SA vs IND : దక్షిణాఫ్రికా పర్యటన.. ఇప్పుడీ సిరీస్‌లతో భారత్‌కు కలిగే ప్రయోజనాలివే..

విదేశీ గడ్డపై తొలిసారి సిరీస్‌లు ఆడేందుకు యువ ఆటగాళ్లు ఉత్సాహంగా ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్‌ఇండియా (SA vs IND) సిద్ధమైంది.  

Updated : 08 Dec 2023 11:55 IST

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా టూర్‌కు భారత్‌ (IND vs SA).. వన్డే ప్రపంచకప్‌ తర్వాత టీమ్‌ఇండియా తలపెట్టిన తొలి విదేశీ పర్యటన.. దాదాపు నెల రోజులపాటు అన్ని ఫార్మాట్లలో సిరీస్‌లు..  క్రికెట్ అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ పక్కా. మరోవైపు టీమ్‌ఇండియాతో పాటు, ఆటగాళ్లకు ఈ పర్యటన ఎంతో కీలకం.. ఎందుకంటే..?

ఆ ఇద్దరూ నిలవాలంటే..

దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులను డిసెంబర్‌ 10 నుంచి జనవరి 7 వరకు భారత్ ఆడనుంది. పొట్టి సిరీస్‌కు సూర్యకుమార్‌, వన్డేలకు కేఎల్ రాహుల్‌,  టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మను కెప్టెన్లుగా మేనేజ్‌మెంట్ నియమించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌ నుంచి రోహిత్‌తోపాటు విరాట్ కోహ్లీ కాస్త విరామం తీసుకున్నారు. వీరిద్దరూ టెస్టు సిరీస్‌ నాటికి జట్టుతో చేరిపోతారు. ఇప్పుడీ పర్యటనలో మిగతా రెండు ఫార్మాట్లతో పోలిస్తే వన్డే సిరీస్‌కు పెద్దగా ప్రాధాన్యం లేదనే చెప్పాలి. ఇప్పటికే వన్డే ప్రపంచకప్‌ ముగిసిన సంగతి తెలిసిందే. అయితే, చాలా రోజుల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్‌, యుజ్వేంద్ర చాహల్‌కు ఇప్పుడు వచ్చిన అవకాశం అత్యంత కీలకం. తుది జట్టులో ఆడే అవకాశం వచ్చినప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. విఫలమైతే జట్టులోకి తిరిగి రావడం మరింత సంక్లిష్టంగా మారడం ఖాయం.

టీ20 ప్రపంచకప్‌ లక్ష్యంగా.. 

వరల్డ్ కప్‌ తర్వాత భారత్ టీ20 సిరీస్‌లో ఆసీస్‌ను ఓడించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ కెప్టెన్సీలో టీమ్‌ఇండియా అద్భుత ఫలితం సాధించింది. ఆ జట్టులో ఒకరిద్దరు మినహా అందరూ యువకులే. ఇప్పుడు మరోసారి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. అయితే జడేజా, సిరాజ్‌ వంటి మరో ఇద్దరు సీనియర్లు జట్టుతో కలిశారు. ఈ సిరీస్‌కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్‌ జరగనుంది. కాబట్టి, ఈ సిరీస్‌లో ఉత్తమ ప్రదర్శన చేస్తే ఆటోమేటిక్‌గా వరల్డ్‌ కప్‌ కోసం పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉంది. ఆసీస్‌తో సిరీస్‌లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌, జితేశ్‌ శర్మ తమకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. మరోవైపు రోహిత్‌ కెప్టెన్సీలోనే టీమ్‌ఇండియా పొట్టి ప్రపంచకప్‌ ఆడే అవకాశాలు ఉన్నాయి.  దీంతో ఇప్పుడసలు సమస్య రోహిత్‌కు జోడీగా ఎవరు ఉంటారు? వన్డే ప్రపంచ కప్‌లో గిల్ ఆడినా పెద్దగా ఆకట్టుకోలేదు. 20 ఓవర్ల క్రికెట్‌లో ఆరంభం అద్భుతంగా ఉంటే ఆ తర్వాత వచ్చే ఆటగాళ్లపై పెద్దగా ఒత్తిడి ఉండదు. యశస్వి జైస్వాల్ ఆసీస్‌పై దూకుడైన ప్రదర్శన క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. లోయర్‌ ఆర్డర్‌లో రింకు సింగ్‌ విలువైన పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికాలోనూ రాణిస్తే ‘ఫినిషర్‌’ పోస్టు అతడికే సొంతమవుతుంది. బౌలర్లు దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ భారీగా పరుగులు ఇస్తున్నా వికెట్లు పడగొట్టారు. వచ్చే ఏడాది జూన్‌లోగా టీమ్ఇండియా ఆరు టీ20లను మాత్రమే ఆడనుంది. దీంతో ప్రతి మ్యాచ్‌లో ఆటగాళ్లు రాణిస్తేనే వరల్డ్‌ కప్‌ ‘స్క్వాడ్‌’ రేసులో ఉంటారు.

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే?

వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా విజేతగా మాత్రం నిలవలేకపోయింది. ఈసారైనా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరి ఛాంపియన్‌గా మారాలనే లక్ష్యంతో ఆడుతోంది. ఈ ఏడాది జూన్‌లో మొదలైన మూడో డబ్ల్యూటీసీ సీజన్‌లో భారత్ రెండు టెస్టుల్లో తలపడింది. విండీస్‌పై వారి స్వదేశంలోనే సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇందులో ఒక మ్యాచ్‌ను టీమ్‌ఇండియా గెలుచుకోగా.. మరొకటి డ్రాగా ముగిసింది. దీంతో పాయింట్ల పట్టికలో భారత్ (66.67 శాతం) మూడో స్థానంలో కొనసాగుతోంది. 2025 మార్చి నాటికి టాప్‌-2లో ఉన్న జట్లే ఫైనల్‌లో టెస్టు ‘గద’ కోసం తలపడతాయి. భారత్ ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు చేరుకోవాలంటే ప్రతి టెస్టులోనూ విజయం సాధించాలి. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌ భారత్‌కు కీలకంగా మారనుంది. వారి సొంతగడ్డపై సఫారీ జట్టును తట్టుకోవడం కఠిన సవాలే అయినప్పటికీ ఇటీవల ఫామ్‌ను బట్టి చూస్తే భారత్‌ పరిస్థితి మెరుగ్గానే ఉంది. అయితే, ఎలా ఆడుతుందనేదే ఇక్కడ ఆసక్తికరం.

చివరిగా.. ఒకే పర్యటనలో ముగ్గురు సారథులతో బరిలోకి దిగుతున్న టీమ్‌ఇండియాకు ఇలాంటి ప్రయోగం కొత్త. గతంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు, టెస్టు ఫార్మాట్‌కు వేర్వేరు జట్లతోపాటు కెప్టెన్లను బీసీసీఐ నియమించింది. ఇప్పుడు ఈ ‘ముగ్గురు సారథుల’ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులోనూ కొనసాగించే అవకాశం లేకపోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని