Test Cricket: టెస్టులు ఇలానే ఉంటే.. అభిమానులకు ఏం మజా!

టెస్టుల్లో ఏ జట్టును విజయం వరిస్తుందనే ఆసక్తి ఐదో రోజు వరకూ ఉంటేనే మజా. అలా కాకుండా కేవలం రెండు రోజుల్లోపే ఫలితం వస్తే అభిమానులకు పెద్దగా ఆసక్తి ఉండదు.

Published : 05 Jan 2024 16:33 IST

క్రికెట్లో టెస్టులే (Test Cricket) అత్యున్నతం.. ప్రతి ఆటగాడు ఈ విషయాన్ని అంగీకరిస్తాడు. ఎందుకంటే దీనికి ఉన్న భిన్నత్వం..విలువ వేరు. అయిదురోజుల ఆట రోజుకో మలుపు తిరుగుతూ అభిమానులను అలరిస్తుంది. సెషన్‌కో ట్విస్టుతో క్రికెట్లో అసలు మజాను అందిస్తుంది. అలాంటి టెస్టులు అయిదురోజులు జరిగి ఫలితం వస్తేనే అసలైన ఆనందం. అలాంటిది చెత్త పిచ్‌ల వల్ల రెండు, మూడు రోజుల్లోనే ముగిసిపోతే ఏం బాగుంటుంది. అభిమానులకు ఏం సంతోషం మిగులుతుంది. ఆటగాళ్లకు ఆ సంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది. తాజాగా భారత్‌-దక్షిణాఫ్రికా (SA vs IND) మధ్య కేప్‌టౌన్‌లో జరిగిన రెండో టెస్టే ఇందుకు తాజా ఉదాహరణ. దాదాపు వన్డేలా ముగిసిపోయి ఇదేం టెస్టు అనిపించింది. 

ఈ మధ్య ఇంతే..

ఇటీవల కాలంలో చాలా టెస్టులు ఇలా మూడు రోజుల్లోనే ముగుస్తున్నాయి. ముఖ్యంగా ఉపఖండంలో జరిగే అయిదురోజుల మ్యాచ్‌లు 3 రోజుల్లోనే ముగిసిపోతున్నాయి. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై బ్యాటర్లు నిలవలేకపోతున్నారు. సేనా దేశాలు (ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) కూడా ఇందుకేం మినహాయింపు కాదు. ఉపఖండంలో స్పిన్‌ పిచ్‌లు తయారు చేసి ప్రత్యర్థి జట్లను దెబ్బ కొడితే.. సేనా దేశాల్లో పేస్‌ పిచ్‌లతో బ్యాటర్లు బెంబేలెత్తున్నారు. 145 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇలా తక్కువ వ్యవధిలో ముగుస్తున్న టెస్టులు ఈ మధ్య కాలంలోనే అధికమవుతున్నాయి. ఇది టెస్టు క్రికెట్‌కు ప్రమాద హెచ్చరికే. ఎందుకంటే స్పోర్టింగ్‌ పిచ్‌లు ఉంటేనే ఆట రంజుగా సాగుతుంది. అయిదురోజులపాటు మ్యాచ్‌ మలుపులు తిరిగి చివరిరోజు ఫలితం తేలితే ఆ ఆనందం వేరేగా ఉంటుంది. సునీల్‌ గావస్కర్‌ లాంటి మాజీలు కూడా ఈ విషయాన్నే చెబుతున్నారు. నాసిరకం పిచ్‌లు, బిలో యావరేజ్‌ పిచ్‌ల వల్ల టెస్టు క్రికెట్‌ ప్రమాదంలో పడుతుందని మాజీలు హెచ్చరిస్తున్నారు. డి మెరిట్‌ పాయింట్లు కేటాయించడం ఈ సమస్యకు పరిష్కారం కాదని.. క్రికెట్‌ బోర్డుల దృక్పథంలో మార్పు రావాలని అంటున్నారు.

తిరిగితే ఒకలా.. ఎగిరితే ఇంకోలా

భారత పిచ్‌లపై విపరీతంగా బంతులు తిరిగి తక్కువ రోజుల్లో మ్యాచ్‌లు ముగిసిపోతే ప్రత్యర్థి జట్ల మాజీ ఆటగాళ్లు, మీడియా చేసే హడావుడి అంతా ఇంతా కాదు. 2021 భారత పర్యటనలో అహ్మదాబాద్‌ టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఇంగ్లాండ్‌ 193 పరుగులే చేయగలిగింది. దీంతో ఇంగ్లాండ్‌ మాజీ రెచ్చిపోయి మాట్లాడారు. కానీ పేస్‌కు అనుకూలమైన పిచ్‌లపై మూడ్రోజుల్లోనే మ్యాచ్‌లు పూర్తయినప్పుడు మాత్రం ఎవరూ నోరెత్తలేదు. టెస్టు క్రికెట్‌ మనుగడ గురించి మాట్లాడలేదు. తాజాగా కేప్‌టౌన్‌ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే పూర్తవడంతో భారత కెప్టెన్‌ రోహిత్‌శర్మ కూడా ఇదే మాట అన్నాడు. స్పిన్‌ పిచ్‌లపై బంతి తిరిగితే ఒప్పుకోరు కానీ పేస్‌ పిచ్‌లపై బంతి ఎగిరితే మాత్రం మాట్లాడరు అని చురకలంటించాడు. రోహిత్‌ మాట వాస్తవమే కానీ టెస్టు క్రికెట్‌లో అసలైన మజాను ప్రస్తుత తరం ఆస్వాదించాలంటే కచ్చితంగా బంతికి, బ్యాట్‌కు మధ్య సమతూకం ఉండి తీరాలి. ఎవరికి అనుకూలమైన పిచ్‌లు వాళ్లు తయారు చేసుకోవడంలో తప్పు లేదు. అలా అని తొలిరోజే తొలి సెషన్లోనే బంతి గిర్రున తిరిగేలాగో లేక రోజంతా బౌన్స్, స్వింగ్‌ అయ్యేలాగో ఉంటేనే ప్రమాదం. బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బంతిదే ప్రధాన పాత్ర అయినప్పుడు ఇంకా అక్కడ మజా ఎక్కడ ఉంటుంది. అభిమానులకు ఆనందం ఎలా కలుగుతుంది. కేప్‌టౌన్‌ టెస్టును ఉదాహరణగా తీసుకొనైనా ఇకపై స్పోర్టింగ్‌ వికెట్లు తయారు చేస్తే టెస్టు క్రికెట్‌కు మంచిది.

-ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని