Cricket News: ప్లేయర్‌ ఆఫ్‌ ది మంత్‌ రేసులో వరల్డ్‌ కప్‌ హీరోలు.. టీ20 వరల్డ్‌ కప్‌ కొత్త లోగో!

Updated : 09 Dec 2023 16:05 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే వరల్డ్‌ కప్‌లో (ODI World Cup 2023) అత్యుత్తమ ప్రదర్శన చేసిన ముగ్గురు ఆటగాళ్లు  ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు రేసులో నిలిచారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్‌ల (T20 World Cup 2024) కోసం కొత్త లోగోను ఆవిష్కరణ.. రేసిజం పదం వాడిన పొరపాటుపై క్రికెట్‌ ఆస్ట్రేలియా క్షమాపణలు.. ఇలాంటి క్రికెట్ సంగతులు మీ కోసం..

షమీ, హెడ్, మ్యాక్స్‌వెల్‌.. ఎవరికి దక్కేను అవార్డు?

ప్రతి నెల అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఐసీసీ అవార్డును అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో వన్డే ప్రపంచ కప్‌లో అద్భుతంగా ఆడిన ముగ్గురు ప్లేయర్లు ఈసారి నవంబర్‌ అవార్డు కోసం రేసులో నిలిచారు. వారిలో టీమ్‌ఇండియా నుంచి మహమ్మద్ షమీ, ఆసీస్‌ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్‌, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ ఉన్నారు. నవంబర్‌లో జరిగిన వరల్డ్‌ కప్‌ మ్యాచుల్లో షమీ 15 వికెట్లు తీశాడు. అంతేకాకుండా మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ ఘనత సాధించాడు.కేవలం 7 మ్యాచుల్లోనే 24 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్‌లో సెంచరీతో అలరించిన ట్రావిస్ హెడ్ 120 బంతుల్లో 137 పరుగులు చేసి ఆసీస్‌ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. మరో ఆటగాడు మ్యాక్స్‌వెల్ మూడు వన్డేల్లో 204 పరుగులు, రెండు వికెట్లు తీశాడు. అలాగే భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సెంచరీ సాధించాడు. 


బ్యాట్‌, బాల్‌, ఎనర్జీ.. పొట్టి కప్ కొత్త లోగోలు

సందడి చేసేందుకు టీ20 ప్రపంచ కప్‌ 2024 సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జూన్‌లో పురుషుల పొట్టి కప్‌ జరగనుండగా.. సెప్టెంబర్-అక్టోబర్ మధ్య మహిళల టీ20 ప్రపంచ కప్‌ ఉంటుంది. వరల్డ్‌ కప్‌లకు సంబంధించి ఐసీసీ కొత్త లోగోలను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఐసీసీ మార్కెటింగ్‌ అండ్ కమ్యూనికేషన్స్‌ జీఎం క్లైయిర్‌ ఫర్లాంగ్ స్పందించారు. ‘‘అంతర్జాతీయంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి పురుషుల, మహిళల ప్రపంచ కప్‌లు సిద్ధమవుతున్నాయి. కొత్తగా ఆవిష్కరించిన లోగోలు ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాం’’ అని తెలిపాడు.


అభిమానులకు క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు

ప్రస్తుతం పాకిస్థాన్‌ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. మూడుటెస్టుల సిరీస్‌ ఆడేందుకు వెళ్లింది. వార్మప్‌ మ్యాచ్‌లో ప్రైమ్‌ మినిస్టర్‌ XI జట్టుతో పాకిస్థాన్‌ తలపడుతోంది. ఈ సందర్భంగా స్కోరు బోర్డుపై పాకిస్థాన్‌ జట్టును ఉద్దేశించి క్రికెట్‌ ఆస్ట్రేలియా (CA) పొరపాటున ఓ పదాన్ని వాడింది. దీంతో ఆస్ట్రేలియాకు చెందిన ఓ జర్నలిస్ట్‌ ఈ విషయాన్ని సీఏ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వెంటనే ఆ పదాన్ని తొలగించిన సీఏ క్షమాపణలు చెబుతూ ప్రకటన జారీ చేసింది. ‘‘ఈ మ్యాచ్‌కు సంబంధించి గ్రాఫిక్‌ ఫీడ్‌ను డేటా ప్రొవైడర్‌ నుంచి తీసుకున్నాం. ఇంతకుముందెప్పుడూ ఈ టెక్నాలజీని పాకిస్థాన్‌ మ్యాచ్‌కు వినియోగించలేదు. అయితే, ఇది అత్యంత విచారకరమే. మాన్యువల్‌గా ఆ పొరపాటును సరిదిద్దాం’’ అని సీఏ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని