IND vs PAK: ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌దే ఆధిపత్యం.. ఎప్పుడెప్పుడు..? కీలక పాత్ర ఎవరిదంటే?

ఐసీసీ మెగా టోర్నీల్లో (వరల్డ్‌ కప్‌లు) పాకిస్థాన్‌పై భారత్‌ ఆధిపత్యమే (IND vs PAK) కొనసాగుతోంది. ఒక్కసారి కూడా పాక్‌ గెలవలేకపోయిది. మరోసారి భారత్‌ వేదికగా జరగుతున్న ప్రపంచకప్‌లో దాయాదుల పోరును వీక్షించే అవకాశం వచ్చింది.

Published : 13 Oct 2023 10:21 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) అసలుసిసలు సమరానికి సమయం ఆసన్నమైంది. క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్‌ - పాకిస్థాన్‌ (IND vs PAK) మ్యాచ్‌ అక్టోబర్ 14న అహ్మదాబాద్‌ వేదికగా జరగనుంది. వన్డే ప్రపంచకప్‌లో (ODI WC) భారత్, పాక్ ఇప్పటివరకు ఏడుసార్లు (1992, 1996, 1999, 2003, 2011, 2015, 2019) తలపడ్డాయి. ఈ ఏడుసార్లూ దాయాదిపై భారత్‌ తిరుగులేని ఆధిపత్యం చలాయించి జయకేతనం ఎగరేసింది. మరి ఈ మ్యాచ్‌లు ఎలా సాగాయి, ఏ ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన కనబర్చారో తెలుసుకుందాం.

సిడ్నీలో చిందేసిన టీమ్‌ఇండియా

వన్డే ప్రపంచకప్‌లో భారత్, పాక్‌ మొదటిసారిగా 1992లో తలపడ్డాయి. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత భారత్ నిర్ణీత 49 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఓపెనర్‌ అజయ్‌ జడేజా (46) రాణించగా.. మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన సచిన్‌ తెందూల్కర్ (54*)  అర్ధ శతకం బాదాడు. కపిల్‌దేవ్‌ (35) పరుగులు చేశాడు. ఈ లక్ష్యఛేదనలో పాక్‌ 173 పరుగులకు ఆలౌటైంది. అమీర్ సోహెల్ (62), జావెద్‌ మియాందాద్‌ (40) తప్ప మిగతా ఆటగాళ్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. కపిల్‌ దేవ్, మనోజ్ ప్రభాకర్, జవగళ్ శ్రీనాథ్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా.. సచిన్, వెంకటపతిరాజు ఒక్కో వికెట్ తీశారు. 

బెంగళూరులో బెంబేలెత్తించారు.. 

1996 ప్రపంచకప్‌లో భారత్, పాక్‌ మధ్య రెండో క్వార్టర్‌ ఫైనల్‌ జరిగింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో  టీమ్‌ఇండియా బ్యాటర్‌ నవ్‌జ్యోత్‌ సింగ్ సిద్ధు (93; 115 బంతుల్లో 11 ఫోర్లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. అజయ్‌ జడేజా (45; 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. ఈ లక్ష్యఛేదనలో వెంకటేశ్‌ ప్రసాద్ (3/45), అనిల్ కుంబ్లే (3/48) ధాటికి పాక్‌ 9 వికెట్లు కోల్పోయి 248 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమ్‌ఇండియా 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

ప్రసాద్‌ ‘పాంచ్‌’ పటాకా.. మాంచెస్టర్‌లో హ్యాట్రిక్‌

1999 ప్రపంచకప్‌లో భారత్, పాక్‌ మధ్య మూడో మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 47 పరుగుల తేడాతో గెలుపొంది హ్యాట్రిక్‌ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సచిన్ (45), రాహుల్ ద్రవిడ్ (61), అజారుద్దీన్‌ (59) రాణించడతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. భారత ఫాస్ట్‌బౌలర్‌ వెంకటేశ్ ప్రసాద్‌ (5/27) పాక్ బ్యాటర్లను దడదడలాడించడంతో దాయాది జట్టు 180 పరుగులకు ఆలౌటైంది. శ్రీనాథ్ (3/37), అనిల్ కుంబ్లే (2/43) కూడా రాణించారు. 

సచిన్‌ సెంచరీ మిస్.. అయినా విన్‌

2003 ప్రపంచకప్‌లో భారత్‌, పాక్‌ మరోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. సయీద్ అన్వర్ (101) సెంచరీ బాదాడు. మిగతా బ్యాటర్లు పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు. అనంతరం 274  పరుగుల లక్ష్యాన్ని భారత్‌.. మరో 26 బంతులు మిగిలుండగానే పూర్తి చేసేసి విజయం సాధించింది. సచిన్ తెందూల్కర్ (98; 75 బంతుల్లో; 12 ఫోర్లు, ఒక సిక్స్‌) త్రుటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. యువరాజ్‌ సింగ్ (50; 53 బంతుల్లో) హాఫ్‌ సెంచరీ చేశాడు. రాహుల్ ద్రవిడ్ (44), మహ్మద్ కైఫ్‌ (35) పరుగులు చేశారు.

పాక్‌ను ఓడించి ఫైనల్‌కు 

2007 ప్రపంచకప్‌లో భారత్ గ్రూప్‌ దశలో నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఆ సీజన్‌లో దాయాదుల మధ్య పోరు జరగలేదు. మళ్లీ 2011లో భారత్, పాక్‌ తలపడ్డాయి. మొహాలీ వేదికగా జరిగిన సెమీస్‌లో పాక్‌ను ఓడించి భారత్‌కు ఫైనల్‌కు దూసుకెళ్లింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాక్.. 49.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. మిస్బా ఉల్‌ హక్‌ (56) టాప్ స్కోరర్‌. మహ్మద్‌ హఫీజ్ (43) పరుగులు చేశాడు. భారత బౌలర్లలో జహీర్‌ఖాన్‌, ఆశిశ్‌ నెహ్రా, మునాఫ్‌ పటేల్, హర్భజన్‌ సింగ్, యువరాజ్‌ సింగ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో భారత్ విజయం సాధించి రెండోసారి విశ్వవిజేతగా నిలిచింది.

అడిలైడ్‌లో అదరగొట్టారు..

ప్రపంచకప్‌లో భారత్, పాక్ మధ్య ఆరో మ్యాచ్‌ 2015లో జరిగింది. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 76 పరుగుల తేడాతో విజయం సాధించి అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (107; 126 బంతుల్లో 8 ఫోర్లు) శతకం బాదాడు. శిఖర్ ధావన్ (73; 76 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌), సురేశ్ రైనా (74; 56 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఈ భారీ లక్ష్యఛేదనలో పాక్ 47 ఓవర్లలో 224 పరుగులకు కుప్పకూలింది. షమి (4/35) పాక్‌ పతనాన్ని శాసించాడు. మోహిత్ శర్మ, ఉమేశ్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. అశ్విన్, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.

దంచికొట్టిన రోహిత్‌

2019 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (140; 113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) భారీ శతకం బాదాడు. కోహ్లీ (77; 65 బంతుల్లో 7 ఫోర్లు) రాణించాడు. దీంతో భారత్ 336/5 భారీ స్కోరు సాధించింది. ఈ లక్ష్యఛేదనలో పాక్‌ 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంతరం వర్షం అంతరాయం కలిగించడంతో ఆట సాధ్యం కాలేదు. దీంతో డక్‌వర్త్ లూయిస్‌ ప్రకారం భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని