T20 World cup: భలే మంచి బోణీ

టీ20లో ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా బోణీ అదుర్స్‌! పాకిస్థాన్‌తో అసలైన పోరుకు ముందు అస్త్రాలను సరి చేసుకుంటూ కూన ఐర్లాండ్‌ను రోహిత్‌సేన చితక్కొట్టేసింది. బ్యాటర్లను బెంబేలెత్తిస్తూ భారత ఫాస్ట్‌ బౌలర్లు ఐర్లాండ్‌ను కుప్పకూలిస్తే.. ధనాధన్‌ బ్యాటింగ్‌తో రోహిత్, పంత్‌ ఛేదనను మరింత తేలిక చేశారు.

Updated : 06 Jun 2024 07:00 IST

ఐర్లాండ్‌పై భారత్‌ అలవోక విజయం
విజృంభించిన పేసర్లు

టీ20లో ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా బోణీ అదుర్స్‌! పాకిస్థాన్‌తో అసలైన పోరుకు ముందు అస్త్రాలను సరి చేసుకుంటూ కూన ఐర్లాండ్‌ను రోహిత్‌సేన చితక్కొట్టేసింది. బ్యాటర్లను బెంబేలెత్తిస్తూ భారత ఫాస్ట్‌ బౌలర్లు ఐర్లాండ్‌ను కుప్పకూలిస్తే.. ధనాధన్‌ బ్యాటింగ్‌తో రోహిత్, పంత్‌ ఛేదనను మరింత తేలిక చేశారు. మ్యాచ్‌ పూర్తిగా ఏకపక్షం. నాలుగు ఓవర్లు ఉండగానే ఐర్లాండ్‌ను ఆలౌట్‌ చేసిన టీమ్‌ఇండియా.. 46 బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

న్యూయార్క్‌

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ శుభారంభం చేసింది.   ఆల్‌రౌండ్‌ ఆధిపత్యంతో తన తొలి మ్యాచ్‌లో బుధవారం 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసింది. హార్దిక్‌ పాండ్య (3/27), బుమ్రా (2/6), అర్ష్‌దీప్‌ (2/35), సిరాజ్‌ (1/13) విజృంభించడంతో మొదట ఐర్లాండ్‌ 16 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూలింది. డెలాని (26; 14 బంతుల్లో 2×4, 2×6) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రోహిత్‌ శర్మ (52 రిటైర్డ్‌ హర్ట్‌; 37 బంతుల్లో 4×4, 3×6), పంత్‌ (36 నాటౌట్‌; 26 బంతుల్లో 3×4, 2×6) మెరవడంతో లక్ష్యాన్ని భారత్‌ 12.2 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి ఛేదించింది.

మెరిసిన రోహిత్‌: ఐర్లాండ్‌ను మొదట బంతితో బెంబేలెత్తించిన టీమ్‌ఇండియా బ్యాట్‌తోనూ వదల్లేదు. ఛేదనను కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ధాటిగా ఆరంభించాడు. తనదైన శైలిలో బ్యాట్‌ను ఝళిపించాడు. లిటిల్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో వరుసగా 4, 6 బాదేశాడు. అయితే మరో ఓపెనర్‌ కోహ్లి (1) మాత్రం త్వరగా నిష్క్రమించాడు. మూడో ఓవర్లో అడైర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత పరుగుల వేగంగా రాకున్నా.. పంత్‌తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 8 ఓవర్లకు స్కోరు 52 పరుగులే. ఎదుర్కొన్న తొలి 16 బంతుల్లో పంత్‌ 17 పరుగులే చేశాడు. రోహిత్‌ 27 బంతుల్లో 30 చేశాడు. అయితే గేర్‌మార్చిన రోహిత్‌.. లిటిల్‌ బౌలింగ్‌లో వరుసగా డీప్‌ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌ లెగ్‌లో, ఫైన్‌ లెగ్‌లో సిక్స్‌లతో అలరించాడు. పదో ఓవర్లో అడైర్‌ ఫుల్‌టాస్‌ను బౌండరీకి తరలించిన రోహిత్‌.. ఆ తర్వాత రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. బ్యాటింగ్‌ సమయంలో బంతి గట్టిగా తాకడంతో అతడు ఇబ్బందిపడ్డాడు. గాయం తీవ్రమైందేమీ కాదని తెలుస్తోంది. రోహిత్‌ వెళ్లేటప్పటికి జట్టు స్కోరు 76.  సూర్యకుమార్‌ (2) వెంటనే ఔటైనా.. ధాటిగా ఆడిన పంత్,  దూబె (0 నాటౌట్‌)తో కలిసి లక్ష్యాన్ని పూర్తి చేశాడు.

ఐర్లాండ్‌కు హడల్‌: అస్థిర బౌన్స్‌కు సహకరిస్తున్న పిచ్‌పై అంతకుముందు భారత పేస్‌ దళం చెలరేగిపోయింది. ఐర్లాండ్‌ను హడలెత్తించింది. పదునైన పేస్‌తో బుమ్రా, హార్దిక్, అర్ష్‌దీప్, సిరాజ్‌ బ్యాటర్లకు ఏమాత్రం స్వేచ్ఛనివ్వలేదు. స్వింగ్, సీమ్, ఎక్స్‌ట్రా బౌన్స్‌కు వాళ్లు తేలిపోయారు. ఇద్దరు బ్యాటర్లు తప్ప ఎవరూ 20 పరుగుల దాటలేదంటే బ్యాటర్ల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మబ్బుపట్టిన వాతావరణంలో రోహిత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకోవడం భారత్‌కు కలిసొచ్చింది. అర్ష్‌దీప్, సిరాజ్‌ బౌలింగ్‌లో దూసుకొస్తున్న బంతులను ఎదుర్కొనేందుకు ఓపెనర్లు స్టిర్లింగ్, బాల్‌బిర్నీ ఇబ్బందిపడ్డారు. బంతిని తాకడమే కష్టమైపోయింది. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో ఓపెనర్లిద్దరినీ ఔట్‌ చేయడం ద్వారా ఐర్లాండ్‌ పతనాన్ని అర్ష్‌దీప్‌ ఆరంభించాడు. ముందు స్టిర్లింగ్‌ (2)ను ఔట్‌ చేసిన అతడు.. తర్వాత బాల్‌బిర్నీ (5)ని బౌల్డ్‌ చేశాడు. పవర్‌ప్లే ముగిసే సరికి ఐర్లాండ్‌ స్కోరు 26/2. ఆ తర్వాత కూడా ఉపశమనమేమీ లేదు. వికెట్ల పతనం అలా సాగుతూ పోయింది. ఇన్నింగ్స్‌ ఏ దశలోనూ ఊపందుకోలేదు. ఏ బ్యాటరూ ఆదుకోలేదు. రెండో ఛేంజ్‌ బౌలర్‌గా వచ్చిన హార్దిక్‌.. సీమ్‌ను ఉపయోగించుకుంటూ టకర్‌ (10) డిఫెన్స్‌ను ఛేదించాడు. ఆ తర్వాత బుమ్రా.. అప్పటికే ఇబ్బందిపడుతోన్న టెక్టర్‌ను ఓ పదునైన బౌన్సర్‌తో వెనక్కి పంపాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో కాంఫర్‌ (12)ను హార్దిక్, డాక్రెల్‌ (3)ను సిరాజ్‌ ఔట్‌ చేయడంతో ఐర్లాండ్‌ 10 ఓవర్లలో 49/6తో నిలిచింది. మ్యాచ్‌ ఏకపక్షంగా కావడం ఖాయమని అప్పటికే అర్థమైపోయింది. మిగతా బ్యాటర్లేమీ అద్భుతాలు చేయలేదు. కాస్త పోరాడిన డిలాని.. జోష్‌ లిటిల్‌ (14)తో 9వ వికెట్‌కు 27, వైట్‌ (2 నాటౌట్‌)తో 19 పరుగులు జోడించి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. ఇటీవల కాలంలో ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కొన్న హార్దిక్‌.. తన కోటా ఓవర్లు మొత్తం వేయడం భారత్‌కు సంతోషాన్నిచ్చే విషయం.

ఐర్లాండ్‌ ఇన్నింగ్స్‌: బాల్‌బిర్నీ (బి) అర్ష్‌దీప్‌ 5; స్టిర్లింగ్‌ (సి) పంత్‌ (బి) అర్ష్‌దీప్‌ 2; టకర్‌ (బి) హార్దిక్‌ 10; టెక్టర్‌ (సి) కోహ్లి (బి) బుమ్రా 4; కాంఫర్‌ (సి) పంత్‌ (బి) హార్దిక్‌ 12; డాక్రెల్‌ (సి) బుమ్రా (బి) సిరాజ్‌ 3; డెలాని రనౌట్‌ 26; అడైర్‌ (సి) దూబె (బి) హార్దిక్‌ 3; మెక్‌గార్తి (సి) అండ్‌ (బి) అక్షర్‌ 0; జోష్‌ లిటల్‌ (బి) బుమ్రా 14; బెన్‌ వైట్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 15 మొత్తం: (16 ఓవర్లలో ఆలౌట్‌) 96; వికెట్ల పతనం: 1-7, 2-9, 3-28, 4-36, 5-44, 6-46, 7-49, 8-50, 9-77; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 4-0-35-2; సిరాజ్‌ 3-0-13-1; బుమ్రా 3-1-6-2; హార్దిక్‌ 4-1-27-3; అక్షర్‌ 1-0-3-1; జడేజా 1-0-7-0

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ రిటైర్డ్‌హర్ట్‌ 52; కోహ్లి (సి) వైట్‌ (బి) అడైర్‌ 1; పంత్‌ నాటౌట్‌ 36; సూర్యకుమార్‌ (సి) డాక్రెల్‌ (బి) వైట్‌ 2; శివమ్‌ దూబె నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (12.2 ఓవర్లలో 2 వికెట్లకు) 97; వికెట్ల పతనం: 1-22, 2-91; బౌలింగ్‌: అడైర్‌ 4-0-27-1; జోష్‌ లిటిల్‌ 4-0-42-0; మెక్‌గార్తి 2.2-0-18-0; కాంఫర్‌ 1-0-4-0; వైట్‌ 1-0-6-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు