Hyderabad vs Rajasthan: తిప్పేసి.. ఫైనల్లో అడుగేసి..

ఈ ఐపీఎల్‌లో విధ్వంసక బ్యాటింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. కానీ తొలి క్వాలిఫయర్లో ఆ జట్టు బ్యాటర్లు తేలిపోయారు. రెండో క్వాలిఫయర్లోనూ బ్యాటర్ల తడబాటు కొనసాగింది.

Updated : 25 May 2024 06:47 IST

ఐపీఎల్‌-17 తుది పోరుకు హైదరాబాద్‌
క్వాలిఫయర్‌-2లో రాజస్థాన్‌పై గెలుపు
షాబాజ్, అభిషేక్‌ మాయాజాలం

ఈ ఐపీఎల్‌లో విధ్వంసక బ్యాటింగ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌. కానీ తొలి క్వాలిఫయర్లో ఆ జట్టు బ్యాటర్లు తేలిపోయారు. రెండో క్వాలిఫయర్లోనూ బ్యాటర్ల తడబాటు కొనసాగింది. రాజస్థాన్‌ ముందు నిలిచిన లక్ష్యం 176 పరుగులే. ఈ లక్ష్యం బలమైన బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఉన్న రాజస్థాన్‌కు ఏం సరిపోతుందిలే అనుకున్నారంతా! అందుకు తగ్గట్లే మెరుపులతో మొదలైంది రాయల్స్‌ ఛేదన. కానీ స్పిన్‌ స్వర్గధామమైన చెపాక్‌లో అదను చూసి స్పిన్నర్లను దించాడు కెప్టెన్‌ కమిన్స్‌. అంతే కథ మొత్తం మారిపోయింది. ఇద్దరు స్పిన్నర్లు కలిసి అయిదు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను సన్‌రైజర్స్‌ వైపు తిప్పేశారు. ఇంకేముంది.. రాయల్స్‌ ఇంటికి, సన్‌రైజర్స్‌ ఫైనల్‌కు.

చెన్నై

న్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మూడోసారి ఐపీఎల్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలి క్వాలిఫయర్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు తలవంచిన ఆ జట్టు.. శుక్రవారం రెండో క్వాలిఫయర్లో 36 పరుగుల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ను ఓడించింది. మొదట సన్‌రైజర్స్‌ 9 వికెట్లకు 175 పరుగులు చేసింది. హెన్రిచ్‌ క్లాసెన్‌ (50; 34 బంతుల్లో 4×6) టాప్‌స్కోరర్‌. రాజస్థాన్‌ బౌలర్లలో అవేష్‌ ఖాన్‌ (3/27), బౌల్ట్‌ (3/45), సందీప్‌ శర్మ (2/25) సత్తా చాటారు. అనంతరం ఛేదనలో స్పిన్నర్లు షాబాజ్‌ అహ్మద్‌ (3/23), అభిషేక్‌ శర్మ (2/24) విజృంభించడంతో రాజస్థాన్‌ 7 వికెట్లకు 139 పరుగులే చేయగలిగింది. ధ్రువ్‌ జురెల్‌ (56 నాటౌట్‌; 35 బంతుల్లో 7×4, 2×6), యశస్వి జైస్వాల్‌ (42; 21 బంతుల్లో 4×4, 3×6) మినహా బ్యాటర్లు తేలిపోయారు. సన్‌రైజర్స్‌ ఆదివారం ఫైనల్లో కోల్‌కతాతో తలపడుతుంది. 2016లో ఛాంపియన్‌గా నిలిచిన హైదరాబాద్‌.. 2018లో రన్నరప్‌ అయింది.

వాళ్లిద్దరి రాకతో..: పవర్‌ ప్లేలో జైస్వాల్‌ మెరుపు బ్యాటింగ్‌ చూసిన వారికి రాయల్స్‌ సులువుగా మ్యాచ్‌ గెలిచేస్తుందనే అనిపించి ఉంటుంది. మరో ఓపెనర్‌ కోహ్లెర్‌ క్యాడ్‌మోర్‌ (10) తడబడినా.. యశస్వి స్వేచ్ఛగా బ్యాట్‌ ఝళిపిస్తూ జట్టును ముందుకు నడిపించాడు. భువనేశ్వర్‌ వేసిన ఆరో ఓవర్లో అతను 19 పరుగులు రాబట్టాడు. దీంతో పవర్‌ప్లేలో 51/1తో రాయల్స్‌ మంచి స్థితిలో నిలిచింది. అయితే 8వ ఓవర్లో బంతి అందుకున్న షాబాజ్‌.. యశస్విని ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆ ఓవర్లో రెండో బంతికే సిక్సర్‌ బాదిన జైస్వాల్‌.. మరో షాట్‌కు ప్రయత్నించి వెనుదిరిగాడు. ఈ ఓవర్లో బంతి తిరిగిన తీరు చూసి మరో ఎండ్‌లో పార్ట్‌టైమర్‌ అభిషేక్‌ను దించాడు కమిన్స్‌. అతను ఎంతో కీలకమైన సంజు శాంసన్‌ (10) వికెట్‌ తీశాడు. మార్‌క్రమ్‌ డీప్‌ మిడ్‌వికెట్‌లో సంజు క్యాచ్‌ను చక్కగా అందుకున్నాడు. వెంటవెంటనే రెండు కీలక వికెట్లు పడడంతో స్కోరు వేగం పడిపోయింది. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయింది. ఒత్తిడికి గురైన పరాగ్‌ (6) కూడా భారీ షాట్‌ ఆడబోగా.. క్యాచ్‌ ఔట్‌ అయి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ వికెట్‌నూ షాబాజే తీశాడు. బ్యాటింగ్‌ ఆర్డర్లో ముందు వచ్చిన అశ్విన్‌ (0) సైతం అతడికే వికెట్‌ సమర్పించుకున్నాడు. బ్యాటర్లు ఎంత గట్టిగా ప్రయత్నించినా షాట్లు ఆడడం కష్టమని, రాజస్థాన్‌ గెలవడం కష్టమే అని అప్పుడే అర్థమైపోయింది. ప్రమాదకర హెట్‌మయర్‌ (4)ను అభిషేక్‌ బౌల్డ్‌ చేయడంతో సన్‌రైజర్స్‌ విజయం దాదాపు ఖాయమైపోయింది. అయినా ఒక ఎండ్‌లో ధ్రువ్‌ జురెల్‌ పోరాడాడు. కానీ అతడికి సహకారం కరవైంది. ఎలిమినేటర్‌లో రాయల్స్‌ను గెలిపించిన రోమన్‌ పావెల్‌ (6) ఈసారి తేలిపోయాడు. 3 ఓవర్లలో 53 పరుగులు అవసరమైన స్థితిలో నటరాజన్‌ ఒక్క పరుగే ఇచ్చి పావెల్‌ను ఔట్‌ చేయడంతో రాయల్స్‌కు దారులు మూసుకుపోయాయి. తర్వాత జురెల్‌ కూడా అద్భుతాలేమీ చేయలేకపోయాడు.

పడుతూ లేస్తూ..: ఈ సీజన్లో విధ్వంసక బ్యాటింగ్‌తో భారీ స్కోర్లు నమోదు చేసిన సన్‌రైజర్స్‌.. మందకొడిగా ఉన్న చెన్నై పిచ్‌ మీద క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయినప్పటికీ.. దూకుడు తగ్గించకపోవడంతో ఓ మోస్తరు స్కోరు చేయగలిగింది. ముగింపులో ఆ జట్టు మెరుపులు కొనసాగి ఉంటే స్కోరు 190 దాటేదే. ఆరంభంలో సన్‌రైజర్స్‌ను బౌల్ట్‌ గట్టి దెబ్బే తీశాడు. తన బౌలింగ్‌లో ఒక సిక్స్, ఫోర్‌ కొట్టి ఊపు మీద కనిపించిన అభిషేక్‌ను బౌల్ట్‌ బోల్తా కొట్టించాడు. అయితే మూడో స్థానంలో వచ్చిన త్రిపాఠి (37; 15 బంతుల్లో 5×4, 2×6) ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోవడంతో స్కోరు బోర్డు దూసుకెళ్లింది. అయితే మంచి ఊపులో ఉండగా బౌల్ట్‌ బౌన్సర్‌ను అవనసరంగా ఆడి ఔటైపోయాడు త్రిపాఠి. అదే ఓవర్లో మార్‌క్రమ్‌ (1) కూడా వెనుదిరగడంతో సన్‌రైజర్స్‌ 57/3తో కష్టాల్లో పడింది. ఈ స్థితిలో హెడ్‌ (34; 28 బంతుల్లో 3×4, 1×6) కు తోడైన క్లాసెన్‌ ఇన్నింగ్స్‌కు స్థిరత్వం తెచ్చాడు. తన శైలికి విరుద్ధంగా పవర్‌ ప్లేలో నెమ్మదిగా ఆడిన హెడ్‌.. తర్వాత జోరు పెంచాడు. క్లాసెన్‌ కూడా సమయోచితంగా షాట్లు ఆడడంతో హైదరాబాద్‌ మరో వికెట్‌ కోల్పోకుండా వందకు చేరువైంది. ఈ దశలో హెడ్‌ ఔటయ్యాడు. తర్వాత కూడా మరో ఎండ్‌లో వికెట్లు పడుతున్నా.. క్లాసెన్‌ దూకుడుగా ఆడి స్కోరు పెంచాడు. నితీశ్‌ కుమార్‌ (5), సమద్‌ (0)లను అవేష్‌ వరుస బంతుల్లో ఔట్‌ చేశాడు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన షాబాజ్‌ అహ్మద్‌ (18).. క్లాసెన్‌కు సహకరించడంతో 18 ఓవర్లకు సన్‌రైజర్స్‌ 163/6 మంచి స్థితిలోనే నిలిచింది. చివరికి స్కోరు 190 దాటుతుందనిపించింది. కానీ సందీప్‌ శర్మ 19వ ఓవర్‌ తొలి బంతికే క్లాసెన్‌ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత మెరుపులే లేకపోయాయి. చివరి 2 ఓవర్లలో సన్‌రైజర్స్‌ 3 వికెట్లు కోల్పోయి 12 పరుగులే చేసింది.

ఉన్న కాసేపు...

ఫామ్‌లో ఉన్న అభిషేక్‌ శర్మ త్వరగా ఔటైపోయాడు. హెడ్‌ తడబడుతున్నాడు. మొదట సన్‌రైజర్స్‌ ఆరంభ తడబాటు చూస్తే ఆ జట్టు ఆత్మరక్షణలో పడుతుందనిపించింది. కానీ రాహుల్‌ త్రిపాఠి జట్టును వెనుకంజ వేయనివ్వలేదు. ఉన్నది 3.3 ఓవర్ల పాటే. ఆడింది 15 బంతులే. కానీ ఉన్నంతసేపు ధనాధన్‌ బ్యాటింగ్‌తో రాయల్స్‌ బౌలర్లకు చుక్కలు చూపించేశాడు. వికెట్‌కు నలువైపులా అతను కళ్లు చెదిరే షాట్లు ఆడాడు. బౌల్ట్‌ 145 కి.మీ వేగంతో వేసిన బంతిని అతను కాలు కదపకుండా, తలవంచి  ఫైన్‌ లెగ్‌లో సిక్సర్‌గా మలిచిన తీరు అద్భుతం. 

‘ఇంపాక్ట్‌’ అదిరింది

కీలకమైన రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ నిబంధన భలే కలిసొచ్చింది. ఇన్నాళ్లూ తుది జట్టులో కొనసాగినా పెద్దగా ప్రభావం చూపని షాబాజ్‌ అహ్మద్‌.. ఈ మ్యాచ్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట సన్‌రైజర్స్‌ 120/6తో ఉన్న దశలో బ్యాటింగ్‌కు వచ్చి 18 పరుగులు చేసిన షాబాజ్‌.. అనంతరం స్పిన్‌కు సహకరిస్తున్న చెపాక్‌ పిచ్‌ను చక్కగా ఉపయోగించుకుని మూడు వికెట్లు పడగొట్టి రాజస్థాన్‌ను గట్టి దెబ్బ తీశాడు. 65/1తో రాయల్స్‌ పటిష్ట స్థితిలో ఉండగా.. జోరుమీదున్న యశస్విని ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పింది అతనే. తర్వాత ప్రమాదకర పరాగ్‌తో పాటు అశ్విన్‌నూ అతను పెవిలియన్‌ చేర్చాడు.


4

ఐపీఎల్‌ ఫైనల్‌ చేరడం హైదరాబాద్‌ ఫ్రాంఛైజీకి ఇది నాలుగోసారి. 2009, 2016లో టైటిల్‌ గెలిచిన ఆ జట్టు 2018లో ఫైనల్లో ఓడింది. ఇందులో మూడు సందర్భాల్లో ఆస్ట్రేలియా క్రికెటరే హైదరాబాద్‌ జట్టుకు కెప్టెన్‌ కావడం విశేషం. ఇంతకుముందు గిల్‌క్రిస్ట్‌ (డెక్కన్‌ ఛార్జర్స్, 2009), వార్నర్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్, 2016) కెప్టెన్లుగా ఉన్నారు. ఇప్పుడు కమిన్స్‌ జట్టుకు సారథి.


హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) అశ్విన్‌ (బి) సందీప్‌ 34; అభిషేక్‌ (సి) క్యాడ్‌మోర్‌ (బి) బౌల్ట్‌ 12; త్రిపాఠి (సి) చాహల్‌ (బి) బౌల్ట్‌ 37; మార్‌క్రమ్‌ (సి) చాహల్‌ (బి) బౌల్ట్‌ 1; క్లాసెన్‌ (బి) సందీప్‌ 50; నితీశ్‌ (సి) చాహల్‌ (బి) అవేష్‌ 5; సమద్‌ (బి) అవేష్‌ 0; షాబాజ్‌ (సి) జురెల్‌ (బి) అవేష్‌ 18; కమిన్స్‌ నాటౌట్‌ 5; ఉనద్కత్‌ రనౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 175; వికెట్ల పతనం: 1-13, 2-55, 3-57, 4-99, 5-120, 6-120, 7-163, 8-170, 9-175; బౌలింగ్‌: బౌల్ట్‌ 4-0-45-3; అశ్విన్‌ 4-0-43-0; సందీప్‌ శర్మ 4-0-25-2; అవేష్‌ ఖాన్‌ 4-0-27-3; చాహల్‌ 4-0-34-0

రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) సమద్‌ (బి) షాబాజ్‌ 42; క్యాడ్‌మోర్‌ (సి) త్రిపాఠి (బి) కమిన్స్‌ 10; శాంసన్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) అభిషేక్‌ 10; పరాగ్‌ (సి) అభిషేక్‌ (బి) షాబాజ్‌ 6; జురెల్‌ నాటౌట్‌ 56; అశ్విన్‌ (సి) క్లాసెన్‌ (బి) షాబాజ్‌ 0; హెట్‌మయర్‌ (బి) అభిషేక్‌ 4; పావెల్‌ (సి) అభిషేక్‌ (బి) నటరాజన్‌ 6; బౌల్ట్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 139; వికెట్ల పతనం: 1-24, 2-65, 3-67, 4-79, 5-79, 6-92, 7-124; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-33-0; కమిన్స్‌ 4-0-30-1; నటరాజన్‌ 3-0-13-1; జైదేవ్‌ ఉనద్కత్‌ 1-0-5-0; షాబాజ్‌ అహ్మద్‌ 4-0-23-3; అభిషేక్‌శర్మ 4-0-24-2; మార్‌క్రమ్‌ 1-0-10-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని