IND vs PAK: ఇస్తారా.. ఇంకో పంచ్!
నేడు పాక్‌తో భారత్ సూపర్-4 పోరు
రాత్రి 8 నుంచి
దుబాయ్

ఆసియా కప్ గ్రూప్ దశ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది టీమ్‌ఇండియా. కానీ ఈ విషయం పక్కకు వెళ్లిపోయి కరచాలన వివాదమే వార్తల్లో నిలిచింది. తాము చిత్తుగా ఓడిన విషయం మరుగున పడిపోయేలా.. గొడవను పెద్దది చేయడానికి గట్టి ప్రయత్నమే చేసింది పాక్. ఈ వివాదానికి బాధ్యుడిగా పేర్కొంటూ మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌ను తప్పించాలని డిమాండ్ చేసి, అక్కడా పంతం నెగ్గించుకోలేకపోయిన పాక్.. ఇప్పుడు భారత్‌తో ఇంకో పోరుకు సిద్ధమైంది. పాక్ ఎంత రభస చేస్తున్నా అదేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోయిన టీమ్‌ఇండియా.. మరోసారి దాయాదిని మట్టికరిపించే లక్ష్యంతో సూపర్-4 మ్యాచ్‌లో అడుగుపెట్టబోతోంది.
వారం రోజుల్లో మళ్లీ చిరకాల ప్రత్యర్థుల పోరును చూడబోతున్నాం. గ్రూప్ దశ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో ఆధిపత్యం చలాయిస్తూ పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. ఆదివారం సూపర్-4లో భాగంగా ఆ జట్టును ఢీకొనబోతోంది. మరోసారి టీమ్‌ఇండియానే ఈ మ్యాచ్‌లో ఫేవరెట్. అయితే గ్రూప్ మ్యాచ్ ఓటమి, కరచాలన వివాదం నేపథ్యంలో పుంజుకోవడానికి పాక్ గట్టిగా ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. మరి ఈసారి ఆ జట్టు ఫలితాన్ని మార్చగలుగుతుందేమో చూడాలి.

వాళ్లిద్దరూ మళ్లీ..: ఒమన్‌తో చివరి లీగ్ మ్యాచ్‌లో తడబాటు కొంత భారత జట్టును కలవర పెట్టేదే. ఆ మ్యాచ్ సాగిన తీరు పాక్‌లోనూ కొంత ఆశలు రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. ఒమన్‌పై బ్యాటింగ్ రికార్డులు బద్దలు కొడుతుందనుకున్న జట్టు.. 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులే చేయగలిగింది. 2 ఓవర్లకు వికెట్ నష్టానికి 6 పరుగులు చేయడం భారత్ స్థాయికి తగని ప్రదర్శనే.
ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ బ్యాటింగ్ చేయకపోయినా సరే.. మిగతా బ్యాటర్ల ఆటతీరు సంతృప్తికరంగా సాగలేదు. టీ20 జట్టులోకి పునరాగమనం చేశాక శుభ్‌మన్ ఇంకా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. అభిషేక్ శర్మ మాత్రం బ్యాట్ ఝళిపిస్తున్నాడు. ఒమన్‌పై సంజు అర్ధశతకం సాధించాడు. హార్దిక్ కూడా బ్యాటుతో ప్రభావం చూపలేకపోయాడు. తిలక్ వర్మ, శివమ్ దూబె మిడిలార్డర్లో పర్వాలేదనిపిస్తున్నారు. మరి మెరుగైన బౌలింగ్ దళంతో బరిలోకి దిగుతున్న పాక్‌కు భారత బ్యాటింగ్ విభాగం ఎలా సమాధానమిస్తుందో చూడాలి. ఒమన్‌తో మ్యాచ్‌కు విశ్రాంతి తీసుకున్న పేసర్ బుమ్రా, స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‌లో ఆడనున్నారు. వారి కోసం హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ తప్పుకోక తప్పదు. బుమ్రా, వరుణ్ పునరాగమనంతో భారత బౌలింగ్ మెరుగుపడుతుందనే భావిస్తున్నారు. పాక్‌పై 3 వికెట్లతో విజృంభించిన కుల్‌దీప్.. మరోసారి ఆ జట్టును దెబ్బ కొడతాడని జట్టు ఆశిస్తోంది. అతడికి తోడు వరుణ్, అక్షర్‌ల స్పిన్ త్రయాన్ని ఎదుర్కోవడం పాక్‌కు సవాలే. ఆరంభ ఓవర్లలో బుమ్రాను ఎదుర్కోవడమూ తేలిక కాదు.
బౌలర్ల మీదే ఆశలు: పాక్ ఎప్పట్లాగే బౌలింగే బలంగా బరిలోకి దిగుతోంది. పేసర్ షహీన్ అఫ్రిది, స్పిన్నర్లు అబ్రార్ అహ్మద్, సైమ్ అయూబ్‌లపై ఆ జట్టు ఎక్కువ ఆశలు పెట్టుకుంది. అయూబ్ భారత్‌తో మ్యాచ్‌లో 3 వికెట్లు తీశాడు. బలమైన టీమ్‌ఇండియా బ్యాటింగ్ లైనప్‌కు బౌలర్లు కళ్లెం వేయగలిగితేనే పాక్‌కు మ్యాచ్‌పై ఆశలు ఉంటాయి. యూఏఈ లాంటి చిన్న జట్టు మీదా పాక్ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. జమాన్ నిలబడడం, ఆఖర్లో షహీన్ మెరుపులు మెరిపించడంతో ఆ జట్టు గట్టెక్కింది. అయూబ్ బౌలింగ్‌లో రాణిస్తున్నప్పటికీ తన బ్యాటింగ్ వైఫల్యం మాత్రం జట్టును ఇబ్బంది పెడుతోంది. కెప్టెన్ సల్మాన్ అఘా నుంచి పాక్ పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తోంది. భారత్‌పై సత్తా చాటిన ఫర్హాన్ ఈ మ్యాచ్‌లో ఎలా ఆడతాడో చూడాలి.
తుది జట్లు (అంచనా)...
భారత్: అభిషేక్, శుభ్‌మన్, సూర్యకుమార్ (కెప్టెన్), శాంసన్, తిలక్, హార్దిక్, దూబె, అక్షర్, కుల్‌దీప్, బుమ్రా, వరుణ్;
పాకిస్థాన్: ఫర్హాన్, అయూబ్, జమాన్, సల్మాన్ అఘా (కెప్టెన్), హసన్, మహ్మద్ నవాజ్, హారిస్, అష్రాఫ్, షహీన్ అఫ్రిది, అబ్రార్, రవూఫ్.
‘‘మా కుర్రాళ్లందరికీ ఒకటే చెప్పా.. బయటి శబ్దాలను పట్టించుకోకపోవడం ఉత్తమం. అప్పుడే టోర్నీలో ఉత్తమ ప్రదర్శన చేస్తూ ముందుకు సాగగలం. బయటి విషయాలను పూర్తిగా విస్మరించలేం. కానీ మనకు ఏది మంచిదో అదే తీసుకోవాలి’’
సూర్యకుమార్ యాదవ్, భారత కెప్టెన్
కరచాలనాలు లేనట్లే
గ్రూప్ దశ మ్యాచ్‌లో టాస్ సందర్భంగా పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాకు భారత సారథి సూర్యకుమార్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం, మ్యాచ్ ముగిశాక మైదానంలో కరచాలనాల కోసం ఎదురు చూస్తున్న పాక్ ఆటగాళ్లను టీమ్‌ఇండియా పట్టించుకోకపోవడం.. మ్యాచ్ అనంతర ప్రెజెంటేషన్ కార్యక్రమానికి, విలేకరుల సమావేశానికి అఘా రాకపోవడం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. మరి ఆదివారం ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం ఎలా వ్యవహరిస్తారన్నది ఆసక్తికరం. టాస్ సమయంలో, మ్యాచ్ అనంతరం కరచాలనాలు ఉండే అవకాశాలు కనిపించడం లేదు. మరి ప్రెజెంటేషన్ కార్యక్రమంలో, విలేకరుల సమావేశంలో పాక్ ప్రాతినిధ్యం ఉంటుందో లేదో చూడాలి.
రిఫరీగా అతనే
భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం జరిగే ఆసియాకప్ మ్యాచ్‌కు రిఫరీగా ఆండీ పైక్రాఫ్ట్‌ను ఐసీసీ నియమించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అభ్యంతరాలను ఐసీసీ పట్టించుకోలేదు. అయితే మ్యాచ్ అధికారుల వివరాలను ఇంకా బహిర్గతపరచలేదు. గత ఆదివారం పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి భారత ఆటగాళ్లు తిరస్కరించడంతో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పైక్రాఫ్ట్‌ను బాధ్యుణ్ని చేస్తూ తమ మ్యాచ్‌ల నుంచి అతడిని తప్పించాలని కోరింది. కానీ ఆ డిమాండ్లను ఐసీసీ తిరస్కరించింది. శనివారం తమ విలేకరుల సమావేశాన్ని పాకిస్థాన్ జట్టు మేనేజ్‌మెంట్ రద్దు చేసింది. ఆదివారం కూడా భారత ఆటగాళ్లు పాకిస్థాన్ క్రికెటర్లతో కరచాలనాలు చేసే అవకాశం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


