SA vs IND: భారత్ ఆలౌట్.. మెరిసిన సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ 211 పరుగులకు ఆలౌటైంది.

Published : 19 Dec 2023 20:01 IST

గబెరా: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత్ మధ్య రెండో వన్డే జరుగుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటైంది. సాయి సుదర్శన్‌ (62; 83 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) మరోసారి అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (56; 64 బంతుల్లో 7 ఫోర్లు) కూడా హాఫ్‌ సెంచరీ బాదాడు. వీరిద్దరూ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేకపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో నండ్రి బర్గర్ 3, బ్యురాన్ హెండ్రిక్స్‌ 2, కేశవ్‌ మహరాజ్‌ 2, లిజాడ్ విలియమ్స్‌, మార్‌క్రమ్‌ ఒక్కో వికెట్ పడగొట్టారు. 

ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే టీమ్‌ఇండియాకు షాక్ తగిలింది. రుతురాజ్‌ గైక్వాడ్ (4)ని ఇన్నింగ్స్‌ రెండో బంతికే బర్గర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తర్వాత తిలక్‌ వర్మతో కలసి సాయి సుదర్శన్‌ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. తిలక్ చాలా నెమ్మదిగా ఆడగా.. సుదర్శన్ నిలకడగా పరుగులు రాబట్టాడు. చివరకు బర్గర్ బౌలింగ్‌లో తిలక్‌ హెండ్రిక్స్‌కు చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌ మొదట్లో  ఆచితూచి ఆడి క్రమంగా దూకుడు పెంచాడు. 60 బంతుల్లో అర్ధ శతకం బాదిన సుదర్శన్‌ను విలియమ్స్‌ వెనక్కి పంపాడు. తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమయ్యారు. సంజు శాంసన్ (12)ను హెండ్రిక్స్‌ బౌల్డ్ చేశాడు. హాఫ్‌ సెంచరీ చేసిన రాహుల్.. బర్గర్ బౌలింగ్‌లో మిల్లర్‌కు చిక్కాడు. రింకు సింగ్ (17), కుల్‌దీప్ యాదవ్ (1)లను కేశవ్‌ మహరాజ్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు. అక్షర్ పటేల్ (7; 23 బంతుల్లో)ని మార్‌క్రమ్‌ ఔట్ చేశాడు. చివర్లో అర్ష్‌దీప్‌ సింగ్ (18; 17 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్‌) పోరాడటంతో స్కోరు 200 దాటింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని