Shubman Gill: టెస్టుల్లో తొలి శతకం బాదిన గిల్.. ఇదే జోరు కొనసాగిస్తే కేఎల్‌కు ఎసరు!

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ (110) సెంచరీ బాదాడు. దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న గిల్‌కిదే తొలి టెస్టు సెంచరీ కావడం విశేషం. 

Updated : 29 Jun 2023 18:28 IST

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు రెండేళ్ల తర్వాత టెస్టు జట్టులో స్థానం సంపాదించుకున్న శుబ్‌మన్‌ గిల్ (Shubman Gill) వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులకే వెనుదిరిగినా .. రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలగా ఆడి శతకం పూర్తి చేసుకున్నాడు. 147 బంతుల్లోనే అతడు మూడంకెల స్కోరును అందుకున్నాడు. టెస్టుల్లో అతడికిదే తొలి శతకం కావడం విశేషం. ఈ సంవత్సరం టెస్టుల్లో సెంచరీ బాదిన తొలి భారత ఓపెనర్‌గా నిలిచాడు. మొత్తం 152 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 3 సిక్స్‌ల సాయంతో 110 పరుగులు చేశాడు. మెహదీ వేసిన  50వ ఓవర్‌లో తొలి బంతికి సిక్సర్‌ బాదిన గిల్.. అదే ఓవర్‌లో మూడో బంతికి హసన్‌ జాయ్‌ (సబ్‌స్టిట్యూట్‌)కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో గిల్ ఇన్నింగ్స్‌కి తెరపడింది. 

శుబ్‌మన్‌ గిల్ 2020 డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు.  ఆ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో (45), రెండో ఇన్నింగ్స్‌లో (35) పరుగులు చేశాడు. ఇప్పటివరకు 12 వన్డేలు ఆడి 709 పరుగులు చేయగా.. 15 వన్డేల్లో 687 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లోకి గిల్ ఇంకా అరంగేట్రం చేయలేదు. ఈ 23 ఏళ్ల ఆటగాడు ఇదే ఫామ్‌ని కొనసాగిస్తే టెస్టుల్లో రోహిత్‌ శర్మకి జోడీగా కేఎల్ రాహుల్‌ (KL Rahul)కి బదులు గిల్‌ని తీసుకునే అవకాశాలున్నాయి. ఎందుకంటే గత కొన్నాళ్లుగా మరో ఓపెనర్‌ కేఎల్ రాహుల్‌ విఫలమవుతున్నాడు.  ఈ మ్యాచ్‌లో కూడా తొలి ఇన్నింగ్స్‌లో (22), రెండో ఇన్నింగ్స్‌లో (23) పరుగులే చేసి నిరాశపర్చాడు. తర్వాతి మ్యాచ్‌ల్లో కూడా కేఎల్ విఫలమైతే అతడి ఓపెనింగ్‌ స్థానం ప్రమాదంలో పడే అవకాశం ఉంది.  

ఇక, బంగ్లాదేశ్‌తో టెస్టు మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 404 పరుగులకు ఆలౌట్‌ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసింది. దీంతో బంగ్లాదేశ్‌కు భారత్‌ 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 150 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని