Team India: వరల్డ్‌ కప్‌ సెమీస్‌లు.. టీమ్‌ఇండియా నిష్పత్తి 3 : 4

వన్డే ప్రపంచకప్‌ల్లో (ODI World Cup 2023) భారత్ ఎనిమిదోసారి సెమీస్‌కు చేరుకుంది. ఇప్పటి వరకు జరిగిన ఏడింట్లో టీమ్‌ఇండియా పరిస్థితి ఇదీ..

Published : 14 Nov 2023 17:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్‌ 2023 (ODI World Cup 2023) మెగా టోర్నీ సెమీస్‌ దశకు చేరింది. తొలి సెమీఫైనల్ భారత్-న్యూజిలాండ్ (IND vs NZ) జట్ల మధ్య ముంబయిలోని వాంఖడే వేదికగా జరగనుంది. ఇప్పటికే రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన టీమ్‌ఇండియా స్వదేశంలో జరుగుతున్న వరల్డ్‌ కప్‌ను ముచ్చటగా మూడోసారి సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. లీగ్‌ స్టేజ్‌లో అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించిన భారత్‌ అగ్రస్థానంతో సగర్వంగా సెమీస్‌కు వెళ్లింది. ఇప్పటి వరకు వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఏడుసార్లు భారత్ సెమీఫైనల్‌కు చేరుకోగా.. మూడుసార్లు విజేతగా నిలిచింది. అందులోనూ రెండుమార్లు ఛాంపియన్‌ కావడం విశేషం.

  • 1983: భారత క్రికెట్‌ దశను మార్చిన సంవత్సరం. కపిల్‌ దేవ్ నాయకత్వంలోని భారత్‌ తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది. సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను 213 పరుగులకే కట్టడి చేసిన భారత్‌ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఫైనల్‌లో పటిష్ఠమైన విండీస్‌ను చిత్తు చేసిన సంగతి తెలిసిందే. 
  • 1987: డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ సెమీస్‌కు చేరింది. అయితే, ఈసారి ఇంగ్లాండ్‌దే పైచేయిగా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్ 254/6 స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 219 పరుగులకే పరిమితమై 35 రన్స్‌ తేడాతో ఓటమిపాలైంది. 
  • 1996: వన్డే ప్రపంచకప్‌ 1992లో భారత్ గ్రూప్‌ స్టేజ్‌కే పరిమితమై నిరాశపరిచింది. అయితే 96 వరల్డ్‌ కప్‌లో మాత్రం పుంజుకుని మళ్లీ సెమీస్‌కు వచ్చింది. కోల్‌కతా వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాభవం ఎదురైంది. లంక నిర్దేశించిన 252 పరుగుల లక్ష్యఛేదనలో 34 ఓవర్లకు 120/8 స్కోరుతో ఉన్నప్పుడు స్టేడియంలోని అభిమానులు మ్యాచ్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. ఆట నిర్వహణకు సాధ్యపడలేదు. దీంతో శ్రీలంకను విజేతగా ప్రకటిస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. ఈసారి కప్‌ను శ్రీలంక కైవసం చేసుకుంది. 
  • 2003: భారత్‌కు ఇది అద్భుత టోర్నీ. కీలక ఆటగాళ్లంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో రాణించారు. అనూహ్యంగా సెమీస్‌కు వచ్చిన కెన్యాపై టీమ్‌ఇండియా భారీ విజయం నమోదు చేసింది. తొలుత భారత్ 270/4 స్కోరు చేయగా.. అనంతరం కెన్యా 179 పరుగులకే ఆలౌటైంది. అయితే, ఫైనల్‌లో మాత్రం ఆసీస్‌ చేతిలో భారత్‌కు ఓటమి ఎదురైంది. దీంతో రన్నర్‌గానే టోర్నీని ముగించింది.
  • 2011: రెండోసారి టీమ్‌ఇండియా విశ్వ విజేతగా నిలిచిన ఏడాది. కెప్టెన్‌ కూల్‌ ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ వరల్డ్‌ కప్‌ను కైవసం చేసుకుంది. క్రికెట్ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌కు చివరి టోర్నీ. సెమీస్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేయడం విశేషం. తొలుత భారత్ 260/9 స్కోరు చేయగా.. పాకిస్థాన్‌ 231 పరుగులకే ఆలౌటైంది. సచిన్‌ (85) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. భారత బౌలర్లు సమష్ఠిగా రాణించి పాక్‌ను ఓడించంలో కీలక పాత్ర పోషించారు.
  • 2015: ఇలాంటి సెమీ ఫైనల్‌ మ్యాచ్ మళ్లీ చూడాలనుకోరు భారత క్రికెట్ అభిమానులు. వరుసగా రెండోసారి సెమీస్‌కు చేరిన టీమ్‌ఇండియాకు ఘోర పరాభవం ఎదురైంది. ఆసీస్‌ నిర్దేశించిన 329 పరుగుల టార్గెట్‌ ఛేదనకు దిగిన భారత్ 233 పరుగులకే ఆలౌటైంది.
  • 2019: ఎంఎస్ ధోనీ రనౌట్ ఎప్పటికీ మరిచిపోలేని సంఘటన. వర్షం కారణంగా రెండు రోజులపాటు జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై న్యూజిలాండ్‌ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి వరకు పోరాడిన ధోనీ రనౌట్‌ కావడంతోపాటు కీలక సమయంలో రవీంద్ర జడేజా పెవిలియన్‌కు చేరాడు. కివీస్ 239/8 స్కోరు చేయగా.. టీమ్‌ఇండియా 221 పరుగులకే ఆలౌటైంది. ఇప్పుడు మరోసారి కివీస్‌తోనే భారత్‌ తలపడనుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు