IND vs SL : లంకతో పోరు.. ఓడితే భారత్‌ ఆశలు చేజారు!

పాకిస్థాన్‌ మీద విజయంతో ఆసియా కప్‌ను ఘనంగా ప్రారంభించిన భారత్‌.. సూపర్‌-4 దశలో మాత్రం పాక్‌ చేతిలో ఓటమిపాలైంది. మిగిలిన రెండు మ్యాచ్‌లను...

Updated : 06 Sep 2022 17:52 IST

ఇంటర్నెట్ డెస్క్‌: పాకిస్థాన్‌ మీద విజయంతో ఆసియా కప్‌ను ఘనంగా ప్రారంభించిన భారత్‌.. సూపర్‌-4 దశలో మాత్రం పాక్‌ చేతిలో ఓటమిపాలైంది. మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలిస్తేనే ఫైనల్‌ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఈ క్రమంలో మంగళవారం శ్రీలంకతో భారత్‌ తలపడనుంది. లంకపై టీమ్‌ఇండియానే కాస్త పైచేయి సాధించేలా ఉన్నప్పటికీ.. టీ20ల్లో ఏ క్షణాన ఏం జరుగుతుందో అంచనా వేయలేం. ఈ క్రమంలో ఇరు జట్ల బలాలు ఏంటి..  దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏంటనేవి తెలుసుకుందాం.. 

దూకుడుగానే ఆరంభించినా.. 

భారత బ్యాటింగ్‌ ఎప్పుడూ దూకుడుగానే ప్రారంభమవుతుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌ ఆరంభం నుంచే భారీ షాట్లు కొట్టేందుకు ప్రయత్నిస్తారు. అయితే వాటిని పెద్ద స్కోర్లుగా మలుచుకోవడంలోనే ఇబ్బంది ఎదురవుతుంది. ఉదాహరణకు పాక్‌తో మ్యాచ్‌లో తొలి వికెట్‌ పవర్‌ ప్లే ఓవర్లలోనే దాదాపు 60 పరుగులను జోడించారు. అయితే స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోవడంతో 200కిపైగా పరుగెత్తాల్సిన స్కోరు 181 వద్దే ఆగిపోయింది. అదీనూ విరాట్ కోహ్లీ (60) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. లేకపోతే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌, రిషభ్‌ పంత్, హార్దిక్‌ పాండ్య, దీపక్‌ హుడా విఫలం కావడం కలవరపెడుతోంది. మొదటి మ్యాచ్‌లో హార్దిక్‌ రాణించాడు. అయితే ఈసారి మాత్రం డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. అందుకే ఓపెనర్లు ఇచ్చిన శుభారంభం భారీ స్కోరుగా మారడంలో మిడిలార్డర్‌ బాధ్యత తీసుకోవాలి. కీలక మ్యాచుల్లో చేతులెత్తేస్తే మాత్రం బౌలర్లకు కష్టంగా మారే అవకాశం ఉంది. 

బౌలర్లు కష్టపడాల్సిందే.. 

అఫ్గానిస్థాన్‌ నిర్దేశించిన 176 పరుగులను లంక బ్యాటర్లు ఛేదించారు. టీ20 ఫార్మాట్‌లో టాప్‌క్లాస్‌ బౌలర్లు ఉన్న అఫ్గాన్‌నే లంక ఎదుర్కొని విజయం సాధించిందంటే ఆ జట్టును తక్కువగా అంచనా వేయకూడదని హెచ్చరిక లాంటిది. అందుకే టీమ్ఇండియా బౌలర్లు ఇంకొంచెం శ్రమించాల్సిన అవసరం ఉంది. భువనేశ్వర్‌ తన చివరి ఓవర్‌లో భారీగా పరుగులు ఇవ్వడం.. హార్దిక్‌ పాండ్య సరైన రిథమ్‌తో బౌలింగ్‌ చేయలేకపోవడం పాక్‌పై భారత్‌ ఓటమికి ముఖ్య కారణాలని క్రికెట్‌ విశ్లేషకులు అంచనా వేశారు. తొలి పదిఓవర్లలో అద్భుతంగా కట్టడి చేసిన టీమ్‌ఇండియా బౌలర్లు.. రెండో భాగంలో పాక్‌ బ్యాటర్ల ముందు చిత్తయ్యారు. పాక్‌ జట్టులో నవాజ్‌, షాదాబ్‌ రాణిస్తే.. చాహల్‌ మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. యువ బౌలర్లు అర్ష్‌దీప్‌, రవి బిష్ణోయ్‌ మంచి ప్రదర్శనే ఇచ్చారు. ప్రత్యర్థి ఛేజింగ్‌ సమయంలో బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధిస్తేనే ఫలితం సానుకూలంగా వచ్చే అవకాశం ఉంది. 

ఫీల్డర్లూ బహు పరాక్‌‌.. 

పాకిస్థాన్‌ మీద ఓడి పోవడానికి బౌలింగ్‌, బ్యాటింగ్‌లో నిర్లక్ష్యం ఎంత కారణమో.. ఫీల్డింగ్‌ వైఫల్యం కూడా కీలక పాత్ర పోషించింది. కేవలం సింగిల్‌ మాత్రమే వచ్చే సందర్భంలోనూ పాక్‌ బ్యాటర్లు ధైర్యంగా డబుల్‌ సాధించారు. మరీ ముఖ్యంగా కాలి నొప్పితో బాధపడుతూనే కీలక ఇన్నింగ్స్‌ ఆడిన రిజ్వాన్‌ కూడా వికెట్ల మధ్య చురుగ్గా పరుగెత్తాడు. కానీ మన ఫీల్డర్లు మాత్రం అంత దూకుడు ప్రదర్శించలేకపోయారు. అదేవిధంగా కీలక సమయంలో పాక్‌ బ్యాటర్‌ అసిఫ్ అలీ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ వదిలేశాడు. దీనికి భారత్‌ భారీ మూల్యమే చెల్లించుకొంది. భువనేశ్వర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో ఏకంగా సిక్స్‌, ఫోర్ బాదేసి మ్యాచ్‌ను పాక్‌వైపు తిప్పేశాడు. మంగళవారం శ్రీలంకతో జరిగే మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఫీల్డింగ్‌ చేయాలి. గ్రూప్‌ స్టేజ్‌లో హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక బ్యాటర్‌, ఆ జట్టు కెప్టెన్ నిజాకత్‌ ఖాన్‌ను రనౌట్‌ చేసిన విధానం అద్భుతం. ఆ మ్యాచ్‌లో భారత ఫీల్డింగ్‌ ప్రమాణాలు కూడా అత్యుత్తమంగా ఉన్నాయి.

లంకను తక్కువ అంచనా వేయొద్దు..

ఆసియా కప్‌ ఆరంభ మ్యాచ్‌లో అఫ్గాన్‌ చేతిలో లంక ఘోర ఓటమిని చవిచూసింది. కానీ ఆ తర్వాత బంగ్లాదేశ్‌పై సంచలన విజయం సాధించి సూపర్‌-4 దశకు చేరుకుంది. ఈ స్టేజ్‌లోనూ మొదటి మ్యాచ్‌ ఇరు జట్ల మధ్యే పడింది. అయితే అఫ్గాన్‌పై ప్రతీకార విజయం సాధించి లంక బ్యాటర్లు అదరగొట్టేశారు. అఫ్గాన్‌ నిర్దేశించిన 176 పరుగులను లంక ఛేదించింది. నిస్సాంక, కుశాల్ మెండిస్, కెప్టెన్ డాసున్ శనక, భానుక రాజపక్స, దనుష్క గుణతిలక, హసరంగ వంటి బ్యాటర్లు ఆ జట్టు సొంతం. వీరిలో హసరంగ, చమిక కరుణరత్నె, శనక ఆల్‌రౌండర్లు. లంక మిస్టరీ స్పిన్నర్‌గా మారిన తీక్షణ బౌలింగ్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మ్యాచ్‌ను లంక లాగేసుకొనే అవకాశం ఉంది. 

జట్లు వివరాలు (అంచనా): 

భారత్‌: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్/దినేశ్‌ కార్తిక్‌, దీపక్‌ హుడా, రవి బిష్ణోయ్, చాహల్, భువనేశ్వర్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

శ్రీలంక: నిస్సాంక, కుశాల్‌ మెండిస్‌, చరిత్ అసలంక, దనుష్క గుణతిలక, భానుక రాజపక్స, డాసున్ శనక (కెప్టెన్), వహిందు హసరంగ, చమిక కరుణ రత్నె, మహీష్ తీక్షణ, అసిత్‌ ఫెర్నాండో, దిల్షాన్ మదుశనక

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని