Tilak Varma Bowling: రెండో బంతికే కెరీర్‌లో తొలి వికెట్‌.. తిలక్‌ కొత్త బాధ్యతలు సక్సెస్!

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ను (WI vs IND) ఓడిపోయినప్పటికీ భారత యువ క్రికెటర్లు మాత్రం వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. సీనియర్లు మాత్రం రాణించలేక విఫలం కావడం ఆందోళనకు గురి చేసే అంశం.

Updated : 23 Aug 2023 16:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత బౌలింగ్‌ (Team India) కోచ్ పరాస్ మాంబ్రే చెప్పినట్లుగానే యువ బ్యాటర్లు తిలక్‌ వర్మ, యశస్వి జైస్వాల్‌కు బౌలింగ్‌ బాధ్యతలను కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) అప్పగించాడు. వెస్టిండీస్‌తో జరిగిన (WI vs IND) ఐదో టీ20 మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ ఒక్క ఓవర్‌ వేసి 11 పరుగులు ఇచ్చాడు. తిలక్‌ వర్మ మాత్రం తన రెండు ఓవర్ల కోటాలో డేంజరస్‌ బ్యాటర్ నికోలస్‌ పూరన్ వికెట్‌ను పడగొట్టాడు. అదీ అతడు సంధించిన రెండో బంతికే వికెట్‌ పడటం గమనార్హం. యశస్వి లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌ కాగా.. తిలక్‌ ఆఫ్‌ స్పిన్నర్‌. రివర్స్‌ స్వీప్‌ చేసేందుకు ప్రయత్నించిన నికోలస్ పూరన్ (47).. తిలక్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ అద్భుతమైన క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు. దీంతో అంతర్జాతీయ కెరీర్‌ను విండీస్‌ పర్యటనలోనే ప్రారంభించిన తిలక్‌ వర్మకు.. ఇక్కడే హాఫ్ సెంచరీతోపాటు తొలి వికెట్‌ దక్కడం విశేషం.


అతడు బౌలింగ్‌ చేయగలడని తెలుసు: జాఫర్‌

టాప్‌ బ్యాటర్లు కూడా బౌలింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉండాలని భారత మాజీ క్రికెటర్ వసీమ్‌ జాఫర్ వ్యాఖ్యానించాడు. ‘‘ అంతర్జాతీయ క్రికెట్‌లో యశస్వి జైస్వాల్, తిలక్‌ వర్మ పూర్తిస్థాయిలో బౌలింగ్‌ చేయడానికి సిద్ధంగా ఉన్నారని అనుకోవడం లేదు. అయితే, తిలక్‌ వర్మకు దేశవాళీ క్రికెట్‌లోనూ బౌలింగ్‌ వేసిన అనుభవం ఉందని తెలుసు. వారిద్దరితో నెట్స్‌లోనూ ఇంకా ప్రాక్టీస్‌ చేయించాలి. టాప్‌ ఆర్డర్‌లోని మిగతా బ్యాటర్లూ అవసరమైతే బౌలర్ల అవతారం ఎత్తేందుకు సిద్ధంగా ఉండాలి’’ అని జాఫర్‌ వ్యాఖ్యానించాడు. 


తక్కువగా అంచనా వేయడం వల్లే: వెంకటేశ్‌ ప్రసాద్

ఐదు టీ20ల సిరీస్‌ను విండీస్‌ 3-2 తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే. అయితే, వన్డే ప్రపంచకప్‌ నుంచి వైదొలిగిన వెస్టిండీస్‌ను తక్కువగా అంచనా వేయడంతోనే భారత్‌కు పరాభవం ఎదురైందని మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ తెలిపాడు. ‘‘కొన్నిసార్లు భారత్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చాలా సాధారణ జట్టుగా కనిపిస్తోంది. వన్డే ప్రపంచ కప్‌ టోర్నీకి అర్హత సాధించడంలో విఫలమైన విండీస్‌ చేతిలో భంగపాటు ఎదురైంది. ఇంతకుముందు బంగ్లా చేతిలోనూ వన్డే సిరీస్‌ను కోల్పోయాం. ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుంటారని ఆశిస్తున్నా. వెస్టిండీస్‌ వన్డే ప్రపంచ కప్‌ టోర్నీలోనే కాదు.. గతేడాది టీ20 వరల్డ్‌ కప్‌లోనూ ఆడలేదు. ఆ బాధ విండీస్‌ జట్టులో కనిపించింది. మరోవైపు భారత్‌ దారుణమైన ప్రదర్శన చేసింది. ఊహల్లో బతుకుతూ ఉండటంతో కసి కనిపించలేదు’’ అని వెంకటేశ్‌ ప్రసాద్ విమర్శించాడు.


గిల్‌కు మద్దతు అవసరం: పార్థివ్‌ పటేల్

విండీస్‌తో టీ20 సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌ మినహా మిగతా వాటిల్లో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ రాణించలేకపోయాడు. దీంతో అతడిని పక్కన పెట్టాలనే విమర్శలు భారీస్థాయిలో వచ్చాయి. ఈ క్రమంలో భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్‌ పటేల్ మాత్రం గిల్‌కు మద్దతుగా నిలిచాడు. ‘‘శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతమైన ఆటగాడు. అతడి సత్తా ఏంటో మనందరికీ తెలుసు. కొన్నిసార్లు పరుగులు చేయకపోతే అతడి సామర్థ్యంపై ప్రశ్నలు సంధిస్తుంటాం. ఒకటీ రెండు మ్యాచుల్లో విఫలం కాగానే అతడు టీ20ల్లో ఆడొద్దు.. లేకపోతే వన్డేల్లో ఆడవద్దని సూచనలు చేస్తుంటారు. అయితే, బ్యాటర్‌ ఆడే విధానంపై నమ్మకం ఉంచాలి. దూకుడుగా ఆడే క్రమంలో ఔట్ కావడం సహజం. మరీ ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో ఓపెనర్ల పరిస్థితి భిన్నంగా ఉంటుంది’’ అని పటేల్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని