Virat Kohli: టీ20ల్లో కోహ్లీకి ఇదే చివరి అవకాశమా?

అతడు క్రీజులో ఉంటే పరుగులు వరదలా పారేవి. సెంచరీలు సలాం కొట్టేవి. ప్రత్యర్థులు అతడిని ఎలా ఔట్‌ చేయాలో అర్థంకాక తలలు పట్టుకునే వారు...

Published : 09 Jul 2022 09:37 IST

జట్టులో స్థానం కోసం యువకుల పోటీ

అతడు క్రీజులో ఉంటే పరుగులు వరదలా పారేవి. సెంచరీలు సలాం కొట్టేవి. ప్రత్యర్థులు అతడిని ఎలా ఔట్‌ చేయాలో అర్థంకాక తలలు పట్టుకునే వారు. ఇదంతా రెండున్నరేళ్ల కిందటి పరిస్థితి. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. సెంచరీలు కాదు కదా కనీసం హాఫ్‌ సెంచరీలు కూడా కష్టమయ్యాయి. అతడు ఫామ్‌లోకి వస్తాడా అనే ప్రశ్నల కన్నా.. రాబోయే టీ20 ప్రపంచకప్‌ జట్టులో ఉంటాడా అనే అనుమానాలే ఎక్కువయ్యాయి. ఇదంతా టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ గురించే!

టెక్నికల్‌ సమస్యా.. మానసిక సమస్యా..

కోహ్లీ కొంతకాలంగా సరైన బ్యాటింగ్‌ చేయలేకపోతున్నాడనే సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసు. అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగిన అతడు ఇన్నాళ్లూ తిరిగి ఫామ్‌లోకి వస్తాడని, ఇంతకుముందులా మళ్లీ పరుగులు చేస్తాడని ఎదురు చూసిన అభిమానులు కూడా ఈ మధ్య మెల్లగా ఆశలు వదులుకుంటున్నారు. ఒక ఆటగాడు ఎంత ఫామ్‌లో లేకపోయినా మరీ ఇంతకాలం విఫలమవ్వడం అనేది ఏ జట్టూ సహించదు. అయితే, కోహ్లీకి ఉన్న ట్రాక్‌ రికార్డు నేపథ్యంలోనే ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే, ఇక్కడ అతడికి కూడా అర్థంకాని విషయం ఏమిటంటే.. తన వైఫల్యానికి టెక్నికల్‌ సమస్యా లేక మానసిక సమస్యా అనేది తేల్చుకోలేకపోతుండటం అని క్రికెట్‌ విశ్లేషకుల అభిప్రాయం.

ఆశలు రేపి.. నిలువునా నిరాశపర్చి..

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో ఈ బెంగళూరు మాజీ సారథి పెద్దగా రాణించలేదనే సంగతి తెలిసిందే. మొత్తం 16 మ్యాచ్‌లు ఆడి కెరీర్‌లో ఎన్నడూ లేని విధంగా 22.73 సగటుతో కేవలం 341 పరుగులే చేశాడు. అయితే, కీలక దశలో గుజరాత్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ (73, 58) అర్ధ శతకాలతో రాణించి అందర్నీ అలరించాడు. ఆ సమయంలో తన షాట్లలో కచ్చితత్వం.. తన ఆటలో పూర్తి ఆత్మవిశ్వాసం కనిపించడంతో ఇక తిరిగి గాడిలో పడినట్లేనని అంతా అనుకున్నారు. కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టి మరీ సంబరపడ్డారు. తీరా బెంగళూరు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాక మళ్లీ పరుగులు చేయలేక విఫలమయ్యాడు. దీంతో ఆశలు రేపి నిలువునా నిరాశపరిచాడు.

విశ్రాంతినిస్తే.. ఇంగ్లాండ్‌లో రాణిస్తాడనుకుంటే..

అయితే, టీ20 లీగ్ సమయంలోనే కోహ్లీ విఫలమవ్వడంపై టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి స్పందిస్తూ కొద్దికాలం విశ్రాంతినివ్వాలని సూచించాడు. శాస్త్రితో పాటు మరికొంత మంది మాజీలు అదే సూచన చేశారు. దీంతో టీమ్‌ఇండియా యాజమాన్యం సైతం ఆలోచించి విశ్రాంతినిచ్చింది. ఆ మెగా టోర్నీ పూర్తయ్యాక జూన్‌లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కూ కోహ్లీని ఎంపిక చేయలేదు. సుమారు నెల రోజులకుపైగా విరామం దొరకడంతో కోహ్లీ కుటుంబంతో కలిసి ప్రశాంతంగా గడిపాడు. దీంతో తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన కీలకమైన ఐదో టెస్టులోనైనా రాణిస్తాడని ఎదురు చూసిన అభిమానులకు మరోసారి నిరాశే మిగిలిచ్చాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ (11, 20) ఘోరంగా విఫలమయ్యాడు.

యువకుల నుంచి పోటీ అధికం..

టీమ్‌ఇండియా ఇప్పుడు ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ ఆడుతోంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ మినహా అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరూ రాణించారు. కెప్టెన్‌ రోహిత్‌తో పాటు దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, దినేశ్‌ కార్తీక్‌ ఇలా బ్యాటింగ్‌ ఆర్డర్‌లోని ప్రతి ఒక్కరూ దంచికొట్టారు. రాబోయే ప్రపంచకప్‌లో ఎలాగైనా జట్టులో స్థానం సంపాదించాలనే కసితో ఈ ఆటగాళ్లంతా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా దీపక్‌ హుడా రెచ్చిపోతున్నాడు. ఇంతకు ముందు ఐర్లాండ్‌తో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో అదరగొట్టడమే కాకుండా ఒక మ్యాచ్‌లో శతకం సాధించాడు. అలాగే ఇంగ్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో కోహ్లీ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి దుమ్ములేపాడు. దీంతో అతడు మూడో స్థానంలో పాతుకుపోయేందుకు ఎదురు చూస్తున్నాడు.

ఇదే చివరి అవకాశమా..?

మరోవైపు ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడిన కోహ్లీ, రిషభ్‌ పంత్, శ్రేయస్‌ అయ్యర్‌, రవీంద్ర జడేజా వంటి ఆటగాళ్లకు తొలి మ్యాచ్‌లో విశ్రాంతినివ్వగా.. వాళ్లంతా రెండో టీ20 నుంచి అందుబాటులోకి వస్తారు. దీంతో ఇప్పటికే ఉన్న ఆటగాళ్లతో పాటు వీరు కూడా కలిస్తే తుది జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారనేది ఆసక్తిగా మారింది. అయితే, కోహ్లీ ఈ ఇంగ్లాండ్‌ పర్యటన తర్వాత వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లబోడని, అప్పుడు విశ్రాంతి తీసుకోవాలని చూస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి ముందు ఇదే అతడికి చివరి ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ కానుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సిరీస్‌లో కోహ్లీ రాణించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ టీమ్‌ఇండియా రెండో టీ20లో దీపక్‌ హుడాను మూడో స్థానంలోనే ఆడించాలని చూస్తే అప్పుడు కోహ్లీ.. ఇషాన్‌ కిషన్‌ స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. దీంతో అతడు రోహిత్‌తో కలిసి బ్యాటింగ్‌ చేయొచ్చు. అలాగైనా అతడు మెరుస్తాడో లేదో చూడాలి. ఒకవేళ ఇప్పుడు కూడా విఫలమైతే ఇక పొట్టి క్రికెట్‌లో అతడి భవితవ్యం ఎలా మారుతుందో చూడాలి.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని