IND vs SA: స్వింగ్‌తో కొట్టారు..

కేవలం 15 బంతులు. అవును.. పేసర్లకు సహకరించిన పిచ్‌పై తొలి టీ20లో కేవలం పదిహేను బంతుల్లోనే భారత్‌ పట్టుగించింది. అర్ష్‌దీప్‌, దీపక్‌ చాహర్‌ సంచలన స్వింగ్‌ బౌలింగ్‌తో చెలరేగిన వేళ.. 2.3 ఓవర్లలో 9 పరుగులకే అయిదు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బతీసిన టీమ్‌ఇండియా చాలా ముందే ఫలితాన్ని ఖరారు చేసింది. ఛేదనలో కాస్త కంగారు తప్పకపోయినా.. సూర్యకుమార్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో పని పూర్తి చేశాడు.

Updated : 29 Sep 2022 06:56 IST

విజృంభించిన అర్ష్‌దీప్‌, చాహర్‌
మెరిసిన సూర్య
తొలి టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయం
తిరువనంతపురం

కేవలం 15 బంతులు. అవును.. పేసర్లకు సహకరించిన పిచ్‌పై తొలి టీ20లో కేవలం పదిహేను బంతుల్లోనే భారత్‌ పట్టుగించింది. అర్ష్‌దీప్‌, దీపక్‌ చాహర్‌ సంచలన స్వింగ్‌ బౌలింగ్‌తో చెలరేగిన వేళ.. 2.3 ఓవర్లలో 9 పరుగులకే అయిదు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికాను దెబ్బతీసిన టీమ్‌ఇండియా చాలా ముందే ఫలితాన్ని ఖరారు చేసింది. ఛేదనలో కాస్త కంగారు తప్పకపోయినా.. సూర్యకుమార్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో పని పూర్తి చేశాడు. సిరీస్‌లో టీమ్‌ఇండియా ఘనంగా బోణీ కొట్టింది.

ప్రపంచకప్‌ ముందు తన చివరి పొట్టి సిరీస్‌లో టీమ్‌ఇండియాకు శుభారంభం. అర్ష్‌దీప్‌ సింగ్‌ (3/32), దీపక్‌ చాహర్‌ (2/24) అద్భుత స్వింగ్‌ బౌలింగ్‌కు.. సూర్యకుమార్‌ యాదవ్‌ (50 నాటౌట్‌; 33 బంతుల్లో 5×4, 3×6) అదిరే బ్యాటింగ్‌ తోడవడంతో బుధవారం తొలి టీ20లో భారత్‌    8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. అర్ష్‌దీప్‌, చాహర్‌, హర్షల్‌ (2/26) ధాటికి మొదట దక్షిణాఫ్రికా 8 వికెట్లకు 106 పరుగులే చేయగలిగింది. కేశవ్‌ మహరాజ్‌ (41; 35 బంతుల్లో 5×4, 2×6) ఆ జట్టును ఆదుకున్నాడు. మార్‌క్రమ్‌ (25; 24 బంతుల్లో 3×4, 1×6), పార్నెల్‌ (24; 37 బంతుల్లో 1×4, 1×6) రాణించారు. సూర్యతో పాటు రాహుల్‌ (51 నాటౌట్‌; 56 బంతుల్లో 2×4, 4×6) రాణించడంతో లక్ష్యాన్ని భారత్‌ 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

సూర్య ధనాధన్‌: ఛేదనలో సూర్యకుమార్‌ యాదవే భారత్‌ హీరో. కఠినమైన పిచ్‌పై పరీక్షించే పరిస్థితుల్లో చక్కని బ్యాటింగ్‌తో రాహుల్‌తో కలిసి అతడు జట్టును విజయపథంలో నడిపించాడు. చివరికి స్కోరు బోర్డు చూస్తే భారత్‌ తేలిగ్గానే గెలిచినట్లు అనిపించవచ్చు. కానీ సీమర్లకు బాగా సహకరిస్తున్న పిచ్‌పై స్వల్ప ఛేదనలోనూ జట్టుకు కంగారు తప్పలేదు. మొదట్లో టీమ్‌ ఇండియా కూడా దక్షిణాఫ్రికా లాగే తడబడింది. పార్నెల్‌, రబాడ పదునైన పేస్‌కు ఆరు ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి కేవలం 17 పరుగులే చేసింది. మూడో ఓవర్లోనే రోహిత్‌ (0)ను రబాడ ఔట్‌ చేశాడు. ఏడో ఓవర్లో కోహ్లి (3)ని నోకియా ఔట్‌ చేయడంతో స్వల్ప లక్ష్యమే క్లిష్టంగా అనిపించింది. అయితే సూర్య క్రీజులోకి రావడంతో పరిస్థితి మారింది. కఠిన పరిస్థితుల్లోనూ అతడు తన సహజ దూకుడుతోనే బ్యాటింగ్‌ చేశాడు. ముచ్చటైన షాట్లతో అలరించాడు. నోకియా బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టిన అతడు జట్టుపై ఒత్తిడి తగ్గించాడు. అయితే మొదటి సిక్స్‌ ఎడ్జ్‌ ద్వారా వచ్చింది. బతికిపోయిన సూర్య.. తర్వాతి బంతిని స్క్వేర్‌లెగ్‌లోకి చాలా అందంగా ఫ్లిక్‌ చేశాడు. అంతే ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసుకోలేదు. సాధికారిక బ్యాటింగ్‌ను కొనసాగించాడు. రాహుల్‌ నెమ్మదిగా ఆడినా సాధించాల్సిన స్కోరు ఎక్కువ లేకపోవడంతో కంగారు పడాల్సిన అవసరం లేకపోయింది. బౌలర్లు ఒత్తిడి తెస్తున్న సమయంలో అతడు చాలా జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేశాడు. నోకియా ఓవర్లో లాంగాన్‌లో ముచ్చటైన సిక్స్‌ కొట్టాడు. 10 ఓవర్లకు భారత్‌ స్కోరు 47/2. ఆ తర్వాత సూర్య, రాహుల్‌లు ఇద్దరూ వీలైనప్పుడల్లా బౌండరీ రాబడుతూ సాగిపోయారు. క్రమంగా మ్యాచ్‌ దక్షిణాఫ్రికాకు దూరమైంది. షంసి బౌలింగ్‌లో రాహుల్‌ మోకాలు వంచుతూ స్క్వేర్‌ లెగ్‌లో సిక్స్‌ కొట్టగా.. మహరాజ్‌ బంతిని సూర్య లాంగాఫ్‌లోకి లాప్ట్‌ చేశాడు. ఆ తర్వాత నోకియా బంతిని రాహుల్‌ స్టాండ్స్‌లోకి దంచాడు. రబాడ బౌలింగ్‌లో సూర్య చక్కని షాట్లతో వరుసగా రెండు బౌండరీలు సాధించాడు. షంసి బౌలింగ్‌లో సింగిల్‌తో సూర్య అర్ధశతకం పూర్తి చేయగా.. ఆ వెంటనే సిక్స్‌తో రాహుల్‌ అర్ధశతకంతో పాటు లక్ష్యాన్నీ పూర్తి చేశాడు.

మూడు ఓవర్లలోనే..: సిరీస్‌లో ఇలాంటి ఆరంభాన్ని దక్షిణాఫ్రికా ఏమాత్రం ఊహించి ఉండదు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టును  అంతలా బెంబేలెత్తించారు భారత పేసర్లు. తొలి అరగంటలోనే మ్యాచ్‌ గమనం స్పష్టమైన వేళ.. టీమ్‌ఇండియా అభిమానులు మురిశారు. కీలక బౌలర్‌ బుమ్రా వెన్ను నొప్పితో దూరమైనా పేస్‌ దళం స్వింగ్‌ బౌలింగ్‌తో ప్రత్యర్థిని వణికించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కు క్రీజులో నిలవడం గగనమే అయింది. ప్రతి బంతీ ఒక బుల్లెట్టే. పచ్చని పిచ్‌పై ఇటు అర్ష్‌దీప్‌.. అటు దీపక్‌ చాహర్‌ మూడు ఓవర్లలోనే సఫారీలను ముంచేశారు. 3 ఓవర్లలో 14 పరుగులకే అయిదు వికెట్లు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ భారంగా గడిచింది. కేశవ్‌ మహరాజ్‌ పుణ్యమా అని.. స్కోరు వంద పరుగులు దాటినా జరగాల్సిన నష్టం తొలి మూడు ఓవర్లలోనే జరిగింది.

ఇన్నింగ్స్‌ ఆరంభం పెను సంచలనం. చాలా రోజుల తర్వాత ఆడే అవకాశం దక్కించుకున్న చాహర్‌ తానెంత విలువైన బౌలరో చెబితే... ప్రపంచకప్‌లో తాను కీలక బౌలర్‌ కాబోతున్నానన్న అంచనాలు సరైనవే అని యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ చాటాడు. ఇద్దరూ కలిసి దక్షిణాఫ్రికా టాప్‌ లేపారు. తొలి ఓవర్లోనే బవుమా (0)ను వెనక్కి పంపి ప్రత్యర్థి పతనాన్ని ఆరంభించాడు చాహర్‌. అప్పటివరకు మూడు ఔట్‌ స్వింగర్‌లు వేసిన అతడు.. ఆఖరి బంతికి ఓ కళ్లు చెదిరే ఇన్‌స్వింగర్‌తో బవుమాను బౌల్డ్‌ చేశాడు. తన తర్వాతి ఓవర్లో స్టబ్స్‌ను వెనక్కి పంపాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల షార్ట్‌ బంతిని కొట్టిన స్టబ్స్‌ (0) టాప్‌ ఎడ్జ్‌తో థర్డ్‌మ్యాన్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌కు దొరికిపోయాడు. అయితే అంతకుముందు ఓవర్లో జరిగింది అసలు మ్యాజిక్‌. అర్ష్‌దీప్‌ అదిరే బౌలింగ్‌తో దక్షిణాఫ్రికా వెన్నువిరిచాడు. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్లో అతడు ఏకంగా మూడు వికెట్లు చేజిక్కించుకుని ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బతీశాడు. మొదట అతడికి చిక్కింది డికాక్‌. ఆఫ్‌స్టంప్‌ ఆవల ఔట్‌ స్వింగర్‌ను ఆడే ప్రయత్నంలో ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌తో డికాక్‌ (1) బౌల్డయ్యాడు. ఆ తర్వాత రొసో (0) ఓ వైడ్‌ ఔట్‌స్వింగర్‌ను వెంటాడి ఎడ్జ్‌తో పంత్‌కు చిక్కాడు. తర్వాతి వంతు మిల్లర్‌ది. ఓవర్‌ ఆఖరి బంతికి అర్ష్‌దీప్‌ అతణ్ని ఔట్‌ చేసిన తీరు చాలా కాలం గుర్తుండిపోతుంది. అంత అద్భుతంగా వేశాడు అతడు. అర్ష్‌దీప్‌ కళ్లు చెదిరే ఇన్‌స్వింగర్‌కు మిల్లర్‌ (0) వద్ద సమాధానమే లేకపోయింది. బంతి అతడి డిఫెన్స్‌ను ఛేదిస్తూ స్టంప్స్‌ను పడగొట్టింది. అయిదు వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయిన దశలో మార్‌క్రమ్‌, పార్నెల్‌ నిలబడ్డారు వికెట్ల పతనాన్ని అడ్డుకుని ఇన్నింగ్స్‌ను కాస్త కుదుటపరిచారు. అయితే ఎనిమిదో ఓవర్లో మార్‌క్రమ్‌ను హర్షల్‌ వికెట్ల ముందు దొరకబుచ్చుకునే సమయానికి స్కోరు 42 పరుగులే. కానీ కేశవ్‌ మహరాజ్‌ బ్యాట్‌ ఝుళిపించడంతో దక్షిణాఫ్రికా కాస్త పరువు దక్కించుకుంది. ధాటిగా ఆడిన మహరాజ్‌.. పార్నెల్‌తో ఏడో వికెట్‌కు 26, రబాడ (7 నాటౌట్‌)తో ఎనిమిదో వికెట్‌కు 33 పరుగులు జోడించి ఔటయ్యాడు. అశ్విన్‌ నాలుగు ఓవర్లలో కేవలం ఎనిమిది పరుగులే ఇచ్చాడు. అక్షర్‌ 16 పరుగులిచ్చి ఓ వికెట్‌ పడగొట్టాడు.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి) అర్ష్‌దీప్‌ 1; బవుమా (బి) చాహర్‌ 0; రొసో (సి) పంత్‌ (బి) అర్ష్‌దీప్‌ 0; మార్‌క్రమ్‌ ఎల్బీ (బి) హర్షల్‌ 25; మిల్లర్‌ (బి) అర్ష్‌దీప్‌ 0; స్టబ్స్‌ (సి) అర్ష్‌దీప్‌ (బి) చాహర్‌ 0; పార్నెల్‌ (సి) సూర్యకుమార్‌ (బి) అక్షర్‌ 24; కేశవ్‌ మహరాజ్‌ (బి) హర్షల్‌ 41; రబాడ నాటౌట్‌ 7; నోకియా నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 6

మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 106;

వికెట్ల పతనం: 1-1, 2-1, 3-8, 4-8, 5-9, 6-42, 7-68, 8-101;

బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-24-2; అర్ష్‌దీప్‌ 4-0-32-3; అశ్విన్‌ 4-1-8-0; హర్షల్‌ 4-0-26-2; అక్షర్‌ 4-0-16-1

భారత్‌ ఇన్నింగ్స్‌: కేఎల్‌ రాహుల్‌ నాటౌట్‌ 51; రోహిత్‌ శర్మ (సి) డికాక్‌ (బి) రబాడ 0; కోహ్లి (సి) డికాక్‌ (బి) నోకియా 3; సూర్యకుమార్‌ యాదవ్‌ నాటౌట్‌ 50; ఎక్స్‌ట్రాలు 6;

మొత్తం: (16.4 ఓవర్లలో 2 వికెట్లకు) 110;

వికెట్ల పతనం: 1-9, 2-17;

బౌలింగ్‌: రబాడ 4-1-16-1; పార్నెల్‌ 4-0-14-0; నోకియా 3-0-32-1; షంసి 2.4-0-27-0; కేశవ్‌ మహరాజ్‌ 3-0-21-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని