IND vs PAK : భారత్‌ X పాకిస్థాన్‌ పోరు.. 10 పాయింట్లలో వివరాలు!

మరోసారి దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్‌లో దుబాయ్‌ వేదికగా భారత్, పాకిస్థాన్‌ జట్ల మధ్య మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. కొంతకాలంగా ఇరు జట్లు...

Updated : 28 Aug 2022 19:18 IST

ఇంటర్నెట్ డెస్క్‌:  ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌ వేదికగా భారత్, పాకిస్థాన్‌ జట్లు ఢీకొంటున్నాయి. కొంతకాలంగా ఇరు జట్లు ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడకపోవడం  కూడా ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తిని పెంచింది. రోహిత్ శర్మ సారథ్యంలో తొలిసారి టీమ్‌ఇండియా ఐసీసీ టోర్నమెంట్‌లో పాల్గొనబోతుండటం విశేషం. ఈ క్రమంలో భారత్-పాక్‌ మ్యాచ్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు..

  1. గత టీ20 ప్రపంచకప్‌ తర్వాత భారత్, పాకిస్థాన్‌ జట్లు తలపడుతున్న తొలి మ్యాచ్‌ ఇదే. అప్పటి ఓటమికి ప్రతీకారం తీర్చుకొని మరోసారి పాక్‌పై ఆధిపత్యం ప్రదర్శించాలని టీమ్‌ఇండియా కసిగా ఉంది. ఆసియా కప్‌లో భారత్‌దే హవా. అత్యధికంగా ఏడుసార్లు ఆసియా కప్‌ను గెలుచుకుంది. గత ఛాంపియన్‌ కూడా టీమ్‌ఇండియానే.
  2. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన చివరి మూడు మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. 2016లో ఒకసారి, 2018లో రెండు సార్లు పాకిస్థాన్‌ను భారత్‌ ఓడించింది. అయితే 2014లో మాత్రం టీమ్‌ఇండియాపై పాక్‌ విజయం సాధించింది.
  3. ప్రస్తుతం జరిగే ఆసియాకప్‌ టోర్నీలో మూడుసార్లు భారత్‌-పాక్‌ తలపడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇరు జట్లూ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. కాబట్టి గ్రూప్‌ దశలో ఒకసారి (ఇవాళ్టి మ్యాచ్‌) తలపడటం ఖాయం. మూడు జట్లలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-4కి అర్హత సాధిస్తాయి. అప్పుడు మరొకసారి దాయాదుల పోరు చూడొచ్చు. ఇక ఫైనల్‌కు చేరుకుంటే భారత్‌-పాక్‌ల మ్యాచ్‌ను ముచ్చటగా మూడోసారి వీక్షించే భాగ్యం అభిమానులకు దక్కుతుంది.
  4. టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ (3,487) మరో పది పరుగులు చేస్తే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం కివీస్‌ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ (3,497) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ ఫామ్‌ను చూస్తే పది పరుగులు చేయడం అసలు సమస్యేకాదు. అలాగే ఇదే మ్యాచ్‌లో రోహిత్ శర్మ (367) మరో 66 పరుగులు చేస్తే భారత్‌-పాక్‌ మ్యాచుల్లో ఎక్కువ పరుగులు చేసిన బ్యాటర్‌గా మారతాడు. పాక్‌ బ్యాటర్ షోయబ్‌ మాలిక్‌ (432) ముందున్నాడు.
  5. ఫామ్ కోల్పోయి విమర్శలపాలవుతున్న భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ తుది జట్టులో ఉంటే వందో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ అవుతుంది. ఆసియా కప్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన స్కోరర్‌ కోహ్లీనే. 2012లో (వన్డే ఫార్మాట్‌) పాక్‌పై 183 పరుగులు చేశాడు.
  6. 2016లో (టీ20 ఫార్మాట్‌) భారత్‌పై పాకిస్థాన్ కేవలం 83 పరుగులకే ఆలౌట్ అయింది. ఆసియా కప్‌లో టీమ్‌ఇండియాపై పాక్‌కు ఇదే అత్యల్ప స్కోరు. వన్డే ఫార్మాట్‌లో భారత్‌పై పాక్‌ 329/6 అత్యధిక స్కోరు సాధించగా.. టీమ్‌ఇండియా 330/4 చేసి విజయం సాధించింది. భారత్-పాక్‌ ఆసియా కప్‌ మ్యాచుల్లో సయీద్‌ అజ్మల్ (8), అనిల్ కుంబ్లే (7), అబ్దుల్ రజాక్‌ (6) వికెట్లు తీశారు.
  7. భారత్, పాక్‌ జట్లను గాయాలు వీడలేదు. గాయం కారణంగా టీమ్‌ఇండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాను కోల్పోగా.. పాకిస్థాన్‌ తన పేస్‌ సంచలనం షహీన్‌ షా అఫ్రిదిని మిస్‌ చేసుకుంది. ముఖ్యమైన టోర్నీలో ప్రధాన పేసర్లు లేకుండా ఇరు జట్లు బరిలోకి దిగడం బహుశా ఇదే తొలిసారేమో.  
  8. పాకిస్థాన్‌తో ఆడిన గత 5 మ్యాచుల్లో భారత్‌ నాలుగుసార్లు నెగ్గింది. ఒక మ్యాచ్‌ పాకిస్థాన్‌ సొంతమైంది. ఆసియా కప్‌లో భారత్‌, పాక్‌ 14సార్లు తలపడగా.. 8 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియా నెగ్గితే, పాకిస్థాన్‌ ఆరుసార్లు గెలిచింది. ఒక్కసారి కూడా భారత్, పాకిస్థాన్‌ ఆసియా కప్‌ ఫైనల్‌లో తలపడకపోవడం గమనార్హం. 
  9. ఇవాళ మ్యాచ్‌ జరిగే దుబాయ్‌ వేదికపైనే గత టీ20 ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్‌పై పాక్‌ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమ్‌ఇండియాలో విరాట్ కోహ్లీ (57) మినహా టాప్‌ ఆర్డర్‌ విఫలమైంది.
  10. 2008 వరకు భారత్, పాక్‌ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరిగేవి. ఆ తర్వాత పరిస్థితులు అనుకూలించకపోవడంతో వాటిని నిలిపివేశారు. ఇప్పటివరకు 132 వన్డేల్లో భారత్ 55, పాక్‌ 73 మ్యాచుల్లో విజయం సాధించాయి. ఇక 9 టీ20ల్లో  టీమ్‌ఇండియా ఆరు విజయాలు, పాక్‌ కేవలం రెండు విజయాలు మాత్రమే సాధించింది. మరొక మ్యాచ్‌ ఫలితం తేలలేదు. చివరిసారిగా గత టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ ఓటమిపాలైంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని