Ashwin - Eliminator: పొత్తికడుపు గాయంతో బాధపడ్డా.. వయసు పెరుగుతోంది కదా: అశ్విన్‌

ఎలిమినేటర్ మ్యాచ్‌లో బెంగళూరును చిత్తు చేసి రాజస్థాన్‌ రెండో క్వాలిఫయర్‌లో అడుగు పెట్టింది. ఆర్ఆర్‌ విజయంలో రవిచంద్రన్ అశ్విన్‌ కీలక పాత్ర పోషించాడు.

Updated : 23 May 2024 12:00 IST

ఇంటర్నెట్ డెస్క్: భారీ హిట్టర్లు ఉన్న బెంగళూరు జట్టును అడ్డుకోవడంలో పేసర్లు సందీప్ శర్మ, అవేశ్‌ ఖాన్ ఇబ్బంది పడ్డారు. వీరిద్దరూ ధారాళంగా పరుగులు సమర్పించారు. బౌల్ట్ నాణ్యమైన పేస్‌తో ఆకట్టుకున్నాడు. మణికట్టు మాంత్రికుడు చాహల్ (1/43) కూడా ప్రభావం చూపించలేదు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ (2/19) పదునైన బౌలింగ్‌తో బెంగళూరును అడ్డుకున్నాడు. కీలకమైన గ్రీన్‌తోపాటు మ్యాక్స్‌వెల్‌ (0)ను ఔట్ చేసి రాజస్థాన్‌ పైచేయి సాధించేలా చేశాడు. అతడికే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. క్వాలిఫయర్‌ 2కి దూసుకెళ్లిన తమ జట్టు గత ప్రదర్శనపై అశ్విన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘‘మేం గత నాలుగు మ్యాచుల్లో ఓడిపోయాం. కొన్ని అంశాల్లో ఇబ్బంది పడ్డాం. ప్రత్యర్థుల ముందు భారీ స్కోర్లు ఉంచలేకపోయాం. బట్లర్ స్వదేశానికి వెళ్లిపోయాడు. హెట్‌మయెర్‌ ఈ మ్యాచ్‌కు ముందు గాయపడ్డాడు. ఇప్పుడీ విజయం మాకు అత్యంత కీలకం. ఇది ఆత్మవిశ్వాసం నింపింది. రెండో క్వాలిఫయర్‌లో మరింత ఉత్సాహంగా పోరాడతాం. ఈ సీజన్‌ తొలి అర్ధభాగంలో నా శరీరం అనుకున్నంతమేర సహకరించలేదు. అసౌకర్యంగా అనిపించింది. పొత్తికడుపులో గాయం ఇబ్బందికి గురి చేసింది. దాని నుంచి కోలుకుని వచ్చా. టెస్టు క్రికెట్ ఆడి నేరుగా ఇలాంటి మెగా లీగ్‌కు రావడం.. కుదురుకోవడం చాలా కష్టం. టీ20 ఫార్మాట్‌కు తగ్గట్టుగా బౌలింగ్‌ లయను అందుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఒక్కసారి ఫ్రాంచైజీ కోసం కమిట్‌మెంట్‌ ఇచ్చినప్పుడు తీవ్రంగా శ్రమించైనా ఫలితం అందించాలి. ఈ మ్యాచ్‌లో బౌల్ట్‌ సరైన లెంగ్త్‌తో బౌలింగ్‌ ప్రారంభించాడు. స్వింగ్‌ను రాబట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌కు మంచు ప్రభావం ఉండే ఉంటుంది. మా బ్యాటర్లు కూడా అద్భుతమైన షాట్లతో బెంగళూరుపై ఆధిపత్యం ప్రదర్శించారు. అనుభవం కలిగిన క్రికెటర్లతోపాటు యువకులూ ఉండటం మా బలం. హెట్‌మయెర్ కీలక సమయంలో జట్టులోకి వచ్చాడు. రోవ్‌మన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా బౌండరీలతో మ్యాచ్‌ను ముగించాడు’’ అని అశ్విన్ తెలిపాడు. 

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు..

  • ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన రాజస్థాన్‌ కెప్టెన్‌ జాబితాలో షేన్‌ వార్న్‌ (31)తో సమంగా సంజూ శాంసన్ నిలిచాడు. 
  • ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌లో అత్యధిక ఓటములను చవిచూసిన తొలి జట్టు బెంగళూరు. 16 మ్యాచుల్లో పదింట్లో పరాజయంపాలైంది.
  • ఒక్క ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్థాన్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌ రియాన్‌ పరాగ్. ఈ ఎడిషన్‌లో అతడు 567 రన్స్‌ సాధించాడు. అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్ల లిస్ట్‌లోనూ అతడిది మూడో స్థానమే. 
  • సెకండ్‌ డౌన్‌ లేదా అంతకంటే కింది బ్యాటింగ్‌ ఆర్డర్‌లో వచ్చి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌ రియాన్. అతడి కంటే ముందు రిషభ్ పంత్ (579) ఉన్నాడు. మరో 13 పరుగులు చేస్తే పంత్‌ను రియాన్‌ అధిగమిస్తాడు. 
  • ఐపీఎల్‌లో ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేకుండా అత్యధిక పరుగులు నమోదైన రెండో మ్యాచ్‌ ఇదే. బెంగళూరు 172 చేయగా.. రాజస్థాన్‌ 174 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (45) టాప్ స్కోరర్.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని