Team India: వందే ‘విరాట్‌’ భళా భారత్‌..

బుధవారం వాంఖడేలో న్యూజిలాండ్‌ పోరాటం చూశాక.. మ్యాచ్‌ ముంగిట అలా భయపడటంలో ఆశ్చర్యమేమీ లేదనే అనిపించి ఉంటుంది అభిమానులకు.

Updated : 16 Nov 2023 07:52 IST

వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో రోహిత్‌సేన
సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఘనవిజయం
విరాట్‌ 50వ సెంచరీ..
షమీకి  7 వికెట్లు

‘‘న్యూజిలాండ్‌తో అంత తేలిక కాదు’’
వన్డే సెమీఫైనల్‌ ముంగిట భారత అభిమానులందరిలోనూ ఇదే అభిప్రాయం! మన జట్టు లీగ్‌ దశలో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తూ తొమ్మిదికి తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్‌ చేరినా సరే.. లోలోన ఏదో భయం!

బుధవారం వాంఖడేలో న్యూజిలాండ్‌ పోరాటం చూశాక.. మ్యాచ్‌ ముంగిట అలా భయపడటంలో ఆశ్చర్యమేమీ లేదనే అనిపించి ఉంటుంది అభిమానులకు. దాదాపు నాలుగొందల లక్ష్యం నిలిపినా.. ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టి గట్టి దెబ్బ తీసినా.. ప్రత్యర్థి అంత తేలిగ్గా లొంగలేదు.

రోహిత్‌సేనను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతూ.. ప్రత్యర్థి జట్టు కొండంత లక్ష్యం వైపు కసిగా అడుగులేస్తున్న వేళ.. వాంఖడేలో కేరింతల స్థానంలో నిశ్శబ్దం..! అప్పటిదాకా ధీమాగా టీవీల ముందు కూర్చున్న వారిలో ఒక్కసారిగా కంగారు..! ఇప్పటిదాకా సాధించిన విజయాలన్నీ వృథా కాబోతున్నాయా? బ్యాటర్ల కష్టం బూడిదపాలవ్వబోతోందా అన్న సందేహాలు!
కానీ అప్పుడొచ్చాడు మహ్మద్‌ షమి! కాసేపటి ముందే ఓ తేలికైన క్యాచ్‌ను విడిచిపెట్టిన అతణ్ని ఆ నిమిషం దాకా పెద్ద విలన్‌లా చూస్తున్నారు అభిమానులు. కానీ నిమిషాల్లో అతను సూపర్‌ హీరో అయిపోయాడు.

ఎవరి క్యాచ్‌ అయితే విడిచిపెట్టాడో అదే విలియమ్సన్‌ను, ఆ వెంటనే ఇంకో బ్యాటర్‌నూ ఔట్‌ చేశాడు. మధ్యలో ఇలా మ్యాచ్‌ను మలుపు తిప్పడమే కాదు.. ఆరంభంలో, చివర్లోనూ కివీస్‌ను దెబ్బ మీద దెబ్బ కొట్టి ఏకంగా 7 వికెట్లతో జట్టు విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు షమి. 50వ వన్డే శతకంతో చరిత్ర సృష్టిస్తూ ఇన్నింగ్స్‌కు ఇరుసులా వ్యవహరించిన విరాట్‌ కోహ్లి.. విధ్వంసక సెంచరీతో ఇన్నింగ్స్‌కు మెరుపు వేగాన్నిచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌.. జట్టుకు అద్భుత ఆరంభాన్నందించిన శుభ్‌మన్‌, రోహిత్‌.. ఆఖర్లో అదరగొట్టిన రాహుల్‌ కూడా ఈ మ్యాచ్‌లో హీరోలే.ప్రపంచకప్‌ లీగ్‌ దశలో ఆధిపత్యం చలాయిస్తే సెమీస్‌ గెలవలేదన్న సెంటిమెంటును జయిస్తూ.. ఐసీసీ టోర్నీల్లో నాకౌట్‌ దశలో న్యూజిలాండ్‌పై గెలవని చరిత్రను మారుస్తూ.. 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లోకి దూసుకెళ్లింది రోహిత్‌ సేన.


23

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ షమి తీసిన వికెట్లు. ఓ ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అతను నిలిచాడు.


4

ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌ చేరిన సందర్భాలు. 1983, 2003, 2011లో జట్టు ఫైనల్‌ ఆడింది. 2003లో మాత్రమే ఓడింది.


50

వన్డే క్రికెట్లో విరాట్‌ కోహ్లి శతకాల సంఖ్య. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీల రికార్డును అతను సొంతం చేసుకున్నాడు. 279 ఇన్నింగ్స్‌లోనే అతనీ ఘనత దక్కించుకున్నాడు.

 


711

ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకూ కోహ్లి చేసిన పరుగులు. ఒకే ప్రపంచకప్‌ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్‌ (2003లో 673)ను అధిగమించాడు.


7/57

వన్డేల్లో ఓ భారత్‌ బౌలర్‌ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఓ వన్డేలో ఏడు వికెట్లు సాధించిన తొలి భారత్‌ బౌలర్‌ కూడా షమినే. వన్డేల్లో ఓ భారత్‌ బౌలర్‌ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. ఓ వన్డేలో ఏడు వికెట్లు సాధించిన తొలి భారత్‌ బౌలర్‌ కూడా షమినే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు