INDIA W vs BARBADOS W : ఓడితే ఇంటికే.. బార్బడోస్‌ను తక్కువగా అంచనా వేస్తే కష్టమే!

తొలి మ్యాచ్‌లో తడబడినా.. తదుపరి పోరులో పాక్‌ను చిత్తు చేసి సెమీస్‌ రేసులో నిలబడింది భారత మహిళల క్రికెట్ జట్టు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో భాగంగా ఇవాళ బార్బడోస్‌తో...

Published : 03 Aug 2022 14:32 IST

కామన్వెల్త్‌ గేమ్స్‌లో మహిళల భారత జట్టుకు కీలక పోరు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తొలి మ్యాచ్‌లో తడబడినా.. తదుపరి పోరులో పాక్‌ను చిత్తు చేసి సెమీస్‌ రేసులో నిలబడింది భారత మహిళల క్రికెట్ జట్టు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో భాగంగా ఇవాళ బార్బడోస్‌తో కీలక పోరుకు సిద్ధమైంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు ఆధిక్యం సాధిస్తారు.. బలాలేంటి.. గెలుపోటములు ఎవరికి ఎలా ఉన్నాయి..?

ఓడితే.. ఇక అంతే సంగతులు

గ్రూప్‌ -Aలో ఆసీస్‌ (4), భారత్ (2), బార్బడోస్‌ (2), పాకిస్థాన్‌ (0)లు ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే సెమీస్‌కు చేరుకున్నట్లే. ఇక రెండో బెర్తు కోసం భారత్‌, బార్బోడస్‌ జట్ల మధ్యే పోటీ. ఇవాళ రాత్రి 10.30గంటలకు (భారత కాలమానం ప్రకారం) బార్బోడస్‌తో జరిగే మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధిస్తే నేరుగా సెమీస్‌కు దూసుకెళ్తుంది. ఒక వేళ ఓడితే మాత్రం సెమీస్‌ ఆశలు గల్లంతైనట్లే. బార్బోడస్‌కు సెమీస్‌ బెర్తు ఖరారు అవుతుంది. అప్పుడు ఈ గ్రూప్‌ నుంచి ఆసీస్‌తోపాటు బార్బడోస్‌ జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. భారత్, పాక్‌ ఇంటిముఖం పట్టక తప్పదు. ఆసీస్‌, పాక్ జట్ల మధ్య మ్యాచ్‌ కూడా ఇవాళే ఉంది.

పాక్‌నే ఓడించింది.. బీ కేర్‌ఫుల్‌

క్రికెట్‌ అభిమానులకు పెద్దగా పరిచయం లేని జట్టు బార్బడోస్‌ మహిళా క్రికెట్‌ టీమ్‌. కానీ పాకిస్థాన్‌ వంటి జట్టుకే షాక్‌ ఇస్తూ తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధించడం విశేషం. మొదటి మ్యాచ్‌లో తమ జట్టు సాధించిన 144 పరుగులను బార్బోడస్‌ బౌలర్లు కాపాడుకుని మరీ గెలిచారు. కాబట్టి బార్బడోస్‌ బౌలింగ్‌ను భారత క్రికెటర్లు తక్కువగా అంచనా వేస్తే మాత్రం బోర్లాపడటం ఖాయం. కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో బార్బడోస్‌ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించింది. ఆమెతో పాటు షకెరా చాలా పొదుపుగా బౌలింగ్‌ చేసింది. భారత బ్యాటర్లు మాత్రం వారిద్దరితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే  కైసియా నైట్ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకం సాధించింది.

మన బౌలింగ్‌ అదుర్స్‌.. 

కామన్వెల్త్‌ గేమ్స్‌ తొలి మ్యాచ్‌లో ఆసీస్‌పై ఆఖరివరకు పోరాడి ఓటమిపాలైంది టీమ్‌ఇండియా. అయితే తర్వాత సెమీస్‌ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో పాక్‌పై అద్భుత విజయం సాధించింది. బౌలింగ్‌, బ్యాటింగ్ సహా అన్ని విభాగాల్లో రాణించి పాక్‌ను చిత్తు చేసింది. వర్షం వల్ల బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌ను సద్వినియోగం చేసుకున్న టీమ్‌ఇండియా బౌలర్లు.. పాక్‌ బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా 99 పరుగులకే ఆలౌట్‌ చేశారు. బ్యాటింగ్‌లోనూ ఓపెనర్‌ స్మృతీ మంధాన (63*) ధాటిగా ఆడేయడంతో భారీగా నెట్‌ రన్‌రేట్‌ పెరిగిపోయింది. ఇలాంటి ప్రదర్శనే బార్బడోస్‌ మీదా చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో తొలిసారి జరుగుతున్న మహిళల క్రికెట్‌లో పతకం తేవాలంటే ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించాల్సిందే. 

జట్ల వివరాలు (అంచనా): 

భారత్: స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, యస్తికా భాటియా, హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), జెమీమా రోడ్రిగ్స్, సబ్బినేని మేఘన, దీప్తి శర్మ, రాధా యాదవ్, స్నేహ్‌ రాణా, మేఘ్నా సింగ్, రేణుకా సింగ్

బార్బడోస్‌‌: హేలే మాథ్యూస్ (కెప్టెన్), డాటిన్, నైట్, కైషోనా నైట్, అలియా అలెన్‌, అలిసా స్కాట్లెబరీ, షకెరా సెల్మాన్‌, షమిలియా కానెల్, విలియమ్స్‌, బ్రూస్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని