IND vs WI: ప్రపంచకప్‌ బృందంలో ఉండేదెవరు..? విండీస్‌ సిరీస్‌ వీరికి కీలకం..!

టీమ్‌ఇండియాలో పోటీ తీవ్రంగా పెరిగింది. ఒక్కో స్థానానికి ఇద్దరు..ముగ్గురు రేసులో ఉన్నారు.

Updated : 29 Jul 2022 13:24 IST

ఇక్కడ రాణిస్తేనే.. అక్కడ చోటు.. ఇదే మంచి తరుణం..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియాలో పోటీ తీవ్రంగా పెరిగింది. ఒక్కో స్థానానికి ఇద్దరు.. ముగ్గురు రేసులో ఉన్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ లక్ష్యంగా సెలెక్టర్లు ఆటగాళ్లను ఎంపిక చేస్తున్నారు. ప్రతి సిరీస్‌లో యువకులకు అవకాశాలు ఇస్తున్నారు. ఈ రోజు నుంచి విండీస్‌తో ఆరంభమయ్యే టీ20 సిరీస్‌, ఆ తర్వాత జరగనున్న ఆసియాకప్‌తో సెలెక్టర్లకు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే, ఈ లోగా వచ్చిన ఛాన్స్‌లను ఎలా అందిపుచ్చుకుంటారో చుడాలి..! 

ఈ సిరీస్‌ వారికి కీలకం..

సెలెక్టర్లు వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు సీనియర్లు కోహ్లీ, చాహల్‌, బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. అయినా.. టీమ్‌ఇండియాలో తుది 11లో చోటు కోసం పోటీ తగ్గలేదు. ఐర్లాండ్‌, ఇంగ్లాండ్ సిరీస్‌లలో అదరగొట్టిన దీపక్‌ హుడా, విండీస్‌పై వన్డేల్లో రాణించిన శ్రేయస్‌ అయ్యర్‌ మూడో స్థానానికి పోటీ పడుతున్నారు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో దుమ్మురేపిన ఇషాన్‌కు ఇంగ్లాండ్ సిరీస్‌లో అవకాశం రాలేదు. ఇక్కడ పంత్‌ ఓపెనర్‌గా వచ్చాడు. ఇప్పుడు విండీస్‌తో కూడా అతడే  ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. దీంతో రిజర్వ్‌ ఓపెనర్‌గా ఖాయం అనుకున్నా కిషన్‌కు నిరాశే మిగులుతుందా అనేది ప్రశ్నార్థకం. ప్రపంచకప్‌కు ఎంపికచేసే  15 మంది సభ్యుల జట్టులో తమ పేరు ఉండాలంటే హుడా, అయ్యర్‌, కిషన్‌ ఈ సిరీస్‌లో తప్పక రాణించాలి. అవకాశం వస్తే.. కోచ్‌ ద్రవిడ్‌ చెప్పినట్టు టీమ్‌ఇండియా తలుపు తట్టడం కాదు.. బద్దలు కొట్టే ఇన్నింగ్స్‌ ఆడాలి.

కార్తీక్‌ కేక పుట్టిస్తావా..!

ఇంగ్లాండ్‌పై అద్భుత శతకం సాధించిన సూర్యకుమార్‌ యాదవ్‌కు నాలుగో స్థానం దాదాపు ఖాయమైనట్లే. ఎందుకంటే సూర్య టీ20ల్లో ఆడే వినూత్న షాట్లు, అతడి రికార్డులు బాగున్నాయి. దీంతో నాలుగో  స్థానానికి ఫస్ట్‌ ఛాయిస్‌ ప్లేయర్‌గా సూర్యనే ఉంటాడు. ఇక ఆల్‌రౌండర్‌ కోటాలో హార్ధిక్‌ పాండ్య కచ్చితంగా ఉండే ఆటగాడు. ఇంతవరకు బాగానే ఉన్నా దినేశ్‌ కార్తీక్‌, రిషబ్‌పంత్‌ స్థానాలపైనే సందేహం ఉంది. ఈ సిరీస్‌లో రిషభ్‌ ఓపనింగ్‌ స్థానంలో ఆడినా, రెగ్యులర్‌ ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ తిరిగి జట్టులోకి వస్తే ఎక్కడ ఆడతాడనేది తెలియాలి. పంత్‌ నైపుణ్యం ఉన్న ఆటగాడు, పైగా వికెట్‌కీపర్‌, లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాటర్‌.. దీంతో ఏదో ఒక స్థానంలో అతడిని ఆడించడానికి జట్టు మేనేజ్‌మెంట్ ప్రయత్నించవచ్చు. కానీ.. కోహ్లీ తుదిజట్టులో ఉంటే ఒక్క దినేశ్‌కార్తీక్‌ స్థానం మాత్రమే ఖాళీగా ఉంటుంది. కార్తీక్‌ భారత టీ20లీగ్‌లో మెరుపులు మెరిపించి టీమ్‌ఇండియాలోకి పునరాగమనం చేశాడు. అతడిని టీమ్‌ఇండియా ఫినిషర్‌గా భావిస్తోంది. నెం 7లో ఆడి మ్యాచ్‌ను ముగించగల సత్తా అతడి సొంతం. అయితే, దక్షిణాఫ్రికాపై అర్ధశతకం సాధించి మ్యాచ్‌ను గెలిపించిన కార్తీక్‌.. ఆ తరవాత చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. దీంతో ఈ సిరీస్‌లో అతడు సత్తాచాటకపోతే ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కడం కష్టం అవుతుంది. కోహ్లీ, రాహుల్‌ తిరిగి తుదిజట్టులోకి వస్తే పంత్‌, కార్తీక్‌లలో ఒకరికే వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా చోటు దక్కొచ్చు. దీంతో ఈ సిరీస్‌లో వీరిద్దరూ రాణించాలి.

స్పిన్నర్ల మధ్య తీవ్ర పోటీ

రవీంద్ర జడేజా, అక్షర్‌పటేల్‌ ఇద్దరు ఆల్‌రౌండ్‌ నైపుణ్యం ఉన్న ఆటగాళ్లే. లెఫ్ట్‌ఆర్మ్‌ స్పిన్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సమర్థులే. అయితే, జడేజాకు అనుభవం, మెరుపు ఫీల్డిండ్‌ కారణంగా తుది జట్టులో స్పిన్నింగ్‌ ఆల్‌రౌండర్‌గా ఫస్ట్‌ ఛాయిస్‌ ఉండే అవకాశం ఉంది. అయితే, తాజాగా విండీస్‌తో వన్డే సిరీస్‌లో తన బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను గెలిపించిన అక్షర్‌.. ఇక్కడ రాణిస్తే ప్రపంచకప్‌ జట్టులో బెర్త్‌ ఖాయం చేసుకోవచ్చు. తాజాగా అశ్విన్‌ విండీస్‌ సిరీస్‌కు ఎంపికయ్యాడు. దీంతో అతడు కూడా ఇక్కడ సత్తా చాటి స్పిన్నర్ల రేసులో ముందుండడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే, ఈ సిరీస్‌లో అశ్విన్‌ ఎలా రాణిస్తాడనేది ఆసక్తికరం. ఇక కుల్‌దీప్‌ యాదవ్‌ మణికట్టు స్పిన్నర్‌గా  టీమ్‌ఇండియాలో రెగ్యులర్‌ ఆటగాడిగా కొంతకాలం కొనసాగాడు. అయితే, ఉన్నట్టుండి ఫామ్‌ కోల్పోయి టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. అయితే, ఈ సీజన్‌ భారత టీ20లీగ్‌లో దిల్లీ తరఫున రాణించి తిరిగి టీమ్‌ఇండియాకు ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌ కుల్‌దీప్‌కు కీలకమైనది. ఇప్పటికే ప్రధాన స్పిన్నర్‌గా చాహల్‌ ఉన్నాడు. మరోవైపు యువ లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌కు ఈ సిరీస్‌ ముఖ్యమైనదే. కుల్‌దీప్‌, అశ్విన్‌, బిష్ణోయ్‌ ఈ ముగ్గురిలో ఎవరు నిలకడగా రాణిస్తే వారు చాహల్‌కు జోడిగా ఆస్ట్రేలియా విమానం ఎక్కే అవకాశం ఉంది.

టాప్‌ లేపితేనే ఛాన్స్‌..!

ప్రపంచకప్‌ ఆస్ట్రేలియాలో జరగనున్న నేపథ్యంలో పేస్‌ బౌలర్లు టీమ్‌ఇండియాకు కీలకం కానున్నారు. ప్రధాన పేసర్లుగా బుమ్రా, భువనేశ్వర్‌ కచ్చితంగా ప్రపంచకప్‌ జట్టులో ఉండే ఆటగాళ్లని తెలుస్తోంది. ఇప్పుడు చర్చంతా మూడో పేసర్‌ ఎవరనేదే. ఈ జాబితాలో హర్షల్ పటేల్‌, అర్ష్‌దీప్‌సింగ్, ఉమ్రాన్‌ మాలిక్‌, అవేశ్‌ ఖాన్‌తో పాటు గాయంతో టీమ్‌ఇండియాకు దూరమైన దీపక్‌ చాహర్‌ కూడా రేసులో ఉన్నాడు. ప్రస్తుతానికి వీరందరిలో స్లో డెలివరీలు, యార్కర్లు వేసి బ్యాటర్లను బోల్తా కొట్టించగల హర్షల్ పటేల్‌కు ఎక్కువ ఛాన్స్‌లు ఉన్నాయి. అయితే, అర్ష్‌దీప్‌ భారత టీ20లీగ్‌తో పాటు ఇంగ్లాండ్‌పై అరంగేట్ర మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు ఈ సిరీస్‌, ఆసియాకప్‌లో ఎలా రాణిస్తారో చుశాక వీరిలో ఒకరిని మూడో పేసర్‌గా తీసుకోవచ్చు. మరోవైపు మెరుపు వేగంతో బౌలింగ్ చేస్తున్న ఉమ్రాన్‌ ఆశించిన స్థాయిలో బౌలింగ్ చేయలేదు. దీంతో ఈ సిరీస్‌కు అతడిని ఎంపిక చేయలేదు. అవేశ్‌ ఖాన్‌ ప్రతిభావంతుడైన పేస్‌ బౌలర్‌.. కానీ, ఇటీవల పరుగులు ధారళంగా ఇచ్చేస్తున్నాడు. వన్డే సిరీస్‌ అరంగేట్ర మ్యాచ్‌లోనూ ప్రభావం చూపలేకపోయాడు. టీ20 సిరీస్‌లో అవకాశం వస్తే వికెట్లు పడగొట్టడంతో పాటు మంచి ఎకానమీతో బౌలింగ్‌ చేయాలి.. లేదంటే ప్రపంచకప్‌ బెర్త్‌ కష్టం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని