IND vs AFG: టీమ్‌ఇండియా బీ కేర్‌ఫుల్‌.. అఫ్గాన్లతో అంత ఈజీ కాదు

భారత్, అఫ్గానిస్థాన్‌ (IND vs AFG) మధ్య జనవరి 11 నుంచి మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభంకానుంది.

Published : 11 Jan 2024 02:17 IST

అంతర్జాతీయ టీ20ల్లో అఫ్గానిస్థాన్‌ (Afghanistan)పై భారత్‌ది అజేయ రికార్డు. ఇప్పటివరకూ ఆ జట్టు చేతిలో ఓడిందే లేదు. ఆ జట్టుతో అయిదు మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా (Team India) నాలుగింట్లో గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇప్పుడు మరోసారి అఫ్గాన్‌తో సిరీస్‌కు భారత జట్టు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ గురువారం జరుగనుంది. కానీ ఈ సారి అఫ్గాన్లతో అంత ఈజీ కాదు. ఇటీవల వన్డే ప్రపంచకప్‌లో ఆ జట్టు సంచలన ప్రదర్శన చేసింది. పొట్టి ఫార్మాట్లో ఆ జట్టు మరింత ప్రమాదకరంగా కనిపిస్తోంది. టీమ్‌ఇండియా అతి విశ్వాసానికి పోకుండా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. 

ఆ విజయాలతో..

ప్రపంచ క్రికెట్లో అఫ్గానిస్థాన్‌ అంటే పసికూన అని పిలిచేవాళ్లు. కానీ నిరుడు వన్డే ప్రపంచకప్‌లో ఆ జట్టు ప్రదర్శన చూసిన తర్వాత ఆ అభిప్రాయం మారిపోయింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్, మాజీ ఛాంపియన్లు పాకిస్థాన్, శ్రీలంకపై ఆ జట్టు విజయాలు నమోదు చేసింది. అవి కూడా గాలివాటం గెలుపులేం కాదు. సాధికారికంగా ఆడి, పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి అందుకున్న విజయాలు. ఇక ఆస్ట్రేలియాను భయపెట్టిన ఆ జట్టు సెమీస్‌ చేరేలా కనిపించింది. కానీ మ్యాక్స్‌వెల్‌ వీరోచిత ద్విశతకంతో ఆ జట్టు ఆశలు కూలాయి. సెమీస్‌ చేరకపోయినా ఆ జట్టు ప్రదర్శన ఆకట్టుకుంది. వన్డేల్లోనే ఇలా రాణించిన జట్టు ఇక టీ20ల్లో మరింత చెలరేగే అవకాశముంది. పొట్టి ఫార్మాట్లో అఫ్గాన్‌ను తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదు. ఒక్క ఓవర్లో ఫలితం తారుమారయ్యే ఈ ఫార్మాట్లో ఆ జట్టు ప్రమాదకారే. నాణ్యమైన స్పిన్నర్లు, మంచి పేసర్లు, ఉత్తమ బ్యాటర్లు, పవర్‌ హిట్టర్లతో నిండి ఉన్న ఆ జట్టు భయమన్నదే లేకుండా తెగించే ఆడే ఆస్కారముంది. ఇటీవల యూఏఈతో టీ20 సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకున్న అఫ్గాన్‌ జోరుమీదుంది. అంతకుముందు ఆసియా క్రీడల్లో ఆ దేశ యువ జట్టు శ్రీలంక, పాకిస్థాన్‌ లాంటి జట్లను ఓడించి వెండి పతకాన్ని దక్కించుకుంది.

రషీద్‌ లేకపోవడం దెబ్బే..

ఈ ఏడాది జూన్‌ 1న టీ20 ప్రపంచకప్‌ ఆరంభమవుతున్న నేపథ్యంలో భారత్‌తో పొట్టి సిరీస్‌ను అఫ్గాన్‌ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తొలిసారి భారత్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ ఆడుతున్న ఆ జట్టు ఒక్క మ్యాచ్‌ గెలిచినా అఫ్గాన్‌ ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం అమాంతం పెరుగుతుందనడంలో సందేహం లేదు. పొట్టి ప్రపంచకప్‌కు ముందు అఫ్గాన్‌ ఇంకా శ్రీలంక, ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది. కానీ టీమ్‌ఇండియాతో సిరీస్‌కు ఉన్న విలువ ఆ జట్టుకు తెలియంది కాదు. అందుకే ఈ సిరీస్‌లో గెలుపు కోసం శాయశక్తులా కష్టపడేందుకు సిద్ధమైంది. కెప్టెన్‌ ఇబ్రహీం జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, అలిఖిల్, రహ్మనుల్లా గుర్బాజ్, ఆల్‌రౌండర్లు అజ్మతుల్లా ఒమర్‌జాయ్, గుల్బాదిన్‌ నయీబ్, మహమ్మద్‌ నబి, రహ్మత్‌ షా, పేసర్లు ఫరూఖీ, నవీనుల్‌ హక్, స్పిన్నర్లు ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్, నూర్‌ అహ్మద్‌తో ఆ జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. కానీ ప్రపంచ క్రికెట్లో అఫ్గాన్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన రషీద్‌ ఖాన్‌ దూరమవడం ఆ జట్టుకు దెబ్బే. నిరుడు అన్ని టీ20లు కలిపి చూస్తే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ (65 వికెట్లు) రెండో ప్లేసులో ఉన్నాడు. 66 వికెట్లతో ఎలిస్‌ (ఆస్ట్రేలియా) ఫస్ట్‌ ప్లేసులో ఉన్నాడు. వెన్నెముక గాయం, శస్త్రచికిత్స కారణంగా నిరుడు జులై నుంచి అతను టీ20ల్లో ఆడలేదు. ఇప్పుడు భారత్‌తో సిరీస్‌కు అతణ్ని ఎంపిక చేశారు. కానీ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో దూరమయ్యాడు. రషీద్‌ లేకపోయినా యువ స్పిన్నర్లు నూర్‌ అహ్మద్, ముజీబ్‌తో పాటు సీనియర్‌ స్పిన్నర్‌ నబితో భారత్‌కు సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో ఒక్క మ్యాచ్‌లో ఓడినా.. ప్రపంచకప్‌కు ముందు అది టీమ్‌ఇండియా ఆటగాళ్లను మానసికంగానూ దెబ్బతీసే ప్రమాదముంది. అందుకే భారత్‌.. బీ కేర్‌ఫుల్‌. 

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని