FIFA: నలభై నిమిషాల్లోనే నాలుగు గోల్స్‌ కొట్టేసి..!

బ్రెజిల్‌ (Brazil ) జట్టు రౌండ్‌-16 మ్యాచ్‌లో విశ్వరూపం చూపింది. తొలి నలభై నిమిషాల్లోనే నాలుగుగోల్స్‌ చేసింది. 

Updated : 29 Oct 2023 11:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫిఫా ప్రపంచకప్‌ (FIFA world cup 2022) నాకౌట్‌ రౌండ్‌ మ్యాచ్‌లో ఓ జట్టు ప్రతి పదినిమిషాలకో గోల్‌ చొప్పున కొడుతుంటే.. అవతల జట్టు పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇటువంటి పరిస్థితినే నేడు దక్షిణ కొరియా(south korea) ఎదుర్కొంది. నేడు జరిగిన రౌండ్‌-16 మ్యాచ్‌లో బ్రెజిల్‌-దక్షిణ కొరియా తలపడ్డాయి. ఈ మ్యాచ్‌ పూర్తి ఏకపక్షంగా సాగింది. గ్రూప్‌ దశలో గాయపడి విశ్రాంతి తీసుకొన్న స్టార్‌ ఆటగాడు నెయ్‌మార్‌ ఈ మ్యాచ్‌లో పునరాగమనం చేయడంతోపాటు ఓ గోల్‌ కూడా సాధించాడు.  

మ్యాచ్‌ తొలి అర్ధభాగంలోనే నాలుగు గోల్స్‌తో బ్రెజిల్‌(Brazil ) ఆటగాళ్లు ప్రత్యర్థుల గోల్‌పోస్టును కకావికలం చేశారు. మ్యాచ్‌ మొదలైన ఏడు నిమిషాలకే బ్రెజిల్‌ వింగర్‌ ఆటగాడు వినిసియస్‌ అద్భుతమైన కిక్‌తో తొలిగోల్‌ అందించాడు. దీంతో బ్రెజిల్‌కు 1-0 ఆధిక్యం లభించింది. ఆ తర్వాత మ్యాచ్‌ 13వ నిమిషంలో దక్షిణ కొరియా (south korea) ఆటగాడు జుంగ్‌ ఊ యంగ్‌ చేసిన పొరబాటుకు ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకొంది. అతడి కిక్‌ రిచర్లీసన్‌కు తాకడంతో బ్రెజిల్‌(Brazil )కు పెనాల్టీ లభించింది. దీనిని నెయ్‌మార్‌ గోల్‌గా మలిచి బ్రెజిల్‌(Brazil ) స్కోర్‌ను 2-0కు చేర్చాడు. ఈ టోర్నీలో భీకరమైన ఫామ్‌లో ఉన్న రిచర్లీసన్‌కు 29వ నిమిషంలో థియాగో సిల్వా నుంచి వచ్చిన పాస్‌ను అద్భుతమైన గోల్‌గా మలిచాడు. దీంతో మ్యాచ్‌ మొదలైన 30 నిమిషాల్లోపే బ్రెజిల్‌ మూడు గోల్స్‌ చేసినట్లైంది. ఇక మరో ఏడు నిమిషాలకు లూకస్‌ పకీటా నాలుగో గోల్‌ చేశాడు. తొలి అర్ధభాగంలోనే బ్రెజిల్‌ మ్యచ్‌ను పూర్తిగా లాగేసుకొంది. 

ఇక ద్వితీయార్థం మొత్తం దక్షిణ కొరియా(south korea)పై ఎదురు దాడులు చేస్తూనే ఉంది. ఈ మ్యాచ్లో బ్రెజిల్‌ (Brazil ) ఎక్కడా ఆత్మరక్షణ శైలిలో ఆడినట్లు కనిపించలేదు. కాకపోతే ద్వితీయార్థంలో బ్రెజిల్‌ జట్టు మరో గోల్‌ చేయకుండా కొరియా ఆటగాళ్లు అడ్డుకొన్నారు. మ్యాచ్‌ 76వ నిమిషంలో కొరియా ఆటగాడు కిమ్‌ సెయూంగ్‌ గ్యూ జట్టుకు తొలిగోల్‌ అందించి పరువు కాపాడాడు. మ్యాచ్‌ అనంతరం బ్రెజిల్‌ ఆటగాళ్ల సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విజయంతో ప్రపంచకప్‌ (FIFA world cup 2022) క్వార్టర్‌ఫైనల్స్‌లో బ్రెజిల్‌ జట్టు కొయేషియాతో తలపడనుంది. 

రికార్డులు..

* మూడు వేర్వేరు ప్రపంచకప్‌ల్లో గోల్స్ చేసిన మూడో బ్రెజిలియన్‌ ఆటగాడిగా నెయ్‌మార్‌ నిలిచాడు. అంతకుముందు ఈ ఫీట్‌ సాధించిన ఆటగాళ్లలో పీలే, రొనాల్డో ఉన్నారు. 10వ నెంబర్‌ జెర్సీతో ఆడుతున్న నెయ్‌మార్‌కు ఇది 7వ ప్రపంచకప్‌ గోల్‌. గతంలో బ్రెజిల్‌, రష్యాలు ఆతిథ్యమిచ్చిన టోర్నీల్లో కూడా గోల్స్‌ చేశాడు.

* రిచర్లీసన్‌ ఈ టోర్నీలో మూడు గోల్స్‌ పూర్తి చేశాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని