U19 World Cup Final: అండర్-19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌.. ఆసీస్‌పై భారత్ లీడ్‌ 3-0కు వెళ్లేనా?

అండర్ -19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో (U19 World Cup 2024) ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్‌ సిద్ధమైంది. నాకౌట్‌ దశలోని ఒత్తిడికి చిత్తు కాకుండా విజేతగా నిలవాల్సిన అవసరం ఉంది.

Updated : 09 Feb 2024 19:20 IST

డిఫెండింగ్‌ ఛాంపియన్‌.. గ్రూప్‌, సూపర్‌ సిక్స్‌ స్టేజ్‌లో సునాయాస విజయాలు.. తీరా, సెమీస్‌లో ఓటమి ప్రమాదం. కెప్టెన్ ఉదయ్‌ సహరన్, సచిన్‌ దాస్ జట్టును కాపాడటంతో ఫైనల్‌కు టీమ్‌ఇండియా. వరుసగా ఐదోసారి, మొత్తంగా తొమ్మిదోసారి అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది.

నాకౌట్‌ దశలో ఒత్తిడి తీవ్రం. సీనియర్లే కాదు.. తామూ ఏం తక్కువ కాదని ఆసీస్‌ యువ ఆటగాళ్లు నిరూపించారు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్‌లో పాకిస్థాన్‌ను కేవలం ఒక్క వికెట్‌ తేడాతో చిత్తు చేసి టైటిల్‌ కోసం ఫైనల్‌కు చేరారు. తుది పోరులో భారత్‌తో మూడోసారి ఢీ అనేందుకు సిద్ధమయ్యారు. 

అండర్‌-19 వరల్డ్‌ కప్ ఫైనల్‌లో (U19 World Cup 2024) భారత్ - ఆస్ట్రేలియా జట్లు (IND vs AUS) ఆదివారం తలపడనున్నాయి. నాకౌట్ స్టేజ్‌లో ఆస్ట్రేలియాను తక్కువగా అంచనా వేయకూడదని పాక్‌తో జరిగిన మ్యాచ్‌లోనే తేలింది. గతేడాది భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్‌లోనూ ఆసీస్‌ చాలా ఇబ్బందులు పడి ఫైనల్‌కు చేరుకుంది. అక్కడ మాత్రం టీమ్‌ఇండియాపై ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈసారి భారత కుర్రాళ్లు మాత్రం అలాంటి అవకాశం ఇవ్వకూడదని.. ఆసీస్‌ను చిత్తు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ మెగా టోర్నీలో ఆసీస్‌పై భారత్ గణాంకాలు మెరుగ్గానే ఉన్నాయి. ఇప్పటివరకు రెండుసార్లు ఇరుజట్లూ (2-0) ఫైనల్‌లో తలపడగా భారత్‌ విజయం సాధించింది. ముచ్చటగా మూడోసారి కూడా విజేతగా నిలవడంతోపాటు ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకోవాలని టీమ్‌ఇండియా కుర్రాళ్లు శ్రమిస్తున్నారు.

ఉన్ముక్త్ చంద్ నాయకత్వంలో.. 

ఉన్ముక్త్‌ చంద్ కెప్టెన్సీలో భారత్ 2012 అండర్-19 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు చేరుకుంది. తుది పోరులో కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో చంద్ టీమ్‌ఇండియాను గెలిపించాడు. ఆసీస్‌ నిర్దేశించిన 226 పరుగుల టార్గెట్‌ను మరో 14 బంతులు ఉండగానే ఛేదించింది. ఉన్ముక్త్‌ 130 బంతుల్లో 111 పరుగులు చేశాడు. ఉన్ముక్త్-స్మిత్ పటేల్ కలిసి ఐదో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. ఇప్పుడు వీరిద్దరూ భారత్‌లో అవకాశాలు రాకపోవడంతో.. యూఎస్‌ఏ తరఫున ఆడేందుకు వెళ్లడం గమనార్హం.

పృథ్వీ షా కెప్టెన్‌గా.. మంజోత్ కల్రా సెంచరీ

పృథ్వీ షా నాయకత్వంలో 2018 అండర్-19 వరల్డ్‌ కప్‌ను భారత్‌ నెగ్గింది. ఫైనల్‌లో ఆసీస్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మంజోత్‌ కల్రా (102 బంతుల్లో 101 పరుగులు) అద్భుత శతకం సాధించాడు. దీంతో 217 పరుగుల లక్ష్య ఛేదనను మరో 11.1 ఓవర్లు మిగిలిఉండగానే పూర్తి చేసింది. ఈ టోర్నీలో శుభ్‌మన్‌ గిల్ ఎమర్జింగ్‌ ప్లేయర్‌ అవార్డుతోపాటు ‘ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచాడు. ఫైనల్‌లోనూ 31 పరుగులు చేశాడు.

అలా చేస్తే.. రెండో జట్టుగా భారత్

డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఫైనల్‌కు చేరిన టీమ్‌ మళ్లీ విజేతగా నిలవడం చాలా కష్టం. అండర్-19 వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఒకే ఒక్క జట్టు మాత్రమే అలా సాధించింది. దాయాది దేశం పాకిస్థాన్‌ 2004, 2006 ఎడిషన్లలో విజేతగా నిలిచింది. ఇప్పుడు టీమ్‌ఇండియాకూ ఇలాంటి అవకాశమే వచ్చింది. 2022లో భారత్ టైటిల్‌ను గెలుచుకుంది. టీమ్‌ఇండియాకు అండర్-19 వరల్డ్‌ కప్‌లను అందించిన కెప్టెన్ల జాబితాలో ఉదయ్‌ సహరన్‌ చేరే అవకాశం ఉంది. ఇప్పటివరకు మహమ్మద్ కైఫ్, విరాట్ కోహ్లీ, ఉన్ముక్త్ చంద్, పృథ్వీ షా, యశ్ ధుల్ కప్‌లను అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని