Updated : 07 Sep 2022 13:21 IST

Asia Cup: ఆసియా కప్‌ సూపర్‌-4.. టీమ్‌ఇండియాకు ‘19వ ఓవర్‌’ ఫోబియా!

వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమికి కారణం ఇదే..

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌కు 19వ ఓవర్‌ ఫోబియా పట్టుకుందా..? ఆసియా కప్‌లో వరుసగా రెండో ఓటమికి ప్రధాన కారణం ఈ ఓవర్‌లో భారీగా పరుగులు ఇవ్వడం. రెండు సార్లు సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమారే బాధితుడు కావడం గమనార్హం. అసలేంటి 19వ ఓవర్‌ ఫోబియా.. టీమ్ఇండియా ఓటమికి సంబంధం ఏంటి..? తెలుసుకుందాం..

తొలుత పాక్‌పై.. 

యూఏఈ పిచ్‌లు ఛేదనకు అనుకూలంగా ఉంటున్నాయి. టాస్‌ నెగ్గిన జట్లు దాదాపు తొలుత బౌలింగ్‌ వైపే మొగ్గు చూపాయి. ఈ క్రమంలో మొదట బ్యాటింగ్‌ చేసిన జట్లు 180 వరకు పరుగులు చేసినా.. లక్ష్య ఛేదనలో మాత్రం కాపాడుకోవడంలో విఫలమై ఓటమిబాట పట్టాయి. టీమ్‌ఇండియా కూడా ఇలాగే ఓడిపోయింది. ఆసియా కప్‌ సూపర్‌-4లో తొలి రెండు మ్యాచుల్లో భారత్‌ ఓటమికి రెండు ప్రధాన కారణాలు.. తొలుత బ్యాటింగ్‌ చేయడం, 19వ ఓవర్‌లో భారీగా పరుగులు సమర్పించుకోవడం.

గ్రూప్‌ స్టేజ్‌లో పాక్‌ మీద విజయం సాధించిన టీమ్‌ఇండియా.. సూపర్-4లో మాత్రం చేతులెత్తేసింది. భారీ స్కోరు సాధించినా ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్‌ చేసి భారత్ 181/7 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాక్‌ 182/5 చేసి విజయం సాధించింది. చివరి 2 ఓవర్లలో 26 పరుగులు చేయాల్సిన క్రమంలో సీనియర్ బౌలర్‌ భువనేశ్వర్‌ 19వ ఓవర్‌ వేశాడు. అప్పటి వరకు అద్భుతంగా బౌలింగ్‌ వేసిన భువీ ఈ ఓవర్‌లో మాత్రం సిక్స్‌, రెండు ఫోర్లు సహా 19 పరుగులు ఇచ్చాడు. దీంతో ఆఖరి ఓవర్‌కు కేవలం ఏడు పరుగులను మాత్రమే కాపాడుకోవాల్సి వచ్చింది. అప్పటికీ యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ మ్యాచ్‌ను ఐదో బంతి వరకు తీసుకెళ్లడం  అద్భుతమే.

లంక మీదా ఇలానే..

ఆసియా కప్‌ ఫైనల్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో లంకపై భారత్‌ ఓడింది. ఇది కూడా చివరి బంతి వరకూ వెళ్లింది. కానీ ప్రత్యర్థి వైపే విజయం మొగ్గు చూపింది. దీనికి కారణం కూడా 19వ ఓవర్‌లో ఎక్కువగా పరుగులు ఇవ్వడమే. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం ఓపెనర్లు ధాటిగా ఆడటంతో  11 ఓవర్లకే వికెట్‌ నష్టపోకుండా లంక 97 పరుగులు చేసింది. అయితే చాహల్‌, అశ్విన్‌ విజృంభించడంతో స్వల్ప వ్యవధిలో ఓపెనర్లతోపాటు మరో రెండు వికెట్లను పడగొట్టి భారత్‌ రేసులోకి వచ్చింది. మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో లంకను అడ్డుకోగలిగారు. దీంతో చివరి రెండు ఓవర్లకు 21 పరుగులు కావాల్సి వచ్చింది. 

మరోసారి 19వ ఓవర్‌ను వేసేందుకు సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ చేతికే రోహిత్ బంతినిచ్చాడు. తొలి రెండు బంతులకు సింగిల్స్ ఇచ్చిన భువీ ఫర్వాలేదనిపించాడు. అయితే తర్వాత వరుసగా రెండు వైడ్లు వేశాడు. దీంతో లంక బ్యాటర్లపై ఒత్తిడి కాస్త తగ్గింది. లంక కెప్టెన్‌ శనక వరుసగా రెండు ఫోర్లు బాది లక్ష్యాన్ని కరిగించాడు. ఇక చివరి రెండు బంతులకు మరో రెండు సింగిల్స్ వచ్చాయి. దీంతో భువనేశ్వర్‌ ఈ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు ఇచ్చాడు. కీలకమైన ఓవర్‌లో భారీగా పరుగులు రావడంతో లంక పని సులువైంది. చివరి ఓవర్‌లో ఏడు పరుగులు అవసరం కాగా.. మళ్లీ అర్ష్‌దీప్‌ కట్టుదిట్టంగా బంతులను సంధించి మ్యాచ్‌ను 19.5వ ఓవర్‌ వరకూ తీసుకొచ్చాడు. అయితే.. అక్కడ అనవసర తప్పిదానికి బైస్‌ రూపంలో రెండు పరుగులు ఇవ్వడంతో లంక విజయం ఖరారైంది. భారత్‌ పరాభవం చవిచూసింది. 

ఇలాగే కొనసాగితే ఆసియా కప్‌లోని మిగిలిన ఒక మ్యాచ్‌తోపాటు వచ్చే ప్రపంచకప్‌లోనూ టీమ్‌ఇండియాకు ఇబ్బందులు తప్పవు. యువ బౌలర్లు ఒత్తిడికి గురవుతారని.. సీనియర్‌కు బౌలింగ్‌ ఇస్తే పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. డెత్‌ ఓవర్లలో పరుగులు నియంత్రించడం ఎంత కీలకమో ఇప్పటికైనా భారత ఆటగాళ్లు అర్థం చేసుకోవాలని విశ్లేషకులు సూచనలు చేశారు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని