IND vs ENG: వీళ్లతో ప్రమాదం.. భీకర ఫామ్‌లో ఉన్నారు..!

ఎప్పుడో 2007 ద్రవిడ్‌ కెప్టెన్సీలో చివరగా ఇంగ్లాండ్‌లో టెస్ట్ సిరీస్‌ గెలిచింది. ఆ తరవాత 2011, 2014, 2018 ఇలా అన్ని పర్యటనల్లో టీమ్‌ఇండియాకు అక్కడ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. 2021లో విరాట్‌ కోహ్లీ సారథిగా ఇక ఇంగ్లాండ్‌లో సిరీస్‌...

Updated : 01 Jul 2022 12:15 IST

ఇంగ్లాండ్‌తో సిరీస్‌ గెలవాలంటే వీరిని ఆపాలి

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడో 2007 ద్రవిడ్‌ కెప్టెన్సీలో చివరగా ఇంగ్లాండ్‌లో భారత్‌ టెస్టు సిరీస్‌ గెలిచింది. ఆ తరవాత 2011, 2014, 2018 ఇలా అన్ని పర్యటనల్లో టీమ్‌ఇండియాకు అక్కడ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. 2021లో విరాట్‌ కోహ్లీ సారథిగా ఇక ఇంగ్లాండ్‌లో సిరీస్‌ విజయం ఖాయం అనుకున్నారంతా. కానీ సిరీస్‌లో మిగిలి ఉన్న చివరి (ఐదో) మ్యాచ్‌ను కరోనా వాయిదా పడేలా చేసింది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 2-1తో ఆధిక్యంలో ఉంది. వాయిదా పడిన ఆ టెస్టు నేటి నుంచి ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌ని టీమ్‌ఇండియా గెలిచినా, డ్రా చేసుకున్న మరో చారిత్రాక సిరీస్‌ సొంతం చేసుకున్నట్లే. అయితే అదంత సులభం కాదు. ఎందుకంటే ఇంగ్లిష్‌ బ్యాటర్లు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. వీరిని కట్టడి చేస్తేనే భారత్‌ గట్టెక్కగలుగుతుంది. 15 ఏళ్ల క్రితం కెప్టెన్‌గా సిరీస్‌ విజయాన్ని అందించిన ద్రవిడ్‌.. ఇప్పుడు కోచ్‌గా ఇంగ్లాండ్‌ బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేసేలా ఎలాంటి వ్యూహరచనలు చేస్తాడో చూడాలి మరి.

 జోరుమీదున్న జో రూట్‌

జో రూట్‌.. ఇప్పుడు ప్రపంచ టెస్టు క్రికెట్‌లో నెం.1 బ్యాటర్‌. మ్యాచ్‌ ఏ జట్టుతో అయినా సెంచరీలు అలవోకగా బాదేస్తున్నాడు. ప్రత్యర్థులు రూట్‌ వికెట్‌ తీయాలంటే తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి.  నిలకడగా రాణిస్తున్న రూట్‌కు టీమ్‌ఇండియాపై అద్భుతమైన రికార్డు ఉంది.  భారీ శతకాలతో జట్టుకు మంచి ఆధిక్యాన్ని తీసుకురావడంలో రూట్‌ కీలకపాత్ర పోషిస్తాడు. అతడిని ఆపలేకే గతేడాది జరిగిన ఇదే టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా మంచి ఆధిక్యాలను కోల్పోయింది. ఇతడిని నిలువరించాలంటే భారత జట్టు పక్కాగా ప్రణాళికలు అమలు చేయాలి. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌తో ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 94 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 80.


బెంబేలెత్తిస్తున్న బెన్‌ స్టోక్స్‌

ప్రస్తుత ఇంగ్లాండ్‌ టెస్టు జట్టు సారథి బెన్‌ స్టోక్స్‌ ప్రపంచ క్రికెట్‌లో మేటి ఆల్‌రౌండర్లలో ఒకడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తన ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగలడు. 2019 యాషెస్‌ సిరీస్‌లో అతడి ఇన్నింగ్స్‌ అందుకు నిదర్శనం. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో ఇంగ్లాండ్‌ జట్టు స్కోరు 286/9. విజయానికి ఇంకా 73 పరుగులు కావాలి. అప్పటికే ఆసీస్‌ బౌలర్లు విజృంభిస్తున్నారు. అయితే పోరాడుతున్న స్టోక్స్‌.. క్రీజులోకి వచ్చిన టెయిలెండర్‌ లీచ్‌తో కలిసి అద్భుతమే సృష్టించాడు. 135 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు ఒంటి చేత్తో ఓడిపోయే విజయాన్ని అందించాడు.  ఇలాంటి ఇన్నింగ్స్‌లు అతడి బ్యాట్‌నుంచి ఎప్పుడైనా వస్తాయి. అతడికి భారత్‌పై గొప్ప రికార్డు లేదని తక్కువ అంచనా వేస్తే అంతే సంగతులు. ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌తో ఆడిన ఒక టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 27 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 21. అయితే ఇక్కడ సారథిగా బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ను ఇంగ్లాండ్‌ జట్టు అతడి నుంచి ఆశిస్తోంది.


భీకర ఫామ్‌లో బెయిర్‌ స్టో

ఇక విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడటం జానీ బెయిర్‌స్టో శైలి. అలవోకగా బౌండరీలు కొట్టడంలో దిట్ట. అయితే ఇవన్నీ టీ20 బ్యాటర్ లక్షణాలు అనుకోవచ్చు. అవును టెస్టు క్రికెట్‌లోనూ టీ20 తరహా ఆటతో జట్టును ఎలా గెలిపించవచ్చో తాజాగా నాటింగ్‌హామ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో నిరూపించాడు బెయిర్‌ స్టో. ఇంగ్లాండ్‌ లక్ష్యం 300 పరుగులు. 93 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఐదో రోజు ఆటలో ఇంగ్లాండ్‌కు పరాభవం ఖాయం అనుకున్నారంతా. మహా అయితే గట్టిగా పోరాడితే డ్రా అవుతుంది. ఇదే అందరి ఆలోచన. అయితే అప్పుడే మొదలైంది బెయిర్‌ స్టో షో. 92 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 136 పరుగులు చేసి డ్రా దిశగా సాగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను అనూహ్యంగా గెలిపించాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌ చాలు అతడెంత ప్రమాదకర బ్యాటరో చెప్పడానికి. అంతేకాదు ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో 3 సెంచరీలు చేసి సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇటువంటి ఆటగాడిని భారత్‌ నిలువరించకపోతే క్షణాల్లో మ్యాచ్‌ ఫలితాన్ని  మార్చేస్తాడు. అయితే, టీమ్‌ఇండియాపై అతడి ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. కానీ, ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉండటం, సొంతగడ్డపై ఆడుతుండటంతో చెలరేగే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని