IND vs SA: సఫారీలతో టీ20 సిరీస్‌.. గత రికార్డులు ఎలా ఉన్నాయంటే?

డిసెంబరు 10 నుంచి దక్షిణాఫ్రికా, భారత్ (SA vs IND) మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభంకానుంది. 

Published : 09 Dec 2023 13:39 IST

ఇంటర్నెట్ డెస్క్: సొంతగడ్డపై టీ20 సిరీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన టీమ్‌ఇండియా.. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో దక్షిణాఫ్రికా, భారత్ (SA vs IND) జట్లు మూడేసి టీ20లు, వన్డేలు.. రెండు టెస్టుల్లో తలపడతాయి. ఈనెల 10, 12, 14 తేదీల్లో టీ20లు.. 17, 19, 21న వన్డేలు జరుగుతాయి. 26న తొలి టెస్టు, జనవరి 3న రెండో టెస్టు ప్రారంభమవుతాయి. ఆసీస్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్‌ (Surya Kumar Yadav).. సఫారీలతో పొట్టి సిరీస్‌కూ సారథ్యం వహించనున్నాడు. వన్డేలకు కేఎల్ రాహుల్, టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్లుగా ఉంటారు. భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఐడెన్‌ మార్‌క్రమ్ (Aiden Markram), టెస్టు సిరీస్‌కు తెంబా బావుమా కెప్టెన్సీ బాధ్యతలు చూసుకోనున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఎన్ని టీ20 సిరీస్‌లు జరిగాయి, ఎవరెన్ని మ్యాచ్‌లు గెలిచారు, కెప్టెన్లుగా ఎవరు వ్యవహరించారో చూద్దాం. 

26 మ్యాచ్‌లు.. ఆధిపత్యం ఎవరిది?

టీ20 ప్రపంచకప్‌లతో కలిపి ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు జరిగాయి. టీమ్‌ఇండియా 13, దక్షిణాఫ్రికా ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. మూడు మ్యాచ్‌లు రద్దయ్యాయి. సిరీస్‌ల పరంగా చూస్తే.. ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉన్న సిరీస్‌లు ఐదు జరగ్గా.. భారత్‌ రెండింటిని, దక్షిణాఫ్రికా ఒక్క సిరీస్‌ను దక్కించుకున్నాయి. మరో రెండు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. ఈ ఫార్మాట్‌లో భారత్-దక్షిణాఫ్రికా తొలిసారిగా 2006లో, చివరగా 2022 ప్రపంచకప్‌లో తలపడ్డాయి. 

కెప్టెన్లు వీరే.. 

భారత్, దక్షిణాఫ్రికా మధ్య 2006లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియాకు వీరేంద్ర సెహ్వాగ్, సఫారీల జట్టుకు గ్రేమ్‌ స్మిత్ సారథ్యం వహించారు. 2007, 2009, 2010 టీ20 ప్రపంచకప్‌ల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లకు భారత్‌కు ధోనీ, సౌతాఫ్రికాకు గ్రేమ్ స్మిత్‌ కెప్టెన్‌లుగా ఉన్నారు. 2011లో డర్బన్‌ వేదికగా, 2012లో జొహన్నెస్‌బర్గ్ వేదికగా ఇరుజట్ల మధ్య జరిగిన టీ20ల్లో టీమ్‌ఇండియాకు ధోనీ, సఫారీల జట్టుకు జాన్‌ బోథా సారథ్యం వహించారు. 2012 టీ20 ప్రపంచకప్‌లో భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌కు ధోనీ, ఏబీ డివిలియర్స్‌ కెప్టెన్లుగా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య 2014 టీ20 ప్రపంచకప్‌ రెండో సెమీ ఫైనల్‌ మ్యాచ్‌కు, 2015లో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో సౌతాఫ్రికాను డుప్లెసిస్, భారత్‌ను ధోనీ ముందుండి నడిపించారు. 2018లో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియాకు కోహ్లీ, దక్షిణాఫ్రికాకు జేపీ డుమిని సారథులుగా ఉన్నారు. 2019లో జరిగిన మూడు టీ20ల సిరీస్‌కు కోహ్లీ, క్వింటన్ డికాక్, 2022లో ఐదు టీ20 సిరీస్‌కు రిషభ్ పంత్, తెంబా బావుమా కెప్టెన్లుగా వ్యవహరించారు. 2022లోనే మరోసారి ఇరుజట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌ నిర్వహించగా.. భారత్‌కు రోహిత్ శర్మ, దక్షిణాఫ్రికాకు బావుమా సారథ్యం వహించారు. చివరగా 2022 టీ20 ప్రపంచకప్‌లో జరిగిన మ్యాచ్‌కు రోహిత్, బావుమాలే కెప్టెన్లుగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు