T20I Record: టీ20ల్లో టీమ్‌ఇండియా ప్రపంచ రికార్డు..

టీ20ల్లో టీమ్‌ఇండియా(Team India) రికార్డు సృష్టించింది. ఈ ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా అవతరించింది.

Updated : 02 Dec 2023 12:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియాపై నాలుగో టీ20(IND vs AUS)లో ఘన విజయం సాధించిన టీమ్‌ఇండియా.. మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్‌(Team India).. టీ20ల్లో చరిత్ర (T20I Record) సృష్టించింది. ఈ ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్టుగా అవతరించింది. దాయాది పాకిస్థాన్‌ రికార్డును బద్దలు కొట్టింది.

టీ20ల్లో భారత్‌కిది 136వ విజయం. 2006 నుంచి ఇప్పటి వరకూ టీమ్‌ఇండియా 136 మ్యాచ్‌ల్లో గెలవగా.. 67 గేమ్‌ల్లో ఓడిపోయింది. ఒకటి టైగా ముగియగా.. మూడింట్లో ఎలాంటి ఫలితం రాలేదు. ఈ ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా విజయాల శాతం 63.84గా ఉంది.

ఇంతకుముందు టీ20 ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు నమోదు చేసిన రికార్డు పాక్‌ పేరిట ఉండేది. మొత్తం 226 మ్యాచ్‌ల్లో 135 విజయాలను ఆ జట్టు నమోదు చేసింది. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ 200 మ్యాచ్‌ల్లో 102 విజయాలు.. ఆస్ట్రేలియా 181 మ్యాచ్‌ల్లో 95 విజయాలు.. దక్షిణాఫ్రికా 171 మ్యాచ్‌ల్లో 95 విజయాలతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

కేఎల్‌ను అధిగమించిన రుతురాజ్‌..

ఇక ఈ మ్యాచ్‌లో 32 పరుగులతో రాణించిన ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 4 వేల పరుగులను పూర్తి చేసుకున్న భారత బ్యాటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో కేఎల్‌ రాహుల్‌ను అధిగమించాడు. రుతురాజ్‌ 116 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా.. కేఎల్‌ 117 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయి చేరుకున్నాడు. ఈ జాబితాలో క్రిస్‌గేల్‌ (107 ఇన్నింగ్స్‌లు), షాన్‌ మార్ష్‌ (113), బాబర్‌ అజామ్‌ (115), కాన్వే (116) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు.

ఇక శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో భారత్‌ 20 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని