IND vs AUS: ఆసీస్‌తో కీలక పోరు.. భారత కూర్పు ఎలా ఉండనుందో..?

ఆస్ట్రేలియాపై మూడు టీ20ల సిరీస్‌ను గెలిచేందుకు హైదరాబాద్‌లో అడుగు పెట్టింది టీమ్‌ఇండియా. చెరొక విజయంతో 1-1తో సమంగా ఉండటంతో ఆదివారం...

Updated : 24 Sep 2022 20:13 IST

హైదరాబాద్‌ వేదికగా చివరి టీ20 మ్యాచ్‌

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియాపై మూడు టీ20ల సిరీస్‌ను గెలిచేందుకు హైదరాబాద్‌లో అడుగు పెట్టింది టీమ్‌ఇండియా. చెరొక విజయంతో 1-1తో సమంగా ఉండటంతో ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌ కీలకంగా మారింది. తొలి మ్యాచ్‌లో 209 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైన భారత్‌ ఓటమిపాలైంది. ఇక ఎనిమిది ఓవర్ల ఆట జరిగిన రెండో టీ20లో 91 పరుగులను ఛేదించి మరీ సిరీస్‌ రేసులో నిలిచింది. ఈ క్రమంలో ఉప్పల్‌ వేదికగా జరిగే మూడో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా బ్యాటింగ్‌, బౌలింగ్‌ సహా ఫీల్డింగ్‌లోనూ రాణించాల్సిందే. ఆసీస్‌కు ఏమాత్రం అవకాశం ఇచ్చినా సిరీస్‌ను ఎగరేసుకుపోవడం ఖాయం. 

బౌలింగ్‌ పటిష్టమేనా..?

భారత్‌, ఆసీస్‌ జట్ల మధ్య నాగ్‌పుర్‌ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోవడం ఉత్తమం. కేవలం ఎనిమిది ఓవర్ల మ్యాచ్‌ మాత్రమే కావడంతో సహజంగానే బ్యాటర్ల దూకుడు అధికంగా ఉంటుంది. అయినా భారత స్పిన్నర్ అక్షర్‌ పటేల్ (2/13) సూపర్‌గా బౌలింగ్‌ చేశాడు. చాలా కాలం తర్వాత గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన బుమ్రా తన రెండు ఓవర్ల కోటాలో 23 పరుగులు సమర్పించాడు. అయితే దీనికేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. తక్కవ నిడివితో జరిగే మ్యాచ్‌లో  బౌలర్లపై బ్యాటర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తుంటారు. 

అయితే హర్షల్‌ పటేల్‌ ప్రదర్శన మాత్రం ఆందోళనకరంగానే ఉంది. డెత్‌ ఓవర్లలో అద్భుతంగా వేస్తాడని అంచనాలు పెట్టుకొన్న హర్షల్‌ మాత్రం తేలిపోతున్నాడు. తొలి టీ20లోనూ.. అలాగే రెండో మ్యాచ్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. టాప్ ఆర్డర్‌ను త్వరగానే పెవిలియన్‌కు చేరుస్తున్న భారత్‌.. మ్యాథ్యూ వేడ్‌ను మాత్రం అడ్డుకోవడంలో విఫలం కావడం గమనార్హం. ఇక చివరి టీ20లో వేడ్‌ను దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పూర్తి ఓవర్లపాటు ఆట సాగితే మాత్రం బుమ్రా ఉన్న నేపథ్యంలో డెత్‌ ఓవర్లలో ఆసీస్‌కు అడ్డుకట్ట పడే అవకాశం లేకపోలేదు. 

కోహ్లీ గాడిలో పడాలి..

ఆసియా కప్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ.. ఆసీస్‌తో టీ20 సిరీస్‌లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. రెండు మ్యాచుల్లో వరుసగా 2, 11 పరుగులు మాత్రమే చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో కీలకమైన మరోక ప్లేయర్ సూర్యకుమార్‌ యాదవ్‌ తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించినా.. తీవ్ర ఒత్తిడి ఉన్న రెండో టీ20లో గోల్డెన్‌ డక్‌గా పెవిలియన్‌కు చేరాడు. మొన్నటి దాకా దినేశ్ కార్తిక్‌ ఫినిషింగ్‌పై కాస్త ఆందోళన పడినా.. కీలక సమయంలో తనపై ఉంచిన నమ్మకాన్ని కార్తిక్‌ నిలబెట్టాడు. నాగ్‌పుర్‌ టీ20 చివరి ఓవర్‌లో తొలి రెండు బంతులకే బౌండరీలు బాదేసి భారత్‌కు విజయం చేకూర్చాడు. 

ఎవరు ఉంటారు..?

రెండో టీ20 జరిగిన నాగ్‌పుర్‌ మైదానం చిత్తడిగా ఉండటంతో ఓవర్లను కుదించిన విషయం తెలిసిందే. దాదాపు రెండున్నర గంటల తర్వాత మ్యాచ్‌ జరిగింది. దీంతో రోహిత్ శర్మ అదనంగా హిట్టర్ ఉంటే బాగుంటుందని భావించి దినేశ్‌ కార్తిక్‌తోపాటు రిషభ్‌ పంత్‌నూ తుది జట్టులో తీసుకొన్నాడు. బుమ్రా, హర్షల్‌, హార్దిక్‌ కూడా పేస్‌ దళం.. అక్షర్‌ పటేల్, చాహల్‌ స్పిన్నర్లను ఎంచుకొన్నాడు. ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ను పక్కన పెట్టాడు. అయితే హైదరాబాద్‌ వేదికగా జరిగే మ్యాచ్‌ పూర్తిస్థాయి ఓవర్లపాటు ఆడే అవకాశం ఉంది. హర్షల్‌ ప్రదర్శన సరిగా లేని నేపథ్యంలో బౌలింగ్‌ ఎంపిక సవాల్‌తో కూడుకున్నదే. అక్షర్‌ పటేల్‌తోపాటు చాహల్‌ ఉండే అవకాశం ఉంది. బ్యాటింగ్‌కు పనికొస్తాడని భావిస్తే అశ్విన్‌ ఎంపిక ఉత్తమం. ఇక హర్షల్‌ను పక్కన పెట్టి.. భువీ, ఉమేశ్‌ను తీసుకొని ఓ బ్యాటర్‌ను తగ్గించే అవకాశాలూ లేకపోలేదు. దీంతో మరోసారి రిషభ్‌/కార్తిక్‌లో ఎవరు తుది జట్టులో ఉంటారు.. రోహిత్‌ నిర్ణయం ఎలా ఉండనుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. దాదాపు మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌ జరగనుంది.

భారత్ జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్,విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్/దినేశ్‌ కార్తిక్, అక్షర్ పటేల్, భువనేశ్వర్‌ కుమార్, చాహల్, బుమ్రా, హర్షల్‌ పటేల్/ఉమేశ్‌ యాదవ్

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని