IND vs IRL: పసికూనతో పోటీ.. టీమ్‌ఇండియా ఫేవరెటే అయినా..!

భారత క్రికెట్‌ అభిమానులకు పండగే..ఒకవైపు ఇంగ్లాండ్‌ సిరీస్‌కు సీనియర్‌ ఆటగాళ్లు పయనం అయితే..మరోవైపు  యువ భారత్‌ టీ20 వినోదాన్ని అందించడానికి  ఐర్లాండ్‌ చేరుకున్నారు...

Published : 26 Jun 2022 01:51 IST

ఐర్లాండ్‌ను తక్కువ అంచనా వేయొద్దు.. ఎందుకంటే..?

భారత క్రికెట్‌ అభిమానులకు పండగే.. ఒకవైపు ఇంగ్లాండ్‌ సిరీస్‌కు సీనియర్‌ ఆటగాళ్లు పయనం అయితే.. మరోవైపు  యువ భారత్‌ టీ20 వినోదాన్ని అందించడానికి ఐర్లాండ్‌ చేరుకుంది. ఆతిథ్య జట్టుతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జూన్‌ 26 నుంచి ఆడనుంది.  టీమ్‌ఇండియా కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యకు, కోచ్‌గా వీవీయస్‌ లక్ష్మణ్‌కు ఇదే తొలి సిరీస్‌. ప్రధాన ఆటగాళ్లు ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్నా.. ప్రస్తుతం ఈ సిరీస్‌లో భారత్‌ ఫేవరేట్ గానే బరిలోకి దిగుతోంది. అయితే.. ఐరిష్‌ జట్టుని అంత ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు.

ఎందుకు భారతే ఫేవరేట్‌..?

దక్షిణాఫ్రికాతో గత సిరీస్‌లో 0-2 వెనకబడ్డ యువ భారత్‌.. తర్వాత పుంజుకున్న తీరు అద్భుతం. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఈ స్ఫూర్తితోనే ప్రస్తుతం ఐర్లాండ్‌లో అడుగుపెట్టింది. దాదాపు అందరూ ఫామ్‌లోనే ఉండటం కలిసొచ్చే అంశం. ముఖ్యంగా చివరి ఓవర్లలో రెచ్చిపోయే ఫినిషర్లు హార్దిక్‌, కార్తీక్‌.. ప్రారంభంలో ఇషాన్‌ కిషన్‌ మెరుపులు యువ భారత్‌కు ప్రధాన బలం. భువి స్వింగ్‌ , హర్షల్ స్లో బంతులు, అవేశ్‌ పేస్‌, స్పిన్‌తో మాయ చేసే చాహల్‌ను ఎదుర్కొవడం ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలే.

వాళ్లని ఆడిస్తే..

గత సిరీస్‌లో బెంచ్‌కే పరిమితం అయిన దీపక్‌ హూడా, వెంకటేశ్‌ అయ్యర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్షదీప్‌ సింగ్‌, బిష్ణోయ్‌కి తుది జట్టులో అవకాశం ఇస్తే.. సత్తాచాటాలని చూస్తున్నారు. భారత టీ20 లీగ్‌లో గాయపడిన స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ ఈ సిరీస్‌లో పూర్తి ఫిట్‌నెస్‌తో అడుగుపెడుతున్నాడు. సంజూ శాంసన్‌, తొలిసారి భారత జట్టుకు ఎంపికైన రాహుల్‌ త్రిపాఠి.. ఇలా మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేయగల హిట్టర్లు జట్టులో ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరు నిలబడిన.. మ్యాచ్‌పై ఐర్లాండ్‌ ఆశలు వదులుకోవాల్సిందే. అందుకే సీనియర్లు లేకపోయినా సమతూకంగా ఉన్న యువ భారత్‌ ఫేవరేట్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఐర్లాండ్‌ ఫామ్‌లో ఉందా?

ఇటీవల ఒమన్‌లో  2022 టీ20 ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ టోర్నీ జరిగింది. ఇందులో లీగ్‌ దశలో 3 మ్యాచ్‌లు ఆడి ఐర్లాండ్‌ రెండింట్లో గెలిచింది. దీంతో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక్కడ ఒమన్‌పై 56పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్‌ చేరింది. అయితే లీగ్‌ దశలో ఐర్లాండ్‌ను ఓడించిన యూఏఈ... ఫైనల్లో వారిపై 7 వికెట్ల తేడాతో  గెలిచి క్వాలిఫయర్‌ టోర్నీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో ఐర్లాండ్‌ తరఫున బ్యాటింగ్‌లో హర్రీ టెక్టార్‌(4 మ్యాచ్‌ల్లో 116 ), పాల్‌ స్టిర్లింగ్‌ (5 మ్యాచ్‌ల్లో 116 ), గ్రేత్‌ డెన్లీ ( 5 మ్యాచ్‌ల్లో 113), కెప్టెన్‌ ఆండ్రూ బల్‌బిర్ని( 5 మ్యాచ్‌ల్లో 100) పరుగులు చేశారు. బౌలింగ్‌లో క్రెగ్‌ యంగ్‌ 4 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు, జోష్‌ లిటిల్‌ 5 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు, ఆండ్రి మెక్‌బ్రిన్‌ 5 మ్యాచ్‌ల్లొ 6 వికెట్లు పడగొట్టారు.

వీళ్లు రాణిస్తే..

(Photo: Cricket Ireland Twitter)

ఇంగ్లిష్‌ కౌంటీల్లో రాణిస్తున్న మార్క్‌ అడైర్‌ ఈ టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 3 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. అయితే ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో మంచి పేస్‌తో 39 మ్యాచ్‌ల్లో 59  వికెట్లు తీశాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్‌ వికెట్లు తీసి వెలుగులోకి వచ్చిన కర్టిస్‌ కాంఫర్‌.. ఇప్పటివరకు ఆడిన 12 టీ20 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు పడగొట్టాడు. ఇదే మ్యాచ్‌లో 29 బంతుల్లోనే 44 పరుగులు చేసిన గ్రెత్‌ డెన్లీ మొత్తంగా 37టీ20 మ్యాచ్‌ల్లో 694 పరుగులు చేశాడు. వీరితోపాటు కెప్టెన్‌ ఆండ్రూ బల్‌బిర్ని(67 టీ20 మ్యాచ్‌ల్లో 1429), సీనియర్‌ ఆటగాడు పాల్‌ స్టిర్లింగ్‌ 102 మ్యాచ్‌ల్లో 2776 పరుగులతో టీ20 క్రికెట్‌లో మంచి రికార్డు కలిగి ఉన్నారు. వీరంతా  సమష్టిగా రాణించడంపై ఐర్లాండ్‌ విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి.

అప్పుడు ఏమైందంటే...

ఇప్పటివరకు భారత్‌ ఐర్లాండ్‌తో  కేవలం మూడు టీ20ల్లోనే తలపడింది.  అన్నింటిలోనూ భారత్‌దే పైచేయి. ఐర్లాండ్‌ తొలిసారిగా 2009 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియాను ఢీకొంది. ఈ మ్యాచ్‌లో పేసర్‌ జహీర్‌ఖాన్‌ విజృంభణతో ఐర్లాండ్‌ 18 ఓవర్ల మ్యాచ్‌(వర్షం కారణంగా కుదించారు)లో 8 వికెట్ల నష్టానికి 112 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్‌గా వచ్చిన రోహిత్‌ అర్ధశతకం చేయడంతో భారత్‌ 15.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. 2018లో భారత్‌ రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడేందుకు ఐర్లాండ్‌ పర్యటనకు వెళ్లింది. డబ్లిన్‌ వేదికగా జరిగిన మొదటి టీ20లో తొలిత బ్యాటింగ్‌ చేసి 208/5 భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ధావన్‌(74; 45 బంతుల్లో 5x4, 5x6)  రోహిత్‌ (97; 45 బంతుల్లో 8x4, 5x6), రెచ్చిపోయి ఆడారు. ఛేదనలో ఐరిష్‌ జట్టు 132/9 పరుగులు మాత్రమే చేసింది. కుల్ దీప్‌ యాదవ్‌(4), బుమ్రా(2)వికెట్లతో రాణించారు. రెండో టీ20లో మళ్లీ బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా  ఐరిష్‌ బౌలర్లతో ఓ ఆట ఆడుకుంది. రాహుల్‌ (70; 36బంతుల్లో 3x4, 6x6), రైనా(69; 45బంతుల్లో  5x4,3x3) చెలరేగి ఆడడంతో భారత్‌ 20 ఓవర్లలో 213/4 పరుగులు చేసింది. ఛేదనలో ఐర్లాండ్‌ 12.3 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. స్పిన్‌ ద్వయం కుల్‌దీప్‌, చాహల్‌ చెరో 3 వికెట్లతో విజృభించారు. దీంతో 2 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్‌ వైట్‌వాష్‌ చేసింది.

ప్రపంచకప్‌లో ఐర్లాండ్‌ సంచలనాలు మరిచిపోగలమా...!

అయితే.. పసికూన అనుకుని ఈ జట్టుని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే.. ప్రపంచ క్రికెట్‌లో ఈ జట్టు కొన్ని సంచలన విజయాలు నమోదు చేసింది. 2007 వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ గ్రూప్‌ దశలోనే నిష్క్రమించిందంటే దానికి కారణం ఐరిష్‌ జట్టే.  ఈ టోర్నీలో తొమ్మిదో మ్యాచ్‌ అది. ఐర్లాండ్‌కు అదే మొదటి ప్రపంచకప్‌. ప్రత్యర్థి పాకిస్థాన్‌. పాక్‌ విజయం ఖాయం అనుకున్నారంతా.  కానీ ఐర్లాండ్‌ అద్భుతమే చేసింది.  సెబినా పార్క్‌( జమైకా) వేదికగా జరిగిన  ఈ మ్యాచ్‌లో ఈ జట్టు టాస్‌ గెలిచి ఫీల్ఢింగ్‌ ఎంచుకుంది. 46 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌.. ఐరిష్‌ బౌలర్ల ధాటికి 45.4 ఓవర్లలో 132 పరుగలకే ఆలౌట్‌ అయింది.  ఛేదనలో నియల్ ఓబ్రియన్‌ (107 బంతుల్లో 72 ) పోరాటంతో  ఐర్లాండ్‌ లక్ష్యాన్ని 32 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ టోర్నీలేనే బంగ్లా చేతిలో ఓడి టీమ్‌ఇండియా గ్రూప్‌దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే.

కెవిన్‌ ఓబ్రియన్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌

(Photo: Cricket Ireland Twitter)

2011 వన్డే ప్రపంచకప్‌.. వేదిక బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం. ఇంగ్లాండ్‌ , ఐర్లాండ్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో మైదానం ఫోర్లు, సిక్సర్లతో తడిసి ముద్దైయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ ట్రాట్‌, బెల్‌, పీటర్సన్‌ అర్ధశతకాలతో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 327 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో  కెవిన్‌ ఓబ్రియన్‌ ఇన్నింగ్స్‌ ఈ టోర్నీకే హైలైట్‌. ఇంగ్లాండ్‌ బౌలర్లపై విరుచుకుపడిన అతడు 50 బంతుల్లోనే శతకం బాదేశాడు. మొత్తంగా కెవిన్‌ ఓబ్రియన్‌ 63 బంతుల్లో 113 పరుగులు (13ఫోర్లు, 6 సిక్సర్లు) చేశాడు. దీంతో ఐరిష్‌ జట్టు 49.1 ఓవర్లో 7 వికెట్లు కోల్పోయి భారీ టార్గెట్‌ను ఛేదించి రికార్డు విజయం నమోదు చేసింది.

ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని