Rahane-Ganguly: రహానె ఆటంటే నాకెప్పుడూ ఇష్టమే: గంగూలీ

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అదరగొడుతూ.. మంచి స్ట్రైక్‌ రేట్‌తో దూసుకెళ్తున్నాడు వెటరన్‌ ప్లేయర్‌ రహానె. అతడి ఆటతీరుపై టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు.

Updated : 06 May 2023 14:58 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌-16 (IPL)లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో చెలరేగుతున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) బ్యాటర్‌ అజింక్య రహానె (Ajinkya Rahane)పై భారత మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) ప్రశంసలు కురిపించాడు. అతడి ఆట అంటే తనకు ముందు నుంచే ఇష్టమని.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ ఫైనల్లో (WTC) గొప్పగా రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.

గతేడాది జనవరి నుంచి టెస్టు సిరీస్‌లకు దూరమైన రహానెను వచ్చే నెల లండన్‌లో జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. వెన్ను గాయంతో శ్రేయస్‌ అయ్యర్‌, రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి రిషభ్‌పంత్‌ డబ్ల్యూటీసీకి దూరమయ్యారు. దీంతో రహానెకు అవకాశం దక్కింది. తాజాగా దీనిపై గంగూలీ స్పందించాడు. ‘‘భారత్‌ తరఫున రహానె చాలా మంచి ప్రదర్శనలు చేశాడు. అవకాశాలు ప్రతిరోజూ రావు. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో తుది జట్టులో చోటు దక్కితే ఆ అవకాశాన్ని అతడు కచ్చితంగా సద్వినియోగపరుచుకుంటాడు. అతడికి ఆల్‌ ది బెస్ట్‌’’ అని గంగూలీ పేర్కొన్నాడు. ఐపీఎల్‌-16లో చెన్నై సూపర్‌కింగ్స్‌ తరఫున రహానే అద్భుతంగా రాణిస్తున్నాడు. గతేడాది కేకేఆర్‌ (KKR) తరఫున ఆడిన అతడు 7 మ్యాచులు ఆడి 144 పరుగులే చేశాడు. కానీ, ప్రస్తుత సీజన్‌లో 6 మ్యాచులు ఆడిన అతడు 189 స్ట్రైక్‌రేటుతో 224 పరుగులు సాధించాడు. అందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

కేఎల్‌ త్వరగా కోలుకోవాలి

గాయం కారణంగా కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) ఐపీఎల్‌-16 సీజన్‌ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. అతడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (WTC) ఫైనల్లోనూ ఆడే అవకాశం లేదని తేలిపోయింది. దీనిపై గంగూలీ స్పందించాడు. ‘‘గాయం కారణంగా కేఎల్‌.. ఐపీఎల్‌తో సహా డబ్ల్యూటీసీకి కూడా దూరమవడం నిజంగా దురదృష్టకరం. ఫిజియోలు మాత్రమే అతడి గాయం తీవ్రతను వెల్లడించగలరు. ఆటలో గాయాలు కూడా ఒక భాగమే. అతడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’’ అని గంగూలీ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని