IND vs ENG: కట్టడి చేయలేకపోయారు.. కప్పు సాధించలేకపోయారు

ఇంగ్లాండ్‌లో టీమ్‌ఇండియా ఇదివరకు మూడుసార్లు టెస్టు సిరీస్‌లు సాధించినా ఎన్నడూ 3 మ్యాచ్‌లు గెలిచి ఆధిపత్యం చెలాయించ లేదు...

Published : 06 Jul 2022 10:18 IST

టీమ్‌ఇండియా ఓటమికి కారణాలు ఇవేనా?

ఇంగ్లాండ్‌లో టీమ్‌ఇండియా ఇదివరకు మూడుసార్లు టెస్టు సిరీస్‌లు సాధించినా ఎన్నడూ 3 మ్యాచ్‌లు గెలిచి ఆధిపత్యం చలాయించలేదు. అయితే, ఈ సిరీస్‌లో ఐదో టెస్టుకు ముందే 2-1 ఆధిక్యంలో నిలవడంతో ఈసారి చరిత్ర తిరగరాస్తుందని అంతా అనుకున్నారు. అయితే.. జోరూట్‌, బెయిర్‌ స్టో టీమ్‌ఇండియా ఆశలకు గండి కొట్టారు. భారత బౌలర్లు వారిద్దరినీ కట్టడి చేయలేకపోయారు. భారత్‌ కప్పు సాధించలేకపోవడానికి కారణాలను పరిశీలిస్తే..

ప్రమాదం అని తెలిసినా..

ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ జానీ బెయిర్‌ స్టో, జోరూట్‌ ప్రస్తుతం తమ కెరీర్‌ల్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ ఈ ఏడాది శతకాల మీద శతకాలు బాదేస్తున్నారు. 2022లో బెయిర్‌స్టో ఈ ఫార్మాట్‌లో 6 శతకాలు బాదగా.. రూట్‌ 5 శతకాలు సాధించాడు. మరీ ముఖ్యంగా ఇటీవల న్యూజిలాండ్‌తో ఆడిన సిరీస్‌లో ఇంగ్లాండ్‌ గెలవడానికి వీరే కారణం. బెయిర్‌స్టో రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 136, నాలుగో టెస్టులో 162, 71 నాటౌట్‌ పరుగులు చేసి అద్భుతంగా ఆడాడు. మరోవైపు రూట్‌ కూడా తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 115 నాటౌట్‌, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసి గొప్పగా రాణించాడు. అంత ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లపై టీమ్‌ఇండియా ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు కనిపించలేదు. ఒకవేళ ఏమైనా ప్రణాళికలు రచించినా అవి పనిచేసినట్లు అనిపించలేదు.

కోహ్లీ ఇక ఆలోచించాల్సిందే..

టీమ్‌ఇండియా ఓటమికి మరో ప్రధాన కారణం మాజీ కెప్టె్‌న్‌ విరాట్‌ కోహ్లీ (11, 20) బ్యాటింగ్‌. ఈ మాటలు చెప్పడానికి కష్టంగానే ఉన్నా గత రెండున్నరేళ్లుగా సరైన ఫామ్‌లో లేడనేది ఎవరైనా అంగీకరించాల్సిన విషయం. అతడు ఫామ్‌లో లేడని తెలిసి కూడా ఈ సిరీస్‌కు ఎంపిక చేశారు. భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లోనూ విఫలమైనా టోర్నీ పూర్తయ్యాక తగినంత విశ్రాంతి ఇచ్చారు. అయినా ఏమాత్రం ఉపయోగం లేకపోయింది. ఎంత గొప్ప ఆటగాడైనా కెరీర్‌లో ఒడుదొడుకులు ఎదుర్కోవడం సహజమే. కానీ, మరీ ఇంతకాలం విఫలమవ్వడం ఒకింత ఆలోచించాల్సిన విషయం. మరోవైపు ఈ మ్యాచ్‌లో అతడి ఆటతీరులో కొంచెం మార్పు కనిపించిందనేది కాదనలేని వాస్తవం. ముఖ్యంగా ఆడింది కొన్ని షాట్లే అయినా.. అందులో తన క్లాస్‌ చూపించాడు. కానీ, అతడు భారీ ఇన్నింగ్స్‌ ఆడకపోవడమే జట్టు ఓటమికి ఒక కారణంలా మిగిలింది. ఇక అతడిప్పుడు ఏదో ఒక కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. పలువురు నెటిజన్లు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ సరిగ్గా ఆడకపోతే జట్టుకు కష్టమేనని అంటున్నారు.

ఆ ముగ్గురూ దెబ్బకొట్టారు..

ఇక టీమ్‌ఇండియాలో చెప్పుకోవాల్సింది టాప్‌ ఆర్డర్‌ వైఫల్యం గురించి. ఓపెనర్‌ శుభ్‌మన్‌గిల్‌ (17, 4), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి (20, 11), మిడిల్ ఆర్డర్‌ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌ (15, 19).. ఈ ముగ్గురూ పూర్తిగా తేలిపోయారు. గతేడాది ఇదే సిరీస్‌లో ఓపెనర్లుగా ఆడిన రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ ఒకరుకాకపోతే మరొకరు జట్టును ఆదుకున్నారు. కానీ, ఈ మ్యాచ్‌లో గిల్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫలమయ్యాడు. అలాగే మరో ఓపెనర్‌గా వచ్చిన పుజారా (13, 66) తొలి ఇన్నింగ్స్‌లో తడబడినా రెండో ఇన్నింగ్స్‌లో ఫర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌కు ముందు అతడు కౌంటీ క్రికెట్‌లో రెండు సెంచరీలు, రెండు డబుల్‌ సెంచరీలు బాదడంతో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కానీ, వాటిని అతడు అందుకోలేకపోయాడు. మరోవైపు విహారి ఓపెనర్‌ నుంచి మిడిల్‌ ఆర్డర్‌ వరకు ఎక్కడైనా ఆడగలడు. కానీ, వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌గా వచ్చి నిరాశర్చాడు. చివరగా శ్రేయస్‌ అయ్యర్‌ షార్ట్‌పిచ్‌ బంతుల బలహీనతను పసిగట్టిన ఇంగ్లాండ్‌ వాటితోనే రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఔట్‌చేసింది. ఈ ముగ్గురిలో ఏ ఇద్దరు బాగా ఆడినా పరిస్థితులు మరోలా ఉండేవి.

ఇంగ్లాండ్‌ దూకుడు మంత్రం..

మరోవైపు టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించినా ఇంగ్లాండ్‌ ఎక్కడా భయపడలేదు. ఏదేమైనా దూకుడుగా ఆడాలనే ప్రణాళికతోనే బరిలోకి దిగింది. అందుకు తగ్గట్టే ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. ఓపెనర్లు అలెక్స్‌ లీస్‌ (56), జాక్‌ క్రాలే (46) ఆది నుంచి అలాగే ఆడుతూ భారత బౌలర్ల లయను దెబ్బ తీశారు. బుమ్రా, షమి, సిరాజ్‌ల బౌలింగ్‌ను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. దీంతో 9 ఓవర్లకే 50 పరుగులు.. 20 ఓవర్లకే 100 పరుగుల స్కోర్‌ సాధించారు. దీంతో తొలి వికెట్‌కు 107 పరుగులు జోడించి బలమైన పునాది వేశారు. అయితే, స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయినా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. తర్వాత వచ్చిన రూట్‌ (142), బెయిర్‌స్టో (114) ఆదిలో వికెట్‌ కాపాడుకునేందుకు కాస్త నెమ్మదిగా ఆడినా క్రీజులో కుదురుకున్నాక పోటీపడి పరుగులు చేశారు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికే చెరో 70కిపైగా పరుగులు చేసి ఇంగ్లాండ్‌కు విజయంపై భరోసాను కలిగించారు.

హెచ్చరికలు పట్టించుకోలేదు..

అయితే, ఈ మ్యాచ్‌కు ముందే ఇంగ్లాండ్‌ సారథి బెన్‌స్టోక్స్‌ తమ ఆటతీరు గురించి స్పష్టంగా చెప్పాడు. కివీస్‌పై ఆడిన దూకుడు మంత్రాన్నే టీమ్‌ఇండియాపైనా ప్రయోగిస్తామని తెలిపాడు. అయినా, భారత్‌ అతడి మాటలను పట్టించుకున్నట్లు కనిపించలేదు. అందుకు నిదర్శనమే రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ యూనిట్‌ పూర్తిగా చేతులెత్తేయడం. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో మెరిసిన సిరాజ్‌ రెండో ఇన్నింగ్స్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బుమ్రా, షమి సైతం పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. రూట్‌, బెయిర్‌స్టో, స్టోక్స్‌ లాంటి కీలక ఆటగాళ్లతో ఇలాంటి ముఖ్యమైన మ్యాచ్‌లో ప్రతిఘటన ఎదురవుతుందని ఎక్కడా అంచనా వేసినట్లు కనిపించలేదు. బౌలింగ్‌లో పసలేకపోవడం.. ఫీల్డింగ్‌లో పలు తప్పిదాలు.. బంతులు ఎక్కువగా లెగ్‌సైడ్‌ వేయడం వంటివన్నీ టీమ్‌ఇండియా ప్రణాళికలో లోపాలుగా కనిపిస్తున్నాయి. దీంతో జట్టు ఓటమికి ఇవన్నీ కారణాలుగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఇలా తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత ఆధిక్యం సంపాదించినా.. చివరికి ఓడిపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల్లోనైనా గెలవాలని ఆశిద్దాం.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని