ICC: వరల్డ్‌ కప్‌ ‘ఫైనల్‌’ పిచ్‌ యావరేజ్‌.. వివాదాస్పదమైన భారత్-కివీస్‌ సెమీస్‌ ‘పిచ్‌’ రేటింగ్‌ ఎంతంటే?

భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) పిచ్‌ల రిపోర్ట్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇందులో టీమ్‌ఇండియా ఆడిన లీగ్‌లతోపాటు రెండు సెమీస్‌లు, ఫైనల్‌ మ్యాచ్‌ నివేదికలు ఉన్నాయి.

Updated : 08 Dec 2023 15:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. టీమ్‌ఇండియా వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌కు చేరింది. అయితే, తుది పోరులో ఆసీస్‌ విజేతగా నిలిచి కప్‌ను ఎగరేసుకుపోయింది. ఇరు జట్ల మధ్య జరిగిన ‘ఫైనల్’ కోసం వినియోగించిన పిచ్‌తోపాటు కీలక మ్యాచ్‌లకు సంబంధించిన పిచ్‌ల రేటింగ్‌ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. భారత్-ఆసీస్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరిగిన అహ్మదాబాద్‌ ‘పిచ్‌’కు ఐసీసీ యావరేజ్‌ రేటింగ్‌ ఇవ్వడం గమనార్హం. పిచ్‌ చాలా మందకొడిగా ఉన్నట్లు పేర్కొంది. అయితే అవుట్‌ ఫీల్డ్‌ మాత్రం ‘చాలా బాగుంది’ అని ఐసీసీ మ్యాచ్‌ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ వెల్లడించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా 50 ఓవర్లలో 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్‌ నాలుగు వికెట్లను కోల్పోయి 43 ఓవర్లలో విజయం సాధించింది. ట్రావిస్‌ హెడ్ 120 బంతుల్లోనే 137 పరుగులు చేశాడు.

వాంఖడే ‘గుడ్‌’

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య వాంఖడే వేదికగా తొలి సెమీస్‌ జరిగింది. అయితే, పిచ్‌ను మార్చారంటూ అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు వెలువడటంతో.. ఐసీసీ అధికారులు స్పష్టత ఇచ్చారు. కొత్త పిచ్‌కు బదులు వాడిన పిచ్‌పై మ్యాచ్‌ను నిర్వహించారంటూ బీసీసీఐపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ పిచ్‌కు ఐసీసీ ‘బాగుంది’ అనే రేటింగ్‌ ఇచ్చింది. రెండో సెమీస్‌ జరిగిన కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌కు యావరేజ్‌ రేటింగ్‌ దక్కింది. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీస్‌ జరిగిన విషయం తెలిసిందే. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్‌లో ఆసీస్‌ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 212 పరుగులకు ఆలౌట్‌ కాగా.. ఆస్ట్రేలియా కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు 47.2 ఓవర్లు తీసుకోవాల్సి వచ్చింది. ఐసీసీ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ఈడెన్‌ గార్డెన్స్‌ మైదానం అవుట్‌ ఫీల్డ్‌కు ‘వెరీ గుడ్‌’ రేటింగ్‌ ఇచ్చారు.

భారత లీగ్‌ మ్యాచ్‌లకు..

టీమ్‌ఇండియా దేశవ్యాప్తంగా తొమ్మిది మైదానాల్లో తొమ్మిది లీగ్‌ మ్యాచ్‌లను ఆడింది. కఠినమైన ప్రత్యర్థులు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియాను భారత్‌ ఓడించింది. కోల్‌కతా, లఖ్‌నవూ, అహ్మదాబాద్‌, చెన్నై మైదానాల్లో ఆ జట్లతో టీమ్‌ఇండియా తలపడింది. అయితే, ఆ పిచ్‌లన్నింటికీ ఐసీసీ ‘యావరేజ్‌’ రేటింగ్‌ ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని