Shami: ఆ క్యాచ్‌ చేజార్చా.. నా వంతు కోసం వేచి చూశా: షమీ

వన్డే ప్రపంచకప్‌లో (IND vs NZ) టీమ్‌ఇండియా ఫైనల్‌కు చేరుకోవడంలో మహమ్మద్‌ షమీ కీలక పాత్ర పోషించాడు. ఏడు పడగొట్టి న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చాడు.

Updated : 16 Nov 2023 09:31 IST

ఇంటర్నెట్ డెస్క్‌: కీలక సమయంలో సులువైన క్యాచ్‌ను వదిలేయడంతో ఒక్కసారిగా వాంఖడే స్టేడియంలో (IND vs NZ) ప్రేక్షకులంతా సైలెంట్ అయిపోయారు. అప్పటికే క్రీజ్‌లో పాతుకుపోయిన కివీస్‌ కెప్టెన్‌ వికెట్‌ చేజారిందనే బాధ. ఆ క్యాచ్‌ను వదిలేసిన ఫీల్డర్‌ను విలన్‌గా చూసిన అభిమానులకు.. కాసేపట్లోనే అతడే తమ హీరోగా మారిపోయాడు. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. అతడే టీమ్‌ఇండియా పేసర్‌ షమీ (Shami). న్యూజిలాండ్‌తో జరిగిన సెమీస్‌లో బుమ్రా వేసిన స్లోబాల్‌ను అంచనా వేయడంలో విఫలమైన కేన్‌ మిడాన్‌లో క్యాచ్‌ ఇచ్చాడు. కానీ, అక్కడున్న ఫీల్డర్‌ షమీ దానిని వదిలిపెట్టేశాడు. అయితే, షమీనే కేన్‌తోపాటు టామ్‌ లేథమ్‌ను ఒకే ఓవర్‌లో పెవిలియన్‌కు పంపడంతో భారత అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. మ్యాచ్ అనంతరం క్యాచ్‌ డ్రాప్‌పైనా షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘ఈ టోర్నీకి ముందు వరకు ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడలేదు. అయితే, ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. చాలా మంది యార్కర్లు, స్లో బంతుల గురించే మాట్లాడుతుంటారు. కానీ, కొత్త బంతితోనూ వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తున్నా. ఆరంభంలో వికెట్లు తీస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరిగిపోతుంది. కివీస్‌తో మ్యాచ్‌లో కీలకమైన కేన్‌ విలియమ్సన్ క్యాచ్‌ను మిస్‌ చేశా. నాకే బాధేసింది. దీంతో బౌలింగ్‌లో నా వంతు కోసం ఎదురు చూశా. కివీస్‌ బ్యాటర్లు దూకుడుగా షాట్లు ఆడేస్తున్నారు. అయితే, వారిని కట్టడి చేసేందుకు బౌలింగ్‌ ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉన్నా. పిచ్‌ కూడా చాలా బాగుంది. కానీ, తేమ ప్రభావం వస్తుందేమోనని కంగారు పడ్డాం. ఇలాంటి సమయంలో స్లో వేసే బంతులు కూడా ప్రభావం చూపకపోవచ్చు. అందుకే, నేను శైలిలోనే బంతులను సంధించా. మేం 2015, 2019 సెమీస్‌లో ఓటములను చవిచూశాం. అయితే, ఈ సారి మాత్రం వదల్లేదు. ఇలాంటి అవకాశం మరోసారి వస్తుందనే ఆలోచన కూడా చేయడం లేదు’’ అని షమీ తెలిపాడు. ఏడు వికెట్లు తీసిన షమీనే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నాడు.

రోహిత్ ఆరంభమే మాకు కలిసొచ్చింది: శ్రేయస్ అయ్యర్

‘‘భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభంలో దూకుడుగా ఆడాడు. అదే మాకు కలిసొచ్చే అంశం. శుభారంభాన్ని కొనసాగిస్తూ పరుగులు రాబట్టాం. అతడు ఫియర్‌లెస్ కెప్టెన్. దాంతో మిగిలిన వారిలోనూ అదే దూకుడు కనిపిస్తుంది. మేనేజ్‌మెంట్ కూడా ఎంతో మద్దతుగా నిలుస్తోంది. టోర్నీ ప్రారంభంలో నేను మంచి ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయా. బయట నుంచి వచ్చే విమర్శలను ఏమాత్రం పట్టించుకోవద్దని సిబ్బంది మద్దతుగా నిలిచారు. బ్యాటింగ్‌పైనే దృష్టిపెట్టమని సూచించారు. ఒత్తిడి సమయంలోనూ ఎలా ఆడాలనేది తీవ్రంగా శ్రమించా. భారీగా అభిమానుల మధ్య ఇలాంటి పరిస్థితుల్లో ఆడటం ఎంతో సరదాగా ఉంటుంది. నెట్స్‌లోనూ నాణ్యమైన పేస్‌ బౌలింగ్‌తోపాటు స్పిన్నర్లను ఎదుర్కొంటూ సాధన చేశా. కొత్త బంతితో బుమ్రాను అడ్డుకోవడం చాలా కష్టం. అందుకే, నెట్స్‌లో బుమ్రా బౌలింగ్‌లోనూ ప్రాక్టీస్‌ చేశా. ఇదే ఇలా మ్యాచుల్లో రాణించడానికి సాయపడుతోంది’’ అని శ్రేయస్ అయ్యర్‌ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ (105) సెంచరీ సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని