IND vs IRL: ఐర్లాండ్‌తో పోరు.. 3, 4 స్థానాలు వాళ్లిద్దరివేనా?

టీమ్‌ఇండియా ఈనెల 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌ ఆడనుంది. అయితే, ఇప్పుడు జట్టు కూర్పుపైనే ఆసక్తి నెలకొంది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ సందర్భంగా ఓపెనర్లుగా...

Published : 26 Jun 2022 01:46 IST

రేసులో ఎవరున్నారు.. ఎలా ఆడుతున్నారు..

టీమ్‌ఇండియా ఈనెల 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌ ఆడనుంది. అయితే, ఇప్పుడు జట్టు కూర్పుపైనే అందరి దృష్టి నెలకొంది. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ సందర్భంగా ఓపెనర్లుగా కొనసాగిన రుతురాజ్‌ గైక్వాడ్‌, ఇషాన్‌ కిషన్‌ ఇప్పటికే జట్టుతో ఉన్నారు. కానీ, తర్వాతి 3, 4 స్థానాల్లో వచ్చిన ఆటగాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ ప్రస్తుతం ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్నారు. దీంతో ఐర్లాండ్‌ సిరీస్‌లో ఆయా స్థానాలను ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. అయితే, ఆ రేసులో ఐదుగురు ఆటగాళ్లు ఉండటంతో.. ఎవరెవరు ఎలా ఉన్నారో ఓ లుక్కేద్దాం.

సూర్యకుమార్‌..

ముంబయి బ్యాట్స్‌మన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌ మధ్యలో గాయపడటంతో సగం మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు పూర్తిగా కోలుకోవడంతో ఐర్లాండ్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. ఇంతకుముందు అతడు టీమ్‌ఇండియా, ముంబయి జట్ల తరఫున టాప్‌ ఆర్డర్‌లో రాణించిన అనుభవం ఉండటంతో మూడో స్థానంలో వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దానికి తోడు ఈసారి టీ20 లీగ్‌లోనూ అతడు ఆడిన కొన్ని మ్యాచ్‌ల్లోనే మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. మొత్తం 8 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 43.29 సగటుతో.. 145.67 స్ట్రైక్‌రేట్‌ సాధించి.. 303 పరుగులు చేశాడు. అందులో 3 అర్ధ శతకాలు ఉన్నాయి. దీంతో సూర్యకుమార్‌కు మూడో స్థానం ఖాయమయ్యేలా కనిపిస్తోంది.

సంజూ శాంసన్‌..

సంజూ శాంసన్‌ కొన్నేళ్ల  క్రితమే టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకున్నా.. ఇప్పటికీ సుస్థిర స్థానం సంపాదించుకోలేకపోయాడు. కానీ, ఈసారి టీ20 లీగ్‌లో రాజస్థాన్‌ కెప్టెన్‌గా అదరగొట్టడమే కాకుండా ఆటగాడిగానూ రాణించాడు. ఆ జట్టు తరఫున రెండో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. మొత్తం 17 మ్యాచ్‌లు ఆడిన అతడు 28.63 సగటుతో.. 146.79 స్ట్రైక్‌రేట్‌ నమోదు చేసి.. 458 పరుగులు చేశాడు. అందులో రెండు అర్ధశతకాలు ఉన్నాయి. అయితే, నిలకడలేమి సంజూకు ప్రధాన సమస్య. అందువల్లే టీమ్‌ఇండియాలో సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయాడు. కానీ, ఈ టీ20 లీగ్‌లో పరిస్థితులకు తగ్గట్టు ఆడటంతో ఐర్లాండ్‌ సిరీస్‌కు ఎంపికయ్యాడు. అతడికి టాప్‌ ఆర్డర్‌లో ఎక్కడైనా ఆడే అనుభవం ఉండటం కలిసొచ్చే అంశం. దీంతో ఈ సిరీస్‌లో వన్‌డౌన్‌ లేదా సెకండ్‌ డౌన్‌లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

దీపక్‌ హూడా..

(Photo: Deepak Hooda Instagram)

మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా దీపక్‌ హూడాకు భారత టీ20 లీగ్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లోనూ మంచి రికార్డు ఉంది. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లోనూ టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇటీవల జరిగిన టీ20లీగ్‌లో కొత్త ఫ్రాంఛైజీ లఖ్‌నవూ తరఫున అదరగొట్టాడు. పలు కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టు విజయాల్లో.. ప్లేఆఫ్స్‌కు చేరడంలో తనవంతు పాత్ర పోషించాడు. మొత్తంగా 15 మ్యాచ్‌లు ఆడిన దీపక్‌.. 32.21 సగటుతో 136.66 స్ట్రైక్‌రేట్‌తో 451 పరుగులు చేశాడు. అలాగే నాలుగు అర్ధ శతకాలతో సత్తా చాటాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా సిరీస్‌కు హుడాను సెలెక్టర్లు ఎంపిక చేశారు. అయితే, తుది జట్టులో అవకాశం రాలేదు. ఈ సిరీస్‌కు కూడా ఎంపికైన దీపక్‌.. తుది జట్టులో అవకాశం వస్తే నాలుగు లేదా ఐదు స్థానాల్లో బరిలోకి దిగే వీలుంది.

రాహుల్‌ త్రిపాఠి..

(Photo: Rahul Tripathi Instagram)

రాహుల్‌ త్రిపాఠి కొంత కాలంగా భారత టీ20లీగ్‌లో అదరగొడుతూ టీమ్‌ఇండియాలో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. ఇటీవల జరిగిన 15వ సీజన్‌లోనూ ఈ యువ బ్యాట్స్‌మన్‌ హైదరాబాద్‌ టీమ్‌ తరఫున రాణించాడు. ఈ సీజన్‌లో మొత్తం 14 మ్యాచ్‌లు ఆడిన త్రిపాఠి 37.55 సగటుతో.. 158.23 స్ట్రైక్‌రేట్‌తో.. 413 పరుగులు చేశాడు. అందులో మూడు అర్ధ శతకాలు నమోదు చేశాడు. దీంతో తొలిసారి జాతీయ జట్టు నుంచి ఐర్లాండ్‌ పర్యటనకు పిలుపు వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో అతడికి ఇదే తొలి సిరీస్‌ కాబట్టి తుది జట్టులో ఉండడం కష్టమనే చెప్పాలి. ఒకవేళ రిజర్వ్‌ బెంచ్‌ కాదని అవకాశం ఇస్తే.. పైన పేర్కొన్న దీపక్‌ లేదా సంజూ స్థానాలకు గండి కొట్టే వీలుంది.

వెంకటేశ్‌ అయ్యర్‌..

గతేడాది భారత టీ20 లీగ్‌ 14వ సీజన్‌ యూఏఈ లెగ్‌లో కోల్‌కతా ఓపెనర్‌గా అనూహ్యంగా రాణించిన వెంకటేశ్‌ అయ్యర్‌.. 2021 టీ20 ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాడు. దీంతో న్యూజిలాండ్‌, వెస్టిండీస్‌, శ్రీలంక సిరీస్‌లకు ఎంపికై ఫర్వాలేదనిపించాడు. కానీ, ఈసారి టీ20 లీగ్‌లో విఫలమయ్యాడు. మొత్తం 12 మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్‌.. 16.55 సగటుతో.. 107.69 స్ట్రైక్‌రేట్‌తో.. కేవలం 182 పరుగులే చేశాడు. అయితే, వెంకటేశ్‌ కేవలం బ్యాట్స్‌మన్‌గానే కాకుండా మీడియం పేస్‌ బౌలింగ్‌ వేయగలడు. దీంతో ఈ సిరీస్‌కు ఆల్‌రౌండర్‌గా చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య, దినేశ్‌ కార్తీక్‌ మిడిల్‌ ఆర్డర్‌లో రాణిస్తుండటంతో.. వెంకటేశ్‌ తుది జట్టులోకి రావడం కష్టమనే చెప్పాలి. ఒకవేళ ఆడినా లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు వస్తాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌ ప్రత్యేకం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని