Rohit Sharma: ఆ ఒక్కటి తప్ప.. రో‘హిట్‌’

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) 14 నెలల తర్వాత అంతర్జాతీయ టీ20లకు ఎంపికయ్యాడు. 

Updated : 13 Jan 2024 15:40 IST

అన్ని బాక్సులూ టిక్‌ చేసిన హిట్‌మ్యాన్‌

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్‌.. అది కూడా సొంత గడ్డపై. ఇంకేముంది టీమ్‌ ఇండియా (Team India) చెలరేగి ఆ చిన్న జట్టును చిత్తు చేస్తుందనేది ఊహించిందే. ఎలాగూ పోరు ఏకపక్షమే కాదా ఏం ఆసక్తి ఉందనే అనుకున్నారు. కానీ ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌కు ముందు భారత్‌ ఆడుతున్న  చివరి టీ20 సిరీస్‌ ఇదే కావడం.. ముఖ్యంగా రోహిత్‌ శర్మ (Rohit Sharma), విరాట్‌ కోహ్లి  (Virat Kohli) 14 నెలల తర్వాత తిరిగి టీ20 జట్టులోకి రావడంతో ఈ సిరీస్‌పై ఆసక్తి పెరిగింది.  తొలి టీ20కి వ్యక్తిగత కారణాల వల్ల కోహ్లి దూరమవడంతో అందరి దృష్టి రోహిత్‌ పైనే పడింది. కానీ రోహిత్‌ తనదైన శైలిలో జట్టును నడిపించాడు. ఈ మ్యాచ్‌లో అన్ని విషయాల్లోనూ హిట్‌మ్యాన్‌.. ఒక్క దాంట్లో మాత్రం విఫలమయ్యాడు. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్‌ టిక్‌ చేసిన బాక్స్‌లు ఏవి? 

11 మ్యాచ్‌ల తర్వాత

గతంలో పేసర్లకు ఎక్కువగా అనుకూలించిన మొహాలి పిచ్‌ కొంతకాలంగా బ్యాటింగ్‌కు స్వర్గధామంగా మారింది. ఇక్కడ మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీంతో లీగ్‌లు, దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌ చూసుకుంటే మొత్తంమీద 2022 నుంచి ఇక్కడ జరిగిన 40 టీ20 మ్యాచ్‌ల్లో ఛేదన జట్లు 26 సార్లు గెలిచాయి. దీంతో ఇక్కడ ఛేదన జట్లకు కలిసొస్తుందన్న విషయం స్పష్టమైంది. ఫీల్డింగ్‌ తీసుకోవాలంటే ముందు టాస్‌ గెలవాలి. కానీ అన్ని ఫార్మాట్లలో కలిపి వరుసగా గత 11 మ్యాచ్‌ల్లో భారత్‌ టాస్‌ నెగ్గలేదు. కానీ, ఇప్పుడు అఫ్గానిస్థాన్‌తో తొలి టీ20లో టాస్‌ గెలిచిన రోహిత్‌.. ఇక్కడే తొలి బాక్స్‌ను టిక్‌ చేశాడు. టాస్‌ గెలవగానే మరో ఆలోచన లేకుండా అతను బౌలింగ్‌ ఎంచుకోవడం జట్టు విజయానికి దోహదం చేసింది. 

బౌలర్ల రొటేషన్‌

ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్, ముకేశ్‌ రూపంలో ఇద్దరు స్పెషలిస్టు పేసర్లతోనే భారత్‌ ఆడింది. ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబె మరో ప్రత్యామ్నాయ పేసర్‌. ఇక వాషింగ్టన్‌ సుందర్, అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్‌.. ఇలా ముగ్గురు స్పిన్నర్లను బరిలోకి దింపడంతో బ్యాటింగ్‌ సామర్ధ్యం పెరిగింది. అంతేకాక బౌలర్లను రొటేట్‌ చేయడంలోనూ రోహిత్‌ తనదైన మార్క్‌ చూపించాడు. ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని విడగొట్టేందుకు పవర్‌ప్లేలోనే అక్షర్‌కు బంతినివ్వడం, ఆ తర్వాత శివమ్‌ దూబెతో బౌలింగ్‌ వేయించడం కలిసొచ్చింది. మధ్యలో పరుగులు వచ్చినా.. చివర్లో ముకేశ్‌తో ప్రత్యర్థికి అడ్డుకట్ట వేయడంలో రోహిత్‌ విజయవంతమయ్యాడు. సుందర్‌తో 19వ ఓవర్‌ వేయించాడు. విభిన్న సవాళ్లకు సిద్ధమయ్యేలా బౌలర్లను పరీక్షించాల్సి ఉందని, అందుకే ఈ మార్పులు చేశామని మ్యాచ్‌ తర్వాత రోహిత్‌ పేర్కొన్నాడు. ఓవర్‌ రేట్‌ విషయంలోనూ జాగ్రత్తగా వ్యవహరించిన రోహిత్‌.. సరైన సమయంలో ఇన్నింగ్స్‌ ముగించడంలోనూ సక్సెస్‌ అయ్యాడు. 

ఓపెనర్‌ను మార్చాల్సి వచ్చినా

ఈ మ్యాచ్‌లో రోహిత్, యశస్వి జైస్వాల్‌ ఓపెనర్లుగా ఆడతారని ముందుగానే కోచ్‌ ద్రవిడ్‌ ప్రకటించాడు. కానీ గజ్జల్లో నొప్పి వల్ల యశస్వి దూరమయ్యాడు. దీంతో శుభ్‌మన్‌తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభించాడు. ఇక ఏడాదికి పైగా టీ20 జట్టుకు రోహిత్‌ దూరంగా ఉన్నాడు. దీంతో ప్రస్తుతం జట్టులో ఉన్న ఆటగాళ్లు, వాళ్ల ప్రదర్శన, రిజర్వ్‌ బెంచ్‌ బలంపై రోహిత్‌కు అవగాహన కాస్త తక్కువనే చెప్పాలి.  ద్రవిడ్‌తో మాట్లాడిన తర్వాత తుది జట్టు కూర్పును రోహిత్‌ సెట్‌ చేసుకున్నాడు. బ్యాటింగ్‌ ఆర్డర్లో శివమ్‌ దూబెను ముందు పంపడం కూడా కలిసొచ్చింది. తీవ్రమైన చలిలో, కఠిన పరిస్థితుల్లో రోహిత్‌ జట్టును నడిపించిన విధానమూ ఆకట్టుకుంది. చేతులు బిగుతుగా మారుతుంటే వేడి నీటి బ్యాగుల సాయంతో వేడి చేసుకుంటూ గ్రౌండ్‌లో కొనసాగాడు రోహిత్‌. అయితే బ్యాటింగ్‌లో సున్నాకే వెనుదిరగడం ఒక్కటే ఈ మ్యాచ్‌లో రోహిత్‌ ఫెయిల్యూర్‌గా చెప్పొచ్చు. శుభ్‌మన్‌తో సమన్వయ లోపం వల్ల రోహిత్‌ రనౌట్‌ అయి వెనుదిరిగాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు రోహిత్‌కు ఇంకా రెండు అంతర్జాతీయ టీ20లు, ఐపీఎల్‌లో కనీసం 14 మ్యాచ్‌లు   మిగిలిఉంటాయి. బ్యాటింగ్‌లో సత్తా చాటేందుకు రోహిత్‌కు ఇవి సరిపోతాయనే చెప్పాలి. పొట్టి ఫార్మాట్లోనూ ఫామ్‌ను కొనసాగిస్తే రోహిత్‌ అన్ని విషయాల్లోనూ సూపర్‌ హిట్‌ అవుతాడు.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని