IND vs ENG: ఇంగ్లాండ్‌తో పోరు...ఆశలన్నీ బౌలర్లపైనే..

ఇంగ్లాండ్‌తో కఠిన సవాలును ఎదుర్కోవడానికి టీమ్‌ఇండియా సీనియర్‌ జట్టు సిద్ధమవుతోంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా శుక్రవారం నుంచి జరిగే కీలక పోరులోనూ విజయం...

Updated : 30 Jun 2022 12:24 IST

ఇంగ్లాండ్‌తో కఠిన సవాలును ఎదుర్కోవడానికి టీమ్‌ఇండియా సీనియర్‌ జట్టు సిద్ధమవుతోంది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా శుక్రవారం నుంచి జరిగే కీలక పోరులోనూ విజయం సాధించి.. గతేడాది 2-1తో నిలిచిన ఆధిక్యాన్ని 3-1గా మార్చి సిరీస్‌ కైవసం చేసుకోవాలని చూస్తోంది. దీంతో ఇంగ్లిష్‌ గడ్డపైనా చారిత్రక విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. అయితే, అదంత తేలికేం కాదు.. ఇప్పటికే బ్యాటింగ్‌లో ఫామ్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్ గాయం కారణంగా దూరమవడం.. కెప్టెన్‌ రోహిత్‌ కరోనా బారినపడటం.. కోహ్లీ, పూజారాల ఫామ్‌లపై అనుమానాలు.. ఇవన్నీ చూస్తుంటే బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్‌ గతవారమే న్యూజిలాండ్‌పై టెస్టు సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేసిన నేపథ్యంలో.. టీమ్‌ఇండియా ఆశలన్నీ ఇప్పుడు బౌలింగ్‌ దళంపైనే ఆధారపడ్డాయి.

ఇంగ్లిష్‌ బ్యాటర్లను చుట్టేస్తారా?

గతేడాది ఇంగ్లాండ్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల సిరీస్‌లో నాలుగు ఆటలు పూర్తయ్యేసరికి భారత్‌ ఒక మ్యాచ్‌ డ్రా చేసుకొని 2-1 ఆధిక్యంలో నిలిచింది. అయితే, గతంలో కరోనా కారణంగా వాయిదాపడిన ఐదో టెస్టును ఇప్పుడు తిరిగి నిర్వహిస్తున్నారు. అప్పుడు భారత బౌలర్ల విజృంభించడంతో లార్డ్స్‌, ఓవల్‌ మ్యాచ్‌లను సొంతం చేసుకుంది. ఇక్కడ ప్రధాన పేసర్లు.. జస్ప్రిత్‌ బుమ్రా 4 మ్యాచ్‌ల్లో 18, మహ్మద్‌ సిరాజ్‌ 4 మ్యాచ్‌ల్లో 14, మహ్మద్‌ షమి 3 మ్యాచ్‌ల్లో 14, శార్దూల్‌ ఠాకూర్‌ 2 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు.

ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన ఆరంభ టెస్టులో తొలిరోజు పేసర్లు నిప్పులు చెరగడంతో ఇంగ్లాండ్‌ 65.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. బుమ్రా 4, షమి 3, శార్దూల్‌ 2 వికెట్లతో రాణించారు. ఇక లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఇంగ్లాండ్‌ ముందు 272 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అది కూడా చివరిరోజు ఆటలో 60 ఓవర్లు మాత్రమే మిగిలి ఉన్న కఠిన పరిస్థితుల్లో! కానీ, భారత బౌలర్లు మరోసారి కట్టుదిట్టంగా బంతులేసి ఇంగ్లాండ్‌ పని పట్టారు. కేవలం 51.5 ఓవర్లలోనే 120 పరుగులకు ఆలౌట్‌ చేశారు. సిరాజ్‌ 4, బుమ్రా 3 వికెట్లు తీయడంతో టీమ్‌ఇండియా విజయం సాధించింది. చివరగా ఓవల్‌లో జరిగిన నాలుగో టెస్టులో 367 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్‌ను టీమ్‌ఇండియా 210 పరుగులకే పరిమితం చేసింది. ఉమేశ్‌ యాదవ్‌ 3, బుమ్రా 2, జడేజా 2, శార్దూల్ 2 వికెట్లతో సమష్టిగా రాణించారు.


ఇంగ్లిష్‌ జట్టుపై భారత బౌలర్ల రికార్డు


 శార్దూల్‌, అశ్విన్‌లలో ఎవరు?

అయితే, భారత్‌లో జరిగే మ్యాచ్‌లకు అశ్విన్‌ ప్రధాన స్పిన్నర్‌గా ఉంటాడనే సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఇంగ్లాండ్‌ పిచ్‌లు పేస్‌కు అనుకూలం కాబట్టి.. గత సిరీస్‌లో టీమ్‌ఇండియా నలుగురు పేసర్లు, ఒక స్పిన్నర్‌ వ్యూహంతో బరిలోకి దిగింది. దీంతో జడేజాను తుది జట్టులోకి తీసుకొని.. బ్యాట్స్‌మన్‌, బౌలింగ్‌ సేవలను వినియోగించుకుంది. మరోవైపు ఇంగ్లాండ్‌ అనే కాకుండా మిగతా విదేశీ సిరీస్‌ల్లోనూ టీమ్‌ఇండియా చాలా వరకు ఇదే వ్యూహాన్ని అమలు చేస్తుంది. అవసరాన్ని బట్టి అశ్విన్‌ను ఆడిస్తుంది. కానీ, గతేడాది మాత్రం అతడి లాంటి కీలక స్పిన్నర్‌ను రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం చేసింది. అయితే రేపటి నుంచి ప్రారంభమయ్యే చివరి టెస్టుకు తుది జట్టులో ఆడనిస్తారో లేదో చూడాలి. మరోవైపు బుమ్రా, సిరాజ్‌, షమి తుది జట్టులో ఉండొచ్చని తెలుస్తోంది. నాలుగో బౌలర్‌గా శార్దూల్‌, అశ్విన్‌లలో ఎవరికైనా అవకాశం ఇవ్వొచ్చు. పిచ్‌ పరిస్థితులను బట్టి ఆఖరి నిమిషంలో తుది నిర్ణయం తీసుకునే వీలుంది. ఎందుకంటే వీరిద్దరూ లోయర్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌ చేయగల సమర్థులే.


ఎడ్జ్‌బాస్టన్‌లో ఎవరు రాణించారంటే?

అయితే, 2018లో టీమ్‌ఇండియా చివరిసారి ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌ ఆడింది. అప్పుడు గెలవాల్సిన మ్యాచ్‌ను త్రుటిలో కోల్పోయింది. ఇంగ్లాండ్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 287 పరుగులు చేయగా.. రూట్‌ (80), బెయిర్‌స్టో (70) అర్ధశతకాలతో రాణించారు. టీమ్‌ఇండియా బౌలర్లు అశ్విన్‌ 4, షమి 3 వికెట్లు తీసి మంచి ప్రదర్శన చేశారు. ఇక టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ (149) ఒక్కడే రాణించాడు. సామ్‌ కరన్‌ 4, అండర్సన్‌ 2 వికెట్లు తీశారు. దీంతో ఇంగ్లాండ్‌ 13 పరుగుల స్వల్ప ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ 180 పరుగులకే కుప్పకూలగా.. ఇషాంత్‌ 5, అశ్విన్‌ 3, ఉమేశ్‌ 2 వికెట్లతో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. అయితే, 193 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. స్టోక్స్‌ 4, బ్రాడ్‌ 2, అండర్సన్‌ 2 వికెట్ల ధాటికి 162 పరుగులకే ఆలౌటైంది. కోహ్లీ (51) ఒంటరిపోరాటం చేసినా 31 పరుగుల స్వల్ప తేడాతో భారత్‌ ఓటమిపాలైంది. అయితే, రేపటి నుంచి జరిగే కీలక టెస్టులో షమి, అశ్విన్‌ మరోసారి ఆడి.. చెలరేగితే ఇంగ్లాండ్‌ను కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయి. వీరికి తోడు బుమ్రా, సిరాజ్‌ కూడా రాణించాలని ఆశిద్దాం.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని