Hockey India: హాకీ వరల్డ్‌ కప్‌.. భారత్‌ సెమీస్‌కు చేరాలంటే.. ‘క్రాస్ ఓవర్‌’ చేయాల్సిందే..!

స్వదేశంలో జరుగుతున్న హాకీ ప్రపంచకప్‌లో (Hockey World Cup 2023) భారత్‌ (Team India) కీలక పోరు సిద్ధమవుతోంది. పూల్‌ దశలో రెండో స్థానంలో నిలవడంతో ‘క్రాస్‌ ఓవర్’ (CrossOver)లో భాగంగా న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ను ఆడనుంది. అందులో గెలిస్తేనే.. కప్‌ను సాధించాలనే కలకు ముందడుగు పడుతుంది.

Published : 21 Jan 2023 18:12 IST

ఇంటర్నెట్ డెస్క్‌:  1980ల్లో వెస్టిండీస్‌ క్రికెట్‌ టీమ్‌ అంటే ప్రత్యర్థులకు  హడల్‌.. అలాగే ఒకప్పుడు భారత హాకీ జట్టంటే కూడానూ బెంబేలెత్తిపోయేవి. ఒలింపిక్స్‌ బరిలోకి దిగితే స్వర్ణంతో కానీ ఇంటిముఖం పట్టేది కాదు. అలాగే హాకీ ప్రపంచకప్‌లోనూ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేది. ఒకసారి ఫైనల్‌.. మరోసారి సెమీస్‌కు వెళ్లినా కప్‌ను మాత్రం తీసుకురాలేకపోయింది. ఎట్టకేలకు మూడోసారి 1975లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది. అయితే ఇదంతా గతం.. 

దాదాపు 47 ఏళ్ల పాటు ఒక్కసారి కూడా ప్రపంచకప్‌ సెమీస్‌కు పోలేని పరిస్థితి. అత్యధికంగా ఐదో స్థానానికి మాత్రమే చేరుకోగలిగింది. మనం తొలిసారి కప్‌ను దక్కించుకొన్న తర్వాత ఇప్పటి వరకు 12 టోర్నమెంట్‌లు జరిగాయి. తాజాగా భారత్‌ వేదికగానే వరల్డ్‌ కప్‌ పోటీలు జరుగుతున్నాయి. ఈసారైనా సుదీర్ఘ కలను నెరవేర్చుకోవాలని టీమ్‌ఇండియా హాకీ అభిమానులు ఆశిస్తున్నారు. భారత ఆటగాళ్లు కూడా అదే ఊపులోనే ఉన్నట్లుగా ఉంది. ఎందుకంటే పూల్‌ స్థాయిలో మూడు మ్యాచుల్లోనూ విజయం సాధించి క్రాస్‌ఓవర్‌ మ్యాచ్‌కు వెళ్లిపోయింది. ఇంతకీ ఈ క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌ అంటే ఏంటి..? ఇందులో గెలిస్తే పరిస్థితేంటి? భారత్ అవకాశాలు ఎలా ఉన్నాయి...? అనే విషయాలను చూద్దాం

మొత్తం నాలుగు గ్రూప్‌లుగా విడిపోయిన 16 జట్లు ప్రపంచకప్‌ కోసం తలపడ్డాయి. ప్రతి పూల్‌ నుంచి టాప్‌లో నిలిచిన రెండు జట్లు రేసులో నిలవగా.. మిగతావి ఇంటిముఖం పట్టాయి. ఇప్పుడు క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌లను ఆడిన తర్వాత.. క్వార్టర్‌ ఫైనల్‌, సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లను నిర్వహిస్తారు. క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌లు అంటే.. ప్రతి పూల్‌లో టాప్‌ టీమ్‌ మినహా..  రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు మరోక పూల్‌లోని ఇతర జట్లతో తలపడి క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించేందుకు కల్పించే అవకాశమే క్రాస్‌ ఓవర్‌. అంటే ఆయా గ్రూప్‌లోని టాప్‌ జట్లు నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లగా.. ఈ రెండు స్థానాల్లో నిలిచిన టీమ్‌ల్లో క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌లో ఇతర జట్లతో తలపడి ఎవరు గెలిస్తే వారు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకొంటారు. ఇప్పుడు భారత్‌ కూడా గ్రూప్‌ - Dలో రెండో స్థానంలో ఉంది. దీంతో గ్రూప్‌ - Cలో మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌తో క్రాస్‌ఓవర్‌ మ్యాచ్ ఆడనుంది. 

ముందు క్రాస్‌ ఓవర్‌లో గెలిస్తే.. 

డిఫెన్స్‌ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ.. గ్రూప్‌ స్టేజ్‌లో భారత్‌ మూడు మ్యాచుల్లో రెండు గెలిచి, ఒకదానిని డ్రా చేసుకొంది. కాబట్టి మరోసారి సమష్ఠిగా రాణిస్తే న్యూజిలాండ్‌పై విజయం సాధిస్తే భారత్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్తుంది. అక్కడ మాత్రం కఠిన ప్రత్యర్థి బెల్జియం సిద్ధంగా ఉంది. బెల్జియ ఆడిన మూడు మ్యాచుల్లో ఏకంగా 14 గోల్స్ కొట్టింది. కేవలం ప్రత్యర్థులకు మూడు గోల్స్‌ను మాత్రమే ఇచ్చింది. అన్ని విభాగాల్లో పటిష్ఠమైన జట్టును ఢీకొట్టాలంటే టీమ్‌ఇండియా మరింత అప్రమత్తంగా ఉండాలి. బెల్జియంపై కచ్చితంగా గెలిస్తేనే సెమీస్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక వేళ డ్రాగా ముగించినా.. గత మ్యాచ్‌లకు సంబంధించిన గోల్స్ లెక్కలతో భారత్‌ ఇంటిముఖం పట్టక తప్పదు. గత టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత భారత్‌ ఆటగాళ్లు మరింత ఉత్సాహంతో ఉన్నారు. క్వార్టర్‌ ఫైనల్‌లో బెల్జియంను ఓడిస్తే  మాత్రం ఆత్మవిశ్వాసం పెరిగి తదుపరి మ్యాచ్‌లకు ఎంతో అక్కరకొస్తుంది. 

పైచేయి ఎవరిది..? మ్యాచ్ ఎప్పుడు.. ఎలా చూడాలి..? 

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య క్రాస్‌ ఓవర్‌ మ్యాచ్‌ ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. భువనేశ్వర్‌లోని కళింగ మైదానంలో మ్యాచ్‌ జరగనుంది. స్టార్ స్పోర్ట్స్‌ సెలెక్ట్ 2, స్టార్‌ స్పోర్ట్స్ ఛానెల్స్‌లో మ్యాచ్‌ను వీక్షించొచ్చు. ఇరు జట్లు అంతర్జాతీయంగా 44 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో భారత్‌ 24 మ్యాచుల్లో విజయం సాధించగా.. కివీస్‌ 15 మ్యాచుల్లోనే గెలిచింది. మరో ఐదు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఈ క్రమంలో గత రికార్డు ప్రకారం.. కివీస్‌పై భారత్‌ సమరోత్సాహంతో ఆడాలని ఆశిద్దాం..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని