Softsignal - ICC: ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’కు మంగళం.. నిబంధనల్లో ఐసీసీ మార్పులు

క్రికెట్లో క్యాచ్‌ ఔట్ల విషయంలో వివాదాస్పదంగా మారిన ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’కు ఐసీసీ మంగళం పాడింది. క్రికెట్‌ నుంచి ఈ నిబంధనను తొలగించింది.

Updated : 16 May 2023 10:02 IST

దుబాయ్‌: క్రికెట్లో క్యాచ్‌ ఔట్ల విషయంలో వివాదాస్పదంగా మారిన ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’కు ఐసీసీ మంగళం పాడింది. క్రికెట్‌ నుంచి ఈ నిబంధనను తొలగించింది. ఇన్ని రోజులు బంతిని ఆటగాళ్లు సరిగ్గా అందుకున్నారా? లేదా నేలకు తాకిందా? అనే అనుమానం ఉన్న క్యాచ్‌ల విషయంలో మైదానంలోని అంపైర్లు ఔట్‌ లేదా నాటౌట్‌ను ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’గా చూపిస్తూ.. టీవీ అంపైర్‌ను తుది నిర్ణయం తీసుకోవాలని అడిగేవాళ్లు. రీప్లేలో పరిశీలించిన తర్వాత స్పష్టత లేకుంటే, గందరగోళ పరిస్థితుల్లో మైదానంలోని అంపైర్‌ తీసుకున్న ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’ను సమర్థిస్తూ టీవీ అంపైర్‌ నిర్ణయం తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నాటౌట్‌లా కనిపించినప్పటికీ మైదానంలోని అంపైర్‌ ‘సాఫ్ట్‌ సిగ్నల్‌’ ఔట్‌గా ఇవ్వడం, టీవీ అంపైర్‌ దీన్ని సమర్థించడం చాలా సార్లు వివాదాస్పదమైంది. ఇకపై ఇలాంటి సాఫ్ట్‌ సిగ్నల్‌ ఉండదు. రనౌట్‌ మాదిరే నేరుగా టీవీ అంపైర్‌ను క్యాచౌట్‌ నిర్ణయం తీసుకోమని అడగొచ్చు. సౌరభ్‌ గంగూలీ సారథ్యంలోని పురుషుల క్రికెట్‌ కమిటీతో పాటు మహిళల క్రికెట్‌ కమిటీ చేసిన ప్రతిపాదనలకు సీఈసీ ఆమోదం తెలపడంతో ఐసీసీ ఈ మార్పు చేసింది.

‘‘సాఫ్ట్‌ సిగ్నల్‌ను తొలగించడమే ప్రధాన మార్పు. టీవీ అంపైర్‌ను నిర్ణయాలు కోరేటప్పుడు ఇకపై మైదానంలోని అంపైర్ల సాఫ్ట్‌ సిగ్నల్‌ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేరుగానే టీవీ అంపైర్‌ను సంప్రదించొచ్చు’’ అని ఐసీసీ ప్రకటించింది. ‘‘కొన్నేళ్లుగా క్రికెట్‌ కమిటీ సమావేశాల్లో సాఫ్ట్‌ సిగ్నల్‌ గురించి చర్చించాం. ఈ విధానం అనవసరమని కమిటీ అభిప్రాయపడింది. కొన్ని సార్లు రిప్లేలో స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి’’ అని గంగూలీ తెలిపాడు. మరోవైపు ఫాస్ట్‌బౌలర్లను ఎదుర్కొనే బ్యాటర్లు, వికెట్లకు సమీపంలో ఉండే వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌కు అత్యంత సమీపంలో ఉండే ఫీల్డర్లు హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని ఐసీసీ సూచించింది. అంతే కాకుండా ఫ్రీ హిట్‌ బంతి స్టంప్స్‌ను తాకి వెళ్తే అప్పుడు పరుగులు తీసుకోవచ్చని కూడా స్పష్టం చేసింది. ఈ మార్పులు వచ్చే    నెల 1న ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌ మధ్య ఆరంభమయ్యే టెస్టుతో అమల్లోకి వస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని