.

1

ఐపీఎల్‌లో కోల్‌కతా, సన్‌రైజర్స్‌ మధ్య ఇదే మొదటి ఫైనల్‌. 

18

ఐపీఎల్‌ చరిత్రలో సన్‌రైజర్స్‌తో 27 మ్యాచ్‌లాడిన కోల్‌కతా సాధించిన విజయాలు. సన్‌రైజర్స్‌ తొమ్మిదింట్లో గెలిచింది. ఈ సీజన్‌లో కోల్‌కతాతో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ సన్‌రైజర్స్‌ ఓడింది. 

1

చెపాక్‌లో సన్‌రైజర్స్, కోల్‌కతా మధ్య జరిగిన మ్యాచ్‌లు. ఇందులో కోల్‌కతా గెలిచింది. ఇక్కడ 14 మ్యాచ్‌లాడిన కోల్‌కతా 4 గెలిచి, 10 ఓడిపోయింది. 11 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్‌ 2 నెగ్గి, 9 ఓడిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని