IND vs AUS: విజయం కోసం ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు

ఆసీస్‌తో చివరి టీ20 మ్యాచ్‌లో భారత్‌దే (IND vs AUS) తొలుత బ్యాటింగ్‌. బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్‌ జరుగుతోంది.

Updated : 03 Dec 2023 21:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్ నిర్దేశించిన 161 పరుగుల లక్ష్య ఛేదనలో ఆస్ట్రేలియా పోరాడుతోంది. టీమ్ఇండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ ఆసీస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం 10 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా మూడు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. క్రీజ్‌లో టిమ్‌ డేవిడ్ (6*), బెన్‌ డార్మెట్ (25) ఉన్నారు. అంతకుముందు ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్ (28) దూకుడుగా ఆడాడు. మరో ఓపెనర్ ఫిలిప్  (4), ఆరోన్ హార్డీ (6) విఫలమయ్యారు. భారత బౌలర్లు రవి బిష్ణోయ్ 2, ముకేశ్‌ కుమార్‌ ఒక వికెట్‌ తీశారు. చివరి పది ఓవర్లలో ఆసీస్‌కు 91 పరుగులు అవసరం.


ఆసీస్‌ లక్ష్యం 161 పరుగులు

ఆరంభంలో బ్యాటింగ్‌కు ఇబ్బంది పడినప్పటికీ భారత బ్యాటర్లు పుంజుకున్నారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి టీమ్‌ఇండియా 160 పరుగులు చేసింది. మిడిలార్డర్‌లో శ్రేయస్‌ అయ్యర్ (53) అర్ధశతకం సాధించాడు. అతడితోపాటు జితేశ్ శర్మ (24), అక్షర్ పటేల్ (31) విలువైన పరుగులు చేశారు. ఆసీస్‌ ఎదుట 161 పరుగులను లక్ష్యంగా నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించారు. అంతకుముందు యశస్వి జైస్వాల్ (21) ఫర్వాలేదనిపించగా.. రుతురాజ్‌ గైక్వాడ్ (10), సూర్యకుమార్‌ యాదవ్ (5), రింకు సింగ్‌ విఫలమయ్యారు. ఆసీస్‌ బౌలర్లు బెహ్రెన్‌డార్ఫ్‌ 2, డ్వారిషుస్ 2.. హార్డీ, నాథన్ ఎల్లిస్‌, తన్వీర్‌ సంఘా తలో వికెట్ తీశారు.


పది ఓవర్లకు 61/4

ఐదో టీ20లో భారత బ్యాటర్లు తడబాటుకు గురయ్యారు. పది ఓవర్లు ముగిసేసరికి టీమ్‌ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి 61 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా వేయడంలో పరుగుల రాక కష్టంగా మారింది. దూకుడగా ఆడే క్రమంలో యశస్వి జైస్వాల్ (21: 15 బంతుల్లో), రుతురాజ్‌ గైక్వాడ్ (10) వరుస ఓవర్లలో పెవిలియన్‌కు చేరారు. అనంతరం వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్ (5) నిరాశపరిచాడు.  రింకు సింగ్‌ (6) కూడా దూకుడుగా ఆడలేకపోయాడు. ప్రస్తుతం క్రీజ్‌లో శ్రేయస్‌ అయ్యర్ (11*), జితేశ్ శర్మ (5*) ఉన్నారు. 


టాస్ నెగ్గిన ఆసీస్‌

భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్‌ బెంగళూరు వేదికగా జరగనుంది. టాస్‌ నెగ్గిన ఆసీస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో భారత్‌ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇప్పటికే సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ఇండియా విజయంతో ముగించాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు సిరీస్‌లో చివరి మ్యాచ్‌ను గెలిచి స్వదేశానికి బయల్దేరాలని ఆసీస్ భావిస్తోంది. ఈ క్రమంలో భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. చాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చి నాలుగో టీ20లో ఆడిన దీపక్‌ చాహర్‌కు మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది. అతడి స్థానంలో అర్ష్‌దీప్‌ను తుది జట్టులోకి తీసుకుంది. అత్యవసర వైద్యపరమైన కారణాలతో అతడు ఇంటికి వెళ్లినట్లు కెప్టెన్ సూర్యకుమార్‌ తెలిపాడు. 

జట్లు ఇవే..

భారత్: యశస్వి జైస్వాల్, రుతురాజ్‌ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్‌ యాదవ్ (కెప్టెన్), రింకు సింగ్‌, జితేశ్ శర్మ (వికెట్‌ కీపర్‌), అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్‌, అవేశ్‌ ఖాన్‌, ముకేశ్‌ కుమార్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌

ఆసీస్‌: ట్రావిస్‌ హెడ్, జోష్‌ ఫిలిప్‌, బెన్ డార్మెట్, ఆరోన్‌ హార్డీ, టిమ్‌ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్‌ (కెప్టెన్/వికెట్ కీపర్‌), నాథన్‌ ఎల్లిస్‌, డ్వారిషుస్‌, జాసన్‌ బెహ్రెన్‌డార్ఫ్‌, తన్వీర్‌ సంఘా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని