IND vs BAN: బంగ్లాతో టెస్టు సిరీస్‌.. ఆ ఇద్దరూ లేనట్లేనా?

గాయాల కారణంగా బంగ్లాదేశ్‌(Bangladesh)తో వన్డే సిరీస్‌(ODI Series)కు దూరమైన జడేజా, షమీలు టెస్టు సిరీస్‌లో సైతం ఆడే అవకాశాలు కనపడటం లేదు. 

Updated : 09 Dec 2022 12:11 IST

చట్‌గావ్‌: గాయం కారణంగా బంగ్లాదేశ్‌(Bangladesh)తో వన్డే సిరీస్‌(ODI Series)కు పేసర్‌ మహమ్మద్‌ షమీ(Mohammed shami) దూరమైన విషయం తెలిసిందే. మరోవైపు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(Ravindra jadeja) కూడా అందుబాటులో లేడు. అయితే.. డిసెంబర్‌ 14 నుంచి ప్రారంభం కానున్న బంగ్లాతో టెస్టు సిరీస్‌లో వీరిద్దరూ ఫిట్‌నెస్‌తో తిరిగి వస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. కానీ, ఇంకా గాయాల నుంచి పూర్తిగా కోలుకోని నేపథ్యంలో ఈ సిరీస్‌కు సైతం వీరు అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. వీరి స్థానాలను భర్తీ చేసే యోచనలో బీసీసీఐ(BCCI) ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ సౌరభ్‌ కుమార్‌(Saurabh kumar) రానున్న టెస్టు సిరీస్‌లో జడేజా స్థానంలో అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. మహమ్మద్‌ షమీ స్థానంలో పేసర్‌ నవదీప్‌ సైనిని జట్టులోకి తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఇద్దరు ఆటగాళ్లు బంగ్లాదేశ్‌- ఎతో జరుగుతున్న అనధికార టెస్టు సిరీస్‌ పర్యటనలో ఉన్నారు.

సౌరభ్‌ రంజీ ట్రోఫీలో నిలకడగా రాణిస్తున్నాడు. దిగువ బ్యాటింగ్ ఆర్డర్లో కూడా ఇతడు ఆడగలడు. గురువారం జరిగిన మ్యాచ్‌లో 55 బంతుల్లో 39 పరుగులు చేసి రాణించాడు. షమీ స్థానంలో నవదీప్‌ సైనికి అవకాశం వస్తే.. ఉమేశ్‌ యాదవ్‌, శార్దుల్‌ ఠాకూర్‌, మహమ్మద్‌ సిరాజ్‌తో కలిసి సీమ్‌ బౌలింగ్‌ ఎంపికల్లో ఒకడిగా చేరనున్నాడు. మీర్పూర్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బొటనవేలి గాయం కారణంగా మూడో వన్డేకు దూరం కానున్న కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సైతం టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండేది అనుమానమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని