IND vs WI: అర్ష్‌దీప్‌కు అవకాశం ఇస్తారా..? సూర్య బ్యాట్‌ ఝుళిపిస్తాడా..?

విండీస్‌పై వరుసగా రెండు ఉత్కంఠపోరుల్లో నెగ్గిన టీమ్‌ఇండియా...ఇప్పుడు ఆఖరి సమరానికి సిద్ధం అయింది.

Updated : 27 Jul 2022 17:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విండీస్‌పై వరుసగా రెండు ఉత్కంఠ పోరుల్లో నెగ్గిన టీమ్‌ఇండియా.. ఇప్పుడు ఆఖరి సమరానికి సిద్ధమైంది. ఈ రోజు పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వేదికగా మూడో వన్డేలో తలపడనుంది. ఇప్పటికే సిరీస్‌ సొంతం చేసుకొన్న భారత్‌ క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా బరిలోకి దిగుతుండగా.. విండీస్‌ పరాజయాల పరంపరకు పుల్‌స్టాఫ్‌ పెట్టాలని భావిస్తోంది. అయితే.. ద్రవిడ్‌ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచీ తుదిజట్టులో మార్పులు ఎక్కువుగా జరుగుతున్నాయి. యువకులకు అవకాశాలు ఇస్తున్నారు. తాజాగా ఇంగ్లాండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లోనూ రెండు మ్యాచ్‌లు నెగ్గాక మూడో టీ20లో అనేక మార్పులు చేశారు. ప్రతి ఆటగాడికి వీలైనన్ని ఎక్కువ ఛాన్స్‌లు లభిస్తున్నాయి. ఇప్పటికే సిరీస్‌ గెలవడంతో విండీస్‌తో మూడో వన్డేలో టీమ్‌ఇండియా తుదిజట్టులో మార్పులు జరగొచ్చు.

ఎవరికి అవకాశం..?

మెదటి రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా వచ్చిన శుభమన్‌ గిల్‌ ఒక అర్ధశతకంతో పాటు 43పరుగులు చేశాడు. దీంతో మూడో మ్యాచ్‌లో కూడా గిల్‌ను కొనసాగించడం ఖాయంగా  కనిపిస్తోంది. మరో ఓపెనర్‌గా కెప్టెన్‌ ధావన్‌ ఎలాగో ఉన్నాడు. దీంతో విజయ్‌ హజారే ట్రోఫీలో శతకాల మోత మోగించిన యువ ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం కావొచ్చు. ఒక వేళ అతడిని ఆడించాలని టీమ్‌ఇండియా భావిస్తే.. మూడో స్థానంలో ఆడుతున్న శ్రేయాస్‌ అయ్యర్‌కు విశ్రాంతినిస్తారు. కానీ, ఈ సిరీస్‌లో రెండు అర్ధశతకాలతో టచ్‌లోకి వచ్చిన అయ్యర్‌.. మూడో వన్డేలో శతకం బాదుతానని ఇప్పటికే చెప్పాడు. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌, శాంసన్‌, హుడా ఉండటంతో రుతురాజ్‌ను ఆడించే అవకాశాలు తక్కువ.

మరోవైపు బౌలింగ్‌లో టీమ్‌ఇండియా కొంచెం బలహీనంగా కనిపిస్తోంది. సిరాజ్‌ రెండు మ్యాచ్‌ల్లో రాణించాడు. అయితే, మొదటి మ్యాచ్‌లో విఫలం అయిన ప్రసిధ్‌ స్ధానంలో వచ్చిన అవేశ్‌ఖాన్‌.. రెండో మ్యాచ్‌లో భారీగా పరుగులు సమర్పించుకొన్నాడు. అయితే, అతడికి ఇదే తొలి వన్డే కావడంతో మరో ఛాన్స్‌ ఇవ్వొచ్చు. ఇంగ్లాండ్‌పై తొలి టీ20లో అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్‌.. ఇప్పుడు వన్డేల్లో అరంగేట్ర మ్యాచ్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. అర్ష్‌దీప్‌ సింగ్‌ను ఆడించాలంటే, సిరాజ్‌ లేదా శార్దూల్‌ ఠాకూర్‌లలో ఒకరిని తప్పించొచ్చు. సిరాజ్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఠాకూర్‌ బ్యాటింగ్‌ చేయగల సమర్థుడు. అయినా, సిరీస్‌ ఖరారు కావడంతో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు తుది జట్టులో మార్పులు జరగొచ్చు.

సూర్య టచ్‌లోకి వస్తాడా..?

ఇంగ్లాండ్‌పై చివరి టీ20లో అద్భుత శతకం సాధించి ఔరా అనిపించిన సూర్యకుమార్‌ యాదవ్‌.. ఆ తర్వాత నుంచి వరుసగా విఫలం అవుతున్నాడు. ఇంగ్లాండ్‌పై రెండు వన్డేల్లో కలిపి 43 పరుగులే చేసిన సూర్య.. ఈ సిరీస్‌లోనూ రాణించలేదు. మొదటి మ్యాచ్‌లో 13, రెండో మ్యాచ్‌లో 9 పరుగులు మాత్రమే చేయగలిగాడు. దీంతో అభిమానులు అతడి నుంచి భారీ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఔట్‌ అవుతున్నా.. సూర్య బ్యాటింగ్ నైపుణ్యం అందిరికీ తెలిసిందే. ఈ రోజు మ్యాచ్‌లో బ్యాట్‌ ఝుళిపించి మళ్లీ పరుగుల బాట పట్టే అవకాశం ఉంది. టీ20ల్లో సూర్య స్థానానికి ఢోకా లేకపోయినా.. వన్డేల్లో కోహ్లీ జట్టులోకి వస్తే.. అయ్యర్‌ నాలుగో స్థానానికి గట్టి పోటీదారుగా ఉన్నాడు. దీంతో సూర్య సత్తాచాటాల్సిన అవసరం ఉంది.

విండీస్‌ పరిస్థితి ఏంటి?

వెస్టిండీస్‌ బాగానే ఆడుతున్నా కీలక సమయాల్లో బ్యాటర్లు లేదా బౌలర్లు చేతులెత్తేస్తున్నారు. విండీస్‌ సమష్టిగా రాణించకపోవడంతో గెలవాల్పిన మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. జట్టులో సీనియర్లు లేకపోవడం.. ఎక్కువుగా షై హోప్‌, కెప్టెన్‌ పూరన్‌, పావెల్‌పైనే ఆధారపడటం ఆ జట్టుకు నష్టం చేకూర్చే అంశం. మూడో మ్యాచ్‌లోనైనా నెగ్గి ఈ నెల 29 నుంచి ఆరంభమయ్యే టీ20 సిరీస్‌కు విజయంతో వెళ్లాలని విండీస్‌ ఆశిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని