IND vs NZ: షమిలమిల.. ఇంకో అడుగే ఇక

టీమ్‌ఇండియా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. కోహ్లి (117; 113 బంతుల్లో 9×4, 2×6), శ్రేయస్‌ అయ్యర్‌ (105; 70 బతుల్లో 4×4, 8×6) శతకాలు బాదడంతో మొదట భారత్‌ 4 వికెట్లకు 397 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Updated : 16 Nov 2023 13:13 IST

ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌
సెమీస్‌లో న్యూజిలాండ్‌పై విజయం
కోహ్లి, శ్రేయస్‌ శతకాలు
ముంబయి

మాటల్లో వర్ణించలేని భావన కలిగినప్పుడు.. నోటికి వచ్చే పదం.. అద్భుతం!

వన్డేల్లో సచిన్‌ అత్యధిక సెంచరీల రికార్డును బద్దలు కొడుతూ కోహ్లి శిఖరాగ్రంపై రారాజుగా కూర్చున్న తీరు ఓ అద్భుతం!

తన ప్రదర్శనపై నెలకొన్న సందేహాలకు బ్యాట్‌తోనే సమాధానమిస్తూ శ్రేయస్‌ మరో మెరుపు శతకంతో జట్టును తిరుగులేని స్థితికి చేర్చిన వైనం అద్భుతం!

తన కసిని ఇంకా పెంచుతూ, బంతిని మరింత పదునెక్కిస్తూ కివీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను ఒంటిచేత్తో కూల్చి.. ఓ వన్డేలో ఏడు వికెట్లు పడగొట్టిన తొలి భారత బౌలర్‌గా షమి రికార్డులకెక్కిన దృశ్యం ఓ అద్భుతం!

ఈ అద్భుతాలన్నీ ఒక్కటైతే.. జట్టు కోసం కలిసి వస్తే.. ఓటమంటూ ఉంటుందా? గెలుపు దరిచేరకుండా ఉంటుందా? చరిత్ర మారక తప్పుతుందా?

బుధవారం వాంఖడేలో అదే జరిగింది. బ్యాటింగ్‌లో కోహ్లి, శ్రేయస్‌ శతకాలతో చెలరేగిన వేళ.. బంతితో షమి విజృంభించిన తరుణాన.. టీమ్‌ఇండియా సగర్వంగా వన్డే ప్రపంచకప్‌ తుది పోరులో అడుగుపెట్టింది.

విజయం అంత తేలిగ్గా దక్కలేదు. ప్రతికూల పరిస్థితులు తప్పలేదు. ప్రత్యర్థి సులువుగా తలవంచలేదు. అయినా పోటీ ఉంటేనే కదా మన సత్తా తెలిసేది? సవాలు ఉంటేనే కదా గెలుపు విలువ పెరిగేది? అందుకే ఈ పోరు చిరస్మరణీయం. ఈ విజయం మధురం!

ఇక.. వేయాల్సింది మరొక్క అడుగే. ఆదివారం అహ్మదాబాద్‌లోనూ గెలిచేస్తే ప్రపంచకప్‌కు మూడో ముద్దు పెట్టొచ్చు!

టీమ్‌ఇండియా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. కోహ్లి (117; 113 బంతుల్లో 9×4, 2×6), శ్రేయస్‌ అయ్యర్‌ (105; 70 బతుల్లో 4×4, 8×6) శతకాలు బాదడంతో మొదట భారత్‌ 4 వికెట్లకు 397 పరుగుల భారీ స్కోరు సాధించింది. శుభ్‌మన్‌ గిల్‌ (80 నాటౌట్‌; 66 బంతుల్లో 8×4, 3×6), రోహిత్‌ శర్మ (47; 29 బంతుల్లో 4×4, 4×6), రాహుల్‌ (39 నాటౌట్‌; 20 బంతుల్లో 5×4, 2×6) కూడా అదరగొట్టారు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ షమి (7/57) అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో ఛేదనలో కివీస్‌ 48.5 ఓవర్లలో 327 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ (134; 119 బంతుల్లో 9×4, 7×6), విలియమ్సన్‌ (69; 73 బంతుల్లో 8×4, 1×6) పోరాడారు. టీమ్‌ఇండియా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడం ఇది నాలుగోసారి.

షమి ఒక్కడు: కొండంత లక్ష్యం. పైగా షమి ధాటికి కివీస్‌ 39 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అంతే.. భారత్‌ విజయం నల్లేరుపై నడకే అనుకున్నారంతా! కానీ ఆందోళన తప్పలేదు. మిచెల్‌, విలియమ్సన్‌ అద్భుత బ్యాటింగ్‌తో భారత్‌కు చెమటలు పట్టించారు. ముఖ్యంగా మిచెల్‌ భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 31 ఓవర్లలో స్కోరు కివీస్‌ స్కోరు 213/2. ఆట కివీస్‌ నియంత్రణలో ఉన్న దశ అది. చేతిలో 8 వికెట్లున్న ఆ జట్టు 19 ఓవర్లలో చేయాల్సింది 185 పరుగులు. బౌలర్లు తేలిపోతున్నారు. ఒత్తిడిలో ఫీల్డర్లూ తప్పులు చేస్తున్నారు. పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండగా భారత్‌లో భయం క్రమంగా పెరుగుతోంది. కానీ అద్భుతంగా బౌలింగ్‌ చేసిన షమి.. భారత్‌కు ఆపద్భాందవుడయ్యాడు. నిలదొక్కుకున్న విలియమ్సన్‌తో పాటు లేథమ్‌ను ఒకే ఓవర్లో ఔట్‌ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. దీంతో కొన్ని ఓవర్లపాటు పరుగుల వేగం తగ్గినా..మిచెల్‌ దూకుడు కొనసాగిండం, ఫిలిప్స్‌ (41) కూడా చెలరేగడంతో స్కోరు బోర్డు వేగంగానే కదిలింది. భారత్‌కు ముప్పు పూర్తిగా తొలగలేదు. చివరి 10 ఓవర్లలో కివీస్‌ 132 పరుగులు చేయాల్సిన స్థితి. అయితే 43వ ఓవర్లో ఫిలిప్స్‌ను బుమ్రా ఔట్‌ చేశాడు. తర్వాతి ఓవర్లోనే చాప్‌మన్‌ (2)ను కుల్‌దీప్‌ ఔట్‌ చేయడంతో భారత్‌ విజయానికి మరింత చేరువైంది. ఆ తర్వాత మిచెల్‌ను షమి వెనక్కి పంపడంతో కివీస్‌ ఓటమి లాంఛనమే. తర్వాత షమి మరో రెండు వికెట్లు పడగొట్టాడు.

కొట్టేశారు..: బ్యాటుతో టీమ్‌ఇండియాది అదే జోరు. అంచనాలను అందుకుంటూ, అభిమానులను మురిపిస్తూ మరోసారి టాప్‌ఆర్డర్‌ మెరుపు ఆరంభాన్నిస్తే.. మిడిల్‌ ఆర్డర్‌ దంచి కొట్టింది. టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకోగా.. రోహిత్‌ అలవాటుగా ఆరంభం నుంచే ఎటాకింగ్‌ మొదలెట్టాడు. ఇంతకుముందు మ్యాచ్‌ల్లో లాగే మరో ఓపెనర్‌ గిల్‌ అతడికి సహకరించాడు. భారత్‌ 8 ఓవర్లలో 70/0తో నిలిచింది. అయితే విలియమ్సన్‌ అందుకున్న ఓ కళ్లు చెదిరే క్యాచ్‌కు రోహిత్‌ నిష్క్రమించాడు. అయితే అతను వేసిన పునాదిపై మిగతా బ్యాటర్లు ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మించారు. సూపర్‌ ఫామ్‌ను కొనసాగించిన గిల్‌ తన బాధ్యతను గొప్పగా నిర్వర్తించాడు. ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ..కోహ్లితో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 41 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన గిల్‌.. తొడకండరాలు పట్టేయడంతో 23వ ఓవర్లో రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. అప్పటికి స్కోరు 164. కివీస్‌కు ఎలాంటి ఉపశమనమూ లేదు. సాధికారికంగా బ్యాటింగ్‌ చేసిన కోహ్లి.. శ్రేయస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. కోహ్లి-శ్రేయస్‌ జంట 163 పరుగుల మెరుపు భాగస్వామ్యంతో జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించింది. బ్యాటర్లిద్దరూ చక్కగా స్ట్రైక్‌రొటేట్‌ చేసుకుంటూ, వీలైనప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును నడిపించారు. అలవోకగా షాట్లు ఆడుతూ అభిమానులను అలరించిన కోహ్లి.. ఈ క్రమంలో 50వ వన్డే సెంచరీ సాధించాడు. మరోవైపు కోహ్లితో భాగస్వామ్యంలో శ్రేయస్‌దే దూకుడు ఎక్కువ. కళ్లు చెదిరే స్ట్రోక్‌ప్లేతో మధ్య ఓవర్లలో అతడు స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. 35 బంతుల్లో అర్ధశతకం సాధించిన శ్రేయస్‌.. 67 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. కోహ్లి 44వ ఓవర్లో ఔట్‌ కాగా.. శ్రేయస్‌ 49వ ఓవర్లో వెనుదిరిగాడు. ఆఖర్లో చెలరేగి ఆడిన రాహుల్‌ ఇన్నింగ్స్‌కు మెరుపు ముగింపునిచ్చాడు.


ఇది షమిఫైనల్‌

రంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన కివీస్‌.. ఏం పోరాడుతుందిలే అనుకుంటే మిచెల్‌, విలియమ్సన్‌ భారీ భాగస్వామ్యంతో భారత్‌ను కంగారు పెట్టారు. వికెట్‌ కోసం అందరూ ఎంతో ఆశగా చూస్తున్న సమయంలో బుమ్రా బౌలింగ్‌కు వచ్చాడు. 29వ ఓవర్లో అతడి బంతిని అంచనా వేయడంలో విఫలమైన విలియమ్సన్‌ మిడాన్‌లో ఉన్న షమి చేతుల్లోకి క్యాచ్‌ ఇచ్చాడు. నేరుగా చేతుల్లోకి వచ్చి పడ్డ బంతిని షమి అందుకోలేకపోయాడు. అప్పటికి విలియమ్సన్‌ స్కోరు 52. తేలికైన క్యాచ్‌ను విడిచిపెట్టిన షమి అభిమానుల దృష్టిలో విలన్‌గా మారాడు. కానీ కాసేపటి తర్వాత బౌలింగ్‌కు వచ్చిన షమి.. 33వ ఓవర్‌ రెండో బంతికి విలియమ్సన్‌ (69) ఔట్‌ చేసి ఉపశమనాన్నిచ్చాడు. అదే ఓవర్‌ నాలుగో బంతికే లేథమ్‌ను వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నాడు.


భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) విలియమ్సన్‌ (బి) సౌథీ 47; గిల్‌ నాటౌట్‌ 80; కోహ్లి (సి) కాన్వే (బి) సౌథీ 117; శ్రేయస్‌ అయ్యర్‌ (సి) మిచెల్‌ (బి) బౌల్ట్‌ 105; రాహుల్‌ నాటౌట్‌ 39; సూర్యకుమార్‌ (సి) ఫిలిప్స్‌ (బి) సౌథీ 1; ఎక్స్‌ట్రాలు 8

మొత్తం: (50 ఓవర్లలో 4 వికెట్లకు) 397;

వికెట్ల పతనం: 1-71, 2-164, 3-327, 4-382;

బౌలింగ్‌: బౌల్ట్‌ 10-0-86-1; సౌథీ 10-0-100-3; శాంట్నర్‌ 10-1-51-0; ఫెర్గూసన్‌ 8-0-65-0; రచిన్‌ 7-0-60-0; ఫిలిప్స్‌ 5-0-33-0

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (సి) రాహుల్‌ (బి) షమి 13; రచిన్‌ (సి) రాహుల్‌ (బి) షమి 13; విలియమ్సన్‌ (సి) సూర్యకుమార్‌ (బి) షమి 69; మిచెల్‌ (సి) జడేజా (బి) షమి 134; లేథమ్‌ ఎల్బీ (బి) షమి 0; ఫిలిప్ప్‌ (సి) జడేజా (బి) బుమ్రా 41; చాప్‌మన్‌ (సి) జడేజా (బి) కుల్‌దీప్‌ 2; శాంట్నర్‌ (సి) రోహిత్‌ (బి) సిరాజ్‌ 9; సౌథీ (సి) రాహుల్‌ (బి) షమి 9; బౌల్ట్‌ నాటౌట్‌ 2; ఫెర్గూసన్‌ (సి) రాహుల్‌ (బి) షమి 6; ఎక్స్‌ట్రాలు 9

మొత్తం: (48.5 ఓవర్లలో ఆలౌట్‌) 327;

వికెట్ల పతనం: 1-30, 2-39, 3-220, 4-220, 5-295, 6-298, 7-306, 8-319, 9-321;

బౌలింగ్‌: బుమ్రా 10-1-64-1; సిరాజ్‌ 9-0-78-1; షమి 9.5-0-57-7; జడేజా 10-0-63-0; కుల్‌దీప్‌ 10-0-56-1


54

ప్రపంచకప్‌ చరిత్రలో షమి తీసిన వికెట్లు. 17 ఇన్నింగ్స్‌ల్లోనే 50 వికెట్ల మైలురాయి చేరుకున్న అతను.. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా మిచెల్‌ స్టార్క్‌ (19 ఇన్నింగ్స్‌)ను వెనక్కినెట్టాడు.


4

ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో అయిదు అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించడం షమికి ఇది నాలుగోసారి. అత్యధిక సార్లు ఈ ఘనత సాధించింది అతనే. స్టార్క్‌ (3)ను దాటాడు.


ఈ ప్రపంచకప్‌లో 500కు పైగా పరుగులు చేసిన భారత ఆటగాళ్ల సంఖ్య. కోహ్లి (711), రోహిత్‌ (550), శ్రేయస్‌ (526) ఈ మార్కును దాటారు.


3

అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కోహ్లి స్థానం. 13,794 పరుగులతో ఉన్న అతను.. పాంటింగ్‌ (13,704)ను వెనక్కినెట్టాడు. సచిన్‌ (18,426), సంగక్కర (14,234) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.  


19

ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా కొట్టిన సిక్సర్లు. ప్రపంచకప్‌లో ఓ నాకౌట్‌ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టుగా వెస్టిండీస్‌ (2015 క్వార్టర్స్‌లో 16) రికార్డును భారత్‌ బద్దలుకొట్టింది.


67 

శతకం కోసం శ్రేయస్‌ తీసుకున్న బంతులు. ఓ ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో వేగవంతమైన శతకం అతడిదే. గిల్‌క్రిస్ట్‌ (2007 ఫైనల్లో శ్రీలంకపై 72 బంతుల్లో) దాటాడు.


397/4

న్యూజిలాండ్‌తో సెమీస్‌లో భారత్‌ స్కోరు. ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌ల్లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా న్యూజిలాండ్‌ (2015 క్వార్టర్స్‌లో వెస్టిండీస్‌పై 393/6) రికార్డును అధిగమించింది.


శ్రేయస్‌ సెంచరీ.. రోహిత్‌ ఇలా

నాధన్‌ బ్యాటింగ్‌లో అలరించిన శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీ పూర్తి కాగానే సంబరాల్లో మునిగిపోయాడు. మరోవైపు అదే సమయంలో డ్రెస్సింగ్‌ గదిలో ఉన్న రోహిత్‌.. ఓ చేయి పైకెత్తి నడుస్తూ బయటకు వచ్చాడు. శ్రేయస్‌ను రోహిత్‌ ఇలా సరదాగా అనుకరించడంతో పక్కనే ఉన్న కుల్‌దీప్‌, గిల్‌ నవ్వుకున్నారు.


షమి పట్టలేడు.. పడగొట్టాడు

ఛేదనలో కివీస్‌ దీటుగా స్పందించడంతో భారత్‌కు కంగారు తప్పలేదు. అయితే ఈ ఆందోళన లేకుండా.. భారత్‌కు పట్టుబిగించేందుకు వచ్చిన మంచి అవకాశాన్ని షమి వృథా చేశాడు. ప్రమాదకరంగా మారిన మిచెల్‌, విలియమ్సన్‌ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు బుమ్రా బౌలింగ్‌కు వచ్చాడు. 29వ ఓవర్‌ అయిదో బంతికి ఆఫ్‌స్టంప్‌ ఆవల వేసిన స్లో లెంగ్త్‌ బంతిని అంచనా వేయడంలో విఫలమైన విలియమ్సన్‌ మిడాన్‌లో ఉన్న షమి చేతుల్లోకి క్యాచ్‌ ఇచ్చాడు. కానీ లడ్డూ లాంటి క్యాచ్‌ను షమి చేజార్చాడు. అప్పుడు విలియమ్సన్‌ స్కోరు 52. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ సెంచరీ దిశగా విలియమ్సన్‌ సాగాడు. కానీ మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన షమి.. 33వ ఓవర్‌ రెండో బంతికి విలియమ్సన్‌ను బుట్టలో వేసుకున్నాడు. డీప్‌స్క్వేర్‌లో సూర్య పట్టిన క్యాచ్‌తో విలియమ్సన్‌ నిష్క్రమించాడు. అదే ఓవర్‌ నాలుగో బంతికే లేథమ్‌ను వికెట్లు ముందు దొరకబుచ్చుకున్న షమి మ్యాచ్‌ను పూర్తిగా భారత్‌ వైపు తిప్పేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు