IND vs NZ: గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి రోహిత్‌ శర్మను హగ్‌ చేసుకున్న బాలుడు.. హిట్‌మ్యాన్‌ ఏమన్నాడంటే?

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ ఇన్నింగ్స్‌ జరుగుతున్నప్పుడు ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడు మైదానంలోకి దూసుకొచ్చి టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ (Rohit Sharma)ను హగ్‌ చేసుకున్నాడు. 

Published : 22 Jan 2023 01:14 IST

ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో (IND vs NZ) టీమ్‌ఇండియా ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ని 2-0 తేడాతో కైవసం చేసుకుంది. 109 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. రోహిత్‌ శర్మ (51; 50 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభ్‌మన్‌ గిల్ (40; 53 బంతుల్లో 6 ఫోర్లు) రాణించడంతో 20.1 ఓవర్లలో సునాయసంగా ఛేదించింది. అయితే, భారత్‌ ఇన్నింగ్స్‌ జరుగుతున్నప్పుడు మైదానంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలుడు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చి క్రీజులో ఉన్న రోహిత్ శర్మ  (Rohit Sharma)ను హగ్‌ చేసుకున్నాడు. దీంతో ఆటకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. 

టిక్నర్‌ వేసిన 10వ ఓవర్‌లో మూడో బంతికి ఫోర్‌ బాదిన రోహిత్‌ (Rohit Sharma) తర్వాతి బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఇది జరిగిన వెంటనే మ్యాచ్‌ చూడటానికి వచ్చిన ఓ బాలుడు భద్రతా సిబ్బంది కళ్లుగప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. వెంటనే ఈ విషయాన్ని గమనించిన భద్రతా సిబ్బంది అతడిని పట్టుకునేందుకు పరుగెత్తారు. వారు వచ్చేలోపే ఆ బాలుడు రోహిత్‌ శర్మను హగ్ చేసుకున్నాడు. పోలీసులు వెంటనే అతడిని రోహిత్‌ నుంచి వేరు చేశారు. ఆ బాలుడుపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని భారత కెప్టెన్‌ సెక్యూరిటీ సిబ్బందితో చెప్పాడు. తన అభిమానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రోహిత్‌ భద్రతా సిబ్బందికి సూచించడంతో ‘రోహిత్‌ ఎంతో మంచి మనసున్నవాడు’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని