IND vs SA: సఫారీ జట్టు ఆటకట్టిస్తామా..?అగ్రస్థానంలో భారత్‌ కొనసాగేనా?

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) భారీ మ్యాచ్‌కు వేదిక కోల్‌కతా. భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం మ్యాచ్‌ జరగనుంది. 

Updated : 04 Nov 2023 20:40 IST

ఇంటర్నెట్ డెస్క్: స్వదేశంలో ప్రపంచకప్‌ (ODI World Cup 2023). కఠిన పరీక్షలన్నింటినీ అధిగమించుకుంటూ అప్రతిహత విజయాలతో టీమ్‌ఇండియా దూసుకుపోతోంది. మరోవైపు బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ప్రత్యర్థులను హడలెత్తిస్తూ దక్షిణాఫ్రికా విజయాలు సాధిస్తోంది. ఇలాంటి నేపథ్యం కలిగిన భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం కోల్‌కతా వేదికగా కీలక పోరు జరగనుంది. 

బ్యాటర్లు ఇబ్బంది పడితే బౌలర్లు ఆదుకోవడం.. పిచ్‌ ఎలాంటిదైనా సరే ఇన్‌స్వింగ్‌, ఔట్‌స్వింగ్ బౌలింగ్‌తో పేసర్లు చెలరేగుతూ ప్రత్యర్థి జట్లను కుప్పకూల్చేయడం భారత జట్టులో చూస్తున్నాం. ఫీల్డింగ్‌లోనూ మెరుపులతో ప్రత్యర్థులు పరుగులు చేయకుండా నియంత్రిస్తూ టీమ్‌ఇండియా సాగిపోతోంది. మరోవైపు తొలుత బ్యాటింగ్‌ చేస్తే ప్రత్యర్థుల ముందు కొండంత లక్ష్యం నిర్దేశించడం.. అద్భుత బౌలింగ్‌ దాడితో వికెట్లు తీసి ఓడించడం.. దక్షిణాఫ్రికా స్పెషల్. మొదట బ్యాటింగ్‌ చేసిన ప్రతి మ్యాచ్‌లోనూ 300+ పరుగులు చేయడం గమనార్హం. ఇక ఆడిన ఏడింట్లో రెండు సార్లు మాత్రమే ఛేదనకు దిగింది. అందులోనూ నెదర్లాండ్స్‌ చేతిలో ఓటమిపాలు కావడం గమనార్హం. ఇక పాక్‌తో బతుకుజీవుడా అంటూ చెమటోడ్చి మరీ నెగ్గింది. ఇదీ ప్రస్తుత వరల్డ్‌ కప్‌లో దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి. 

దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ VS భారత బౌలింగ్‌

అధికారికంగా సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకున్న టీమ్‌ఇండియా అగ్రస్థానంతో లీగ్‌ దశను ముగించాలంటే దక్షిణాఫ్రికా ఓడిస్తే చాలు. అన్ని విభాగాల్లోనూ ఇరు జట్లకు ఏమాత్రం వ్యత్యాసం లేదు. భారత్‌ జట్టులో రోహిత్, గిల్, విరాట్, శ్రేయస్‌, కేఎల్ రాహుల్, సూర్యతో కూడిన బ్యాటింగ్‌ లైనప్‌ దుర్బేధ్యంగా ఉంటే.. దక్షిణాఫ్రికాకు డికాక్‌, క్లాసెన్, మార్‌క్రమ్, రస్సీ వాండర్‌ డసెన్, మిల్లర్‌ అదరగొట్టేస్తున్నారు. ఇక బౌలింగ్‌లోనూ షమీ, బుమ్రా, సిరాజ్‌తో కూడిన భారత త్రయం గత మ్యాచుల్లో ప్రత్యర్థులను హడలెత్తించారు. దక్షిణాఫ్రికాలోనూ కోయిట్జీ, రబాడ, మార్కో జాన్‌సెన్‌తోపాటు స్పిన్నర్లు కేశవ్ మహరాజ్‌, షంసి మంచి లయతో బౌలింగ్‌ చేస్తున్నారు. 

పిచ్‌ పరిస్థితి ఇదీ..

కోల్‌కతా పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. టాస్‌ నెగ్గిన జట్టు ఛేదనకే మొగ్గు చూపే అవకాశం ఉంది. దీంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌కు భారత బౌలింగ్‌కు పరీక్ష తప్పదు. దీంతో భారత్ షమీ, బుమ్రా, సిరాజ్‌తోపాటు నాలుగో పేసర్‌ను తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. అప్పుడు ఎవరిని పక్కన పెడతారననేది ఆసక్తికరంగా మారింది. 

ఇరు జట్ల టాప్‌ ఆటగాళ్లు వీరే..

  • భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ జస్‌ప్రీత్ బుమ్రా. ఏడు మ్యాచుల్లో 16 వికెట్లు తీశాడు. షమీ 14 వికెట్లు, కుల్‌దీప్ 10 వికెట్లు పడగొట్టారు.
  • భారత్‌ స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ అత్యంత నిలకడైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. ఏడు మ్యాచుల్లో 442 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ కూడా 402 పరుగులతో టాప్‌-5లో ఉన్నాడు.
  • డికాక్‌ 4.. వాండర్ డసెన్ 2.. ఐదెన్ మార్‌క్రమ్‌.. క్లాసెన్‌ ఒక్కోటి.. ఇవేంటని కంగారు పడొద్దు. ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు చేసిన సెంచరీలు.  అత్యధిక పరుగుల జాబితాలో క్వింటన్‌ డికాక్ (545) అగ్రస్థానంలో ఉన్నాడు. 
  • దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా మార్కో జాన్‌సెన్‌ ఉన్నాడు. అతడు ఏడు మ్యాచుల్లో 16 వికెట్లు పడగొట్టాడు. గెరాల్డ్‌ కోయిట్జీ 14, కేశవ్ మహరాజ్‌ 11, కగిసో రబాడ 11 చొప్పున వికెట్లు తీశారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని