Virat Kohli: ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: విరాట్

తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు.

Updated : 19 May 2024 08:17 IST

బెంగళూరు: తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అన్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్‌రేట్‌పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. ‘‘కొన్ని విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదు. మైదానంలో ఏం చేయగలనో నాకు తెలుసు. ఎలాంటి ఆటగాడినో.. నా సత్తా ఏంటో ఎవరికి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మ్యాచ్‌లు ఎలా గెలిపించాలో నేనెవరినీ అడగలేదు. అనుభవంతో నేర్చుకున్నా. నన్నెవరూ ఏమీ అనొద్దు లాంటి మాటలు చెప్పను. అలాగే నేనెలా ఆడాలన్న విషయంలో ఎవరి ఆమోదం అవసరం లేదు’’ అని కోహ్లి చెప్పాడు. కోహ్లి స్ట్రైక్‌రేట్‌ తక్కువగా ఉండటంపై దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ఐపీఎల్‌లో ఇంపాక్ట్‌ ప్లేయర్‌ నిబంధన తనకు నచ్చలేదన్న రోహిత్‌శర్మ వ్యాఖ్యలతో కోహ్లి ఏకీభవించాడు. ‘‘ఇంపాక్ట్‌ నిబంధన విషయంలో రోహిత్‌ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా. ఇది అభిమానులకు వినోదం ఇస్తున్నా.. ఆట సమతూకాన్ని దెబ్బ తీస్తోంది. బ్యాటర్లు చెలరేగుతుంటే బౌలర్లకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ప్రతి జట్టులోనూ బుమ్రా, రషీద్‌ లాంటి బౌలర్లు ఉండరు. బ్యాట్, బంతికి మధ్య సమతూకం ఉంటేనే ఆట అందంగా కనబడుతుంది.  క్రికెట్‌ అంటే ఫోర్లు, సిక్స్‌లే కాదు. సమతూకం ఉంటే 160 పరుగులను కూడా కాపాడుకోవచ్చు. ఈ నిబంధనను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టామని.. బీసీసీఐ కార్యదర్శి జైషా ఇటీవలే అన్నాడు. దీనిపై చర్చించి ఆటకు మేలు కలిగేలా నిర్ణయం తీసుకోవాలని ఆశిస్తున్నా’’ విరాట్‌ పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని