IND vs ENG: జడేజా ఈజ్‌ బ్యాక్‌.. అతడుంటే ఓ భరోసా..!

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు బ్యాట్‌తో ఇటు బంతితో టీమ్‌ఇండియాకు కీలకమైన ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తాడు...

Updated : 03 Jul 2022 12:56 IST

టీమ్‌ఇండియా యోధుడు..

టీమ్‌ఇండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు బ్యాట్‌తో ఇటు బంతితో జట్టుకు కీలకమైన ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తాడు. ముఖ్యంగా బ్యాటింగ్‌ పరంగా జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటరిపోరాటం చేయడం అతడి నైజం. ఒకరికి అండగా నిలవాలన్నా.. ఒకరు అతడికి అండగా నిలిచినా కష్టాల్లో ఉన్న జట్టును గట్టెక్కిస్తాడు.  లోయర్‌ ఆర్డర్‌లో కనీసం 50 పరుగులు చేసి జట్టు నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడు. అందుకే అతడంటే ఓ భరోసా..

జడ్డూ రాకముందు.. వచ్చాక..

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా ఐదో మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అలాంటిది చివరికి 416 పరుగులు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. జడేజా క్రీజులోకి రాకముందు.. వచ్చాక అదీ పరిస్థితి. టాప్‌ఆర్డర్‌ మొత్తం విఫలమైనా లోయర్‌ ఆర్డర్‌లో మిగిలిన బ్యాట్స్‌మెన్‌తో కలిసి సుమారు 300 పరుగులు జోడించాడు. దీన్ని బట్టే అతడు ఈ మ్యాచ్‌లో ఎలాంటి పాత్ర పోషించాడో అర్థం చేసుకోవచ్చు. తొలుత రిషభ్‌ పంత్‌ (146; 111 బంతుల్లో 20x4, 4x6)తో కలిసి ఆరో వికెట్‌కు 222 పరుగుల విలువైన భాగస్వామ్యం నిర్మించిన జడ్డూ తర్వాత షమి(16)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 48 పరుగులు అందించాడు. అయితే, ఇక్కడ పంతే సగం పరుగులు చేసినా.. టీమ్‌ఇండియా 400 పైచిలుకు స్కోర్‌ చేసిందంటే దానికి కారణం జడేజానే.

పరిణతితో ఆడిన తీరు..

అయితే, ఈ మ్యాచ్‌లో జడేజా క్రీజులోకి రాగానే ఎడాపెడా బౌండరీలు బాదలేదు. నెమ్మదిగా ఇన్నింగ్స్‌ నడిపించాడు. పంత్‌కు సహకరిస్తూనే బ్యాటింగ్‌ కొనసాగించాడు. ఒకవైపు పంత్‌ చెలరేగుతుంటే మరోవైపు స్ట్రైక్‌రొటేట్‌ చేశాడు. దీంతో ఇద్దరూ ఇంగ్లాండ్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే వడివడిగా పరుగులు సాధిస్తూ స్కోర్‌ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. అలా తొలుత 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక.. దాన్ని 100.. 150.. చివరికి 222 పరుగులకు చేర్చారు. అయితే, పంత్‌ ఔటయ్యాక కూడా జడేజా ఎలాంటి తడబాటుకు గురవ్వలేదు. ఎక్కడా తొందరపడలేదు. తొలిరోజు 83 పరుగుల వద్ద నిలిచిన అతడు రెండోరోజు ఆట ఆరంభంలోనూ ఎంతో సంయమనంతో ఆడాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లు చురకత్తుల్లాంటి బంతులేస్తున్నా ధైర్యంగా ఎదుర్కొన్నాడు. షమి వంటి టెయిలెండర్‌తో కలిసి 48 పరుగుల భాగస్వామ్యం నిర్మించాడు. టీమ్‌ఇండియా ఇలా టెస్టుల్లో 100లోపే 5 వికెట్లు కోల్పోయాక 400 పైచిలుకు పరుగులు చేయడం ఇది మూడోసారి మాత్రమే. అంతగొప్ప ప్రదర్శనకు జడేజా కూడా కారణం.

ఈ మ్యాచ్‌కు ముందు జడ్డూ పరిస్థితి ఇదీ..

కాగా, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు జడేజా ఇలా రాణించడం ఇదేం కొత్త కాదు.  కానీ, ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో అతడు ఘోరంగా విఫలమయ్యాడు. ఈసారి టీ20 లీగ్‌లో టోర్నీ ప్రారంభానికి ముందే చెన్నై కెప్టెన్‌గా ఎంపికైన అతడు ఆ జట్టును నడిపించడంలో పూర్తిగా తడబడ్డాడు. ఒత్తిడికి చిత్తయి చేతులెత్తేశాడు. సారథిగానే కాకుండా బ్యాట్స్‌మన్‌గానూ తేలిపోయాడు. 8 మ్యాచ్‌లకు నాయకత్వం వహించి కేవలం రెండు విజయాలే సాధించాడు. అలాగే బ్యాట్స్‌మన్‌గా 10 మ్యాచ్‌ల్లో 116 పరుగులే చేశాడు. స్ట్రైక్‌రేట్‌ 19.33గా నమోదైంది. గత నాలుగేళ్లలో ఇదే అత్యంత దారుణ ప్రదర్శన. దీన్ని బట్టి జడేజా కెప్టెన్‌గా ఎంపికై ఎంత ఒత్తిడికి గురయ్యాడో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే మధ్యలో ఆ బాధ్యతల నుంచి తప్పుకొని తిరిగి ఆటగాడిగా కొనసాగాడు. అయినా సరిగ్గా ఆడలేకపోయాడు. అయితే, ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ బయోబబుల్‌ వీడి ఇంటికెళ్లాడు. చెన్నై టీమ్‌ గాయం కారణంగా ఆడట్లేదని చెప్పింది. దీంతో అతడు ఇప్పట్లో కోలుకోవడం కష్టమని పలువురు క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, ఇంతలోనే తిరిగి భారత జట్టులోకి వచ్చి నేరుగా తొలి మ్యాచ్‌లోనే ఇప్పుడు అద్భుత ప్రదర్శన చేయడం విశేషం.

జడేజా ఆదుకున్న మ్యాచ్‌లు..

* గతేడాది ఇంగ్లాండ్‌ పర్యటనలో ఇదే సిరీస్‌లోని తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా టాప్‌ ఆర్డర్‌ విఫలమైనా జడేజా (56; 86 బంతుల్లో 8x4, 1x6) అర్ధ శతకంతో రాణించాడు. దీంతో జట్టు 95 పరుగుల ఆధిక్యం సంపాదించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, చివరికి ఈ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

* ఈ ఏడాది టీ20 లీగ్‌కు ముందు మొహాలి వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఏకంగా 175 పరుగులు చేశాడు. ఇది అతడి కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్‌. దాంతో టీమ్‌ఇండియా 574/8 (డిక్లేర్డ్‌) భారీ స్కోర్‌ చేసింది. ఆపై బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ కలిపి 9 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఇన్నింగ్స్‌ 222 పరుగుల తేడాతో విజయం సాధించింది.

* 2020లో మెల్‌బోర్న్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జడేజా తొలి ఇన్నింగ్స్‌లో 57 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 3 వికెట్లు తీశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 8 వికెట్ల తేడాతో గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు.

* 2019లో సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ జడేజా 81 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 622/7 (డిక్లేర్డ్‌ ) భారీ స్కోర్‌ చేసింది. అనంతరం ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులు చేయగా జడేజా నాలుగు వికెట్లు తీశాడు. అయితే, ఆ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

2018లో ఓవల్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ జడేజా 86 (నాటౌట్‌) పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అలాగే బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో మొత్తం కలిపి 7 వికెట్లు తీశాడు. అయితే, ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఓటమిపాలైంది.

* 2017లో శ్రీలంక పర్యటనలో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్‌ ఆటగాడిగా వచ్చిన జడేజా 70 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మరోసారి 7 వికెట్లు సాధించాడు. దీంతో టీమ్ఇండియా ఇన్నింగ్స్‌ 52 పరుగుల తేడాతో విజయం సాధించడంలో తనవంతు మెరిశాడు.

* 2017లోనే ధర్మశాల వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో జడేజా 63 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో గెలిచింది.

* 2015లో మొహాలి వేదికగా దక్షిణాఫ్రికాతో ఆడిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 201 పరుగులే చేసింది. అందులో జడేజా (38) రెండో టాప్‌ స్కోరర్‌. అనంతరం ఆ జట్టు 184 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన జడ్డూ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీశాడు. దీంతో టీమ్‌ఇండియా విజయంలో మరోసారి కీలకంగా ఆడాడు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని