IPL 2024: లీగ్‌ స్టేజ్‌లో చివరి రోజు.. ‘నంబర్‌ 2’ ఎవరిది..?

ఇప్పుడు ప్లేఆఫ్స్‌ బెర్తుల ఆట లేదు. కానీ, ఇవాళ తలపడనున్న నాలుగు జట్లలో రెండింటికి ఈ మ్యాచ్‌లు అత్యంత కీలకం.  

Updated : 19 May 2024 14:00 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్ 17వ సీజన్ లీగ్‌ స్టేజ్‌ ఆఖరికి చేరుకుంది. ఇవాళ జరగనున్న రెండు మ్యాచ్‌లతో గ్రూప్‌ దశ ముగిసినట్లే. ఇప్పటికే ప్లేఆఫ్స్ ఖరారైనా సరే.. ఈ మ్యాచ్‌ల ఫలితాలు ముఖ్యమే. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు ఓడినా మరో అవకాశం ఉంటుంది. ఇప్పటికే అగ్రస్థానం ఖాయం కాగా.. రెండో స్థానంలోకి వచ్చే అవకాశం హైదరాబాద్, రాజస్థాన్‌ జట్లకు మాత్రమే ఉంది.

హైదరాబాద్ X పంజాబ్‌..

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హైదరాబాద్‌ది మూడో స్థానం. ఈ జట్టు ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి. తన చివరి లీగ్‌ మ్యాచ్‌ను పంజాబ్‌తో ఉప్పల్ వేదికగా మధ్యాహ్నం 3.30గంటలకు ఆడనుంది. ఇందులో పీబీకేఎస్ గెలిచినా పెద్దగా ఉపయోగం లేదు. ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ను జితేశ్‌ శర్మ నడిపిస్తాడు. ఒక్కస్థానం పైకి ఎగబాకే అవకాశం మాత్రమే ఉంది. కానీ, సన్‌రైజర్స్ గెలిస్తే 17 పాయింట్లతో  తాత్కాలికంగా రెండో స్థానంలోకి వస్తుంది. ఇదే ప్లేస్‌ ఖరారు కావాలంటే మాత్రం ఇంకాస్త సమయం వేచి చూడాలి. ఇవాళ రాత్రికి (7.30 గంటలకు ప్రారంభం) జరిగే మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఓటమిని చవిచూడాలి. ఒకవేళ కేకేఆర్ X ఆర్‌ఆర్‌ మ్యాచ్‌ రద్దైతే నెట్‌రన్‌రేట్‌ కీలకంగా మారుతుంది. 

రాజస్థాన్ X కోల్‌కతా  

గువాహతి వేదికగా లీగ్‌ చివరి మ్యాచ్‌ జరగనుంది. ఇందులో కేకేఆర్‌ గెలిచినా.. ఓడినా తన తొలి స్థానానికి వచ్చే ప్రమాదం లేదు. కానీ, ఆర్‌ఆర్‌ విజయం సాధిస్తే మాత్రం రెండో స్థానంతో నాకౌట్‌లో ఆడుతుంది. అయితే, గత నాలుగు మ్యాచుల్లోనూ ఓడిపోయిన రాజస్థాన్‌ ప్లేఆఫ్స్‌కు ముందు విజయంతో వెళ్లాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. అయితే, అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉన్న కోల్‌కతాను ఢీకొట్టడం తేలికైన విషయం కాదు. 

వర్షార్పణం అయితే.. 

ఈ రెండు మ్యాచ్‌లకూ వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. అలా జరిగితే కోల్‌కతా 20 పాయింట్లు, రాజస్థాన్‌ 17, హైదరాబాద్‌ 16, బెంగళూరు 14 పాయింట్లతో నాకౌట్‌లో తలపడతాయి. అప్పుడు తొలి క్వాలిఫయర్‌లో మళ్లీ కేకేఆర్‌ - ఆర్‌ఆర్‌ మ్యాచ్‌ను చూస్తాం. గెలిచిన టీమ్‌ నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఎలిమినేటర్‌లో ఎస్‌ఆర్‌హెచ్ - ఆర్సీబీ ఢీకొట్టుకుంటాయి. ఇందులో గెలిచిన జట్టు.. తొలి క్వాలిఫయర్‌లో ఓడిన టీమ్‌తో ఫైనల్‌ బెర్తు కోసం పోటీ పడనుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని