Hardik Pandya: హార్దిక్‌ పాండ్య ఔట్.. ఈ దెబ్బను భారత్ తట్టుకోగలదా?

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ప్రదర్శన అంచనాలను మించిపోయింది. మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి అందరికంటే ముందుగా సెమీస్ బెర్తును సొంతం చేసుకుంది రోహిత్ సేన. కానీ ఇంతలో భారత్‌కు పెద్ద షాక్. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు.

Updated : 05 Nov 2023 15:33 IST

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ప్రదర్శన అంచనాలను మించిపోయింది. మరే జట్టుకూ సాధ్యం కాని విధంగా ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించి అందరికంటే ముందుగా సెమీస్ బెర్తును సొంతం చేసుకుంది రోహిత్ సేన. కానీ ఇంతలో భారత్‌కు పెద్ద షాక్. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ప్రపంచకప్ మొత్తానికి దూరమయ్యాడు. హార్దిక్ లేకుండానే భారత్ నాలుగు విజయాలు సాధించింది కాబట్టి అతను దూరమైనా ఇబ్బంది లేదనుకుంటే పొరపాటే. నాకౌట్‌ దశలో ఈ లోటు ఎక్కడ ప్రతికూల ప్రబావం చూపుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రపంచకప్‌లో ఇప్పటికే సెమీస్ చేరిన భారత్‌కు లీగ్ దశలో మిగిలిన రెండు మ్యాచ్‌లూ నామమాత్రమే. వాటి ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత నాకౌట్లో రెండు మ్యాచ్‌లు గెలిస్తే భారత్ చేతిలోకి ప్రపంచకప్ వస్తుంది. టోర్నీ ఆరంభానికి ముందు భారత జట్టు మీద అంచనాలు ఓ మోస్తరుగానే ఉండేవి కానీ.. ఇప్పుడు అలా కాదు. ఇంగ్లాండ్ లాంటి హాట్ ఫేవరెట్ పేలవ ప్రదర్శనతో నిష్క్రమించే స్థితిలో.. భారత జట్టు వరుసగా ప్రతి జట్టునూ మట్టికరిపిస్తూ సెమీస్ బెర్తును సొంతం చేసుకున్నాక అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కప్పు మీద బోలెడు ఆశలతో ఉన్నారు అభిమానులు. ఇటు బ్యాటర్లు, అటు బౌలర్లు అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపిస్తూ ముందుకు సాగిపోతున్నారు. సెమీస్ ముంగిట భారత్ దుర్బేధ్యంగా కనిపిస్తోంది. నాకౌట్ దశకు హార్దిక్ పాండ్య కూడా వస్తే మరింత బలంగా మారుతుందని.. టీమ్‌ఇండియాకు ఎదురుండదని అంతా అనుకున్నారు. కానీ ఇంతలో హార్దిక్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడన్న వార్త షాక్‌కు గురి చేసింది. ఈ నెల 19న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా తన తొలి ఓవర్ బౌలింగ్ చేస్తూ హార్దిక్ గాయపడ్డాడు. చీలమండకు తగిలిన గాయం ముందు చిన్నదే అన్నారు. ఒకట్రెండు మ్యాచ్‌ల తర్వాత అందుబాటులోకి వస్తాడన్నారు. కానీ చివరికి మొత్తం టోర్నీకే అందుబాటులో లేకుండా పోయాడు.

ఇప్పుడంతా బాగుంది కానీ..

నిజానికి హార్దిక్ పాండ్య లేని లోటు బంగ్లాతో పోరులో, ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో పెద్దగా కనిపించలేదు. కాకపోతే కూర్పు పరంగా కొన్ని మార్పులు తప్పలేదు. ఒక్క హార్దిక్ దూరమైతే రెండు మార్పులు చేయాల్సి వచ్చింది. అతను బ్యాటింగ్‌లో మిడిలార్డర్లో కీలకం. అలాగే బౌలింగ్‌లోనూ ముఖ్యమే. దాదాపుగా ప్రధాన బౌలర్లతో సమానంగా ఓవర్లు వేశాడు తొలి మూడు మ్యాచ్‌ల్లో. అందుకే శార్దూల్‌ను సైతం తప్పించి షమిని స్పెషలిస్టు బౌలర్‌గా, అలాగే సూర్యకుమార్‌ను స్పెషలిస్టు బ్యాటర్‌గా ఎంచుకున్నారు. ఇది ఒక రకంగా మంచే చేసింది. షమి వచ్చినప్పటి నుంచి ఎలా చెలరేగిపోతున్నాడో తెలిసిందే. హార్దిక్‌ను తప్పించడం వల్ల శార్దూల్ లాంటి సాధారణ బౌలర్ పోయి షమి లాంటి తిరుగులేని బౌలర్ జట్టులోకి వచ్చాడు. సూర్యకుమార్‌ కూడా ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పటిదాకా అయితే హార్దిక్ లేని లోటు కనిపించలేదు. కానీ అతనుంటే ఉండే పెద్ద లాభం ఏంటంటే.. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ పూర్తి స్థాయిలో ఉపయోగపడతాడు. కాబట్టి అదనంగా ఒక బ్యాటర్ లేదా బౌలర్‌ను తీసుకోవచ్చు. హార్దిక్ దూరమైనప్పటి నుంచి భారత్ అయిదుగురు బౌలర్లతోనే బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్‌లన్నింట్లో మన బౌలర్లు అంచనాలను మించి రాణించారు, ప్రత్యర్థి జట్ల నుంచి పెద్దగా ప్రతిఘటన లేకపోయింది కాబట్టి సరిపోయింది. కానీ అవతలి జట్టు ఎదురుదాడి చేసి ప్రధాన బౌలర్లలో ఒకరిద్దరు గాడి తప్పితే.. మ్యాచ్‌లో మరో ప్రత్యామ్నాయం కనిపించదు. 

టోర్నీలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఎంత దూకుడుగా ఆడుతున్నాయో తెలిసిందే. వీటిలో ఒకటి నాకౌట్లో ఎదురై, తమదైన శైలిలో చెలరేగిపోతే ఏంటి పరిస్థితి అన్నది ప్రశ్న. అలా అని ఒక అదనపు బౌలర్‌ను తీసుకుంటే.. బ్యాటింగ్ బలహీన పడుతుంది. అది కూడా ప్రమాదమే. హార్దిక్ స్థానంలో ఎంచుకోవడానికి దేశంలో మరో నాణ్యమైన ఆల్‌రౌండర్ లేకపోవడం ఈ విషయంలో మన బలహీనతను చాటి చెబుతుంది. అలాంటి ఆల్‌రౌండర్ ఉంటే జట్టుకు వచ్చే సమతూకమే వేరు. ప్రపంచకప్‌లో మిగతా పెద్ద జట్లన్నింటికీ ఇద్దరికి తక్కువ కాకుండా పేస్ ఆల్‌రౌండర్లు అందుబాటులో ఉన్నారు. కానీ భారత్ మాత్రం ఎన్నో ఏళ్ల నుంచి హార్దిక్ మీదే ఆధారపడుతోంది. అతను జట్టుకు దూరమైనపుడల్లా సమతూకం దెబ్బ తిని ఇబ్బంది పడుతోంది. ఇలా ఒక ఆటగాడి మీద ఎక్కువ ఆధారపడటం జట్టుకు మంచిది కాదు. అదృష్టం కొద్దీ ప్రస్తుతానికి హార్దిక్ లేని లోటు కనిపించడం లేదు. ప్రపంచకప్‌లో చివరి వరకు ఇదే పరిస్థితి కొనసాగాలి. భారత్ కప్పు గెలవాలి. కానీ ఆ తర్వాత మాత్రం హార్దిక్ లాంటి పేస్ ఆల్‌రౌండర్లను తయారు చేసుకోవడం మీద జట్టు ప్రత్యేకంగా దృష్టిపెట్టాల్సిందే.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు