Rohit Sharma: ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్‌ ఈజ్‌ బ్యాక్: హర్భజన్

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్‌ కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 20 Apr 2024 12:46 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో కెప్టెన్సీకి దూరమైన తర్వాత రోహిత్ శర్మ (Rohit Sharma) బ్యాటర్‌గా అదరగొట్టేస్తున్నాడు. అయితే, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ కాసేపు కెప్టెన్‌ అవతారం ఎత్తాడు. చివరి ఓవర్లలో ఫీల్డింగ్‌ను సెట్‌ చేయడంతోపాటు బౌలర్లకు కీలక సూచనలు ఇచ్చాడు. దీంతో తమ అభిమాన క్రికెటర్ మళ్లీ కెప్టెన్‌గా యాక్టివేట్‌ అవుతున్నాడని ఫ్యాన్స్‌ ఖుషీ అయ్యారు. రెగ్యులర్ సారథి హార్దిక్‌ పాండ్య, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో సమాలోచనలు చేస్తూ రోహిత్ ముంబయి విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

‘‘పంజాబ్‌తో మ్యాచ్‌లో ముంబయి జట్టును చూస్తే ముచ్చటేసింది. హార్దిక్‌, రోహిత్, బుమ్రా ఒకరినొకరు సంప్రదించుకుంటూ జట్టును నడిపించారు. చివరి రెండు ఓవర్లలో రోహిత్‌ను ముంబయి సారథిగా చూశాం. అతడే ఫీల్డింగ్‌ పెట్టాడు. బౌలర్లకు ఎలా వేయాలో సూచించాడు. కెప్టెన్‌గా మళ్లీ తన పాత అవతారం ఎత్తాడు. ఇప్పుడు ముంబయి మళ్లీ విజయం సాధించింది. అయితే, ప్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే ఇంకా కష్టపడాలి. అదేమంతా ఈజీ కాదు’’ అని హర్భజన్‌ తెలిపాడు. 

బుమ్రాను సరిగ్గా వాడుకోవడం లేదు: మూడీ

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో బుమ్రాను కెప్టెన్ హార్దిక్‌ సరైన పద్ధతిలో వాడుకోవడం లేదని ఆసీస్ మాజీ కెప్టెన్ టామ్‌ మూడీ వ్యాఖ్యానించాడు. ‘‘పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ ఇది సుస్పష్టంగా కనిపించింది. ఆరంభంలోనే రెండు వికెట్లను పడగొట్టిన బుమ్రాతో మళ్లీ 13వ ఓవర్‌ తర్వాత వేయించారు. పవర్‌ప్లేలో రెండు ఓవర్లలోనే కీలక బ్యాటర్లను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత మళ్లీ పంజాబ్‌ పుంజుకొనేందుకు అవకాశం ఇచ్చేలా బుమ్రాను ఆలస్యంగా బౌలింగ్‌ తీసుకొచ్చారు. గెరాల్డ్‌ పరిస్థితి కూడా అలానే ఉంది. ప్రత్యర్థి జట్టు ఇబ్బందుల్లో ఉన్నప్పుడే వారిద్దరితో బౌలింగ్‌ చేయించి ఉంటే కోలుకొనేందుకు కష్టమయ్యేది. మ్యాచ్‌ చివరి వరకూ వచ్చేదే కాదు. వ్యూహాత్మకంగా ముంబయి ఇబ్బందులు పడుతూనే ఉంది. బుమ్రా, కోయిట్జీకి సహకారం అందించేందుకు మిగతా బౌలర్లూ ముందుకు రావాలి’’ అని వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు