Updated : 18 Sep 2022 17:08 IST

Robin Uthappa: టీ20 లీగ్‌లో వీరవిహారం.. జాతీయ జట్టులోకి మాత్రం పోరాటం

ఇదీ రాబిన్‌ ఉతప్ప ప్రస్థానం

ధోనీ, సెహ్వాగ్, యువరాజ్‌, గంభీర్, కార్తిక్‌, ఇర్ఫాన్‌ పఠాన్.. వీరంతా భారత్ తొలి పొట్టి ప్రపంచకప్‌ను నెగ్గిన జట్టులో సభ్యులు. వీరితోపాటు మరొక ఆటగాడు కూడా ఉన్నాడు. ప్రతిభకు కొదవలేని ఆటగాడు.. కానీ జాతీయ జట్టులోకి అడపాదడపా రావడం.. ఏదో రెండు మ్యాచ్‌లు ఆడేసి మళ్లీ దూరమవడం.. ఇదీ సీనియర్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ సాగిన తీరు. అయితే భారత టీ20 లీగ్‌లో మాత్రం తనదైన దూకుడైన ఆట తీరును ప్రదర్శించాడు. తనదైన రోజున బ్యాట్‌లో మ్యాచ్‌ను శాసించాడు. తాజాగా రాబిన్ ఉతప్ప జాతీయ, అంతర్జాతీయ ఫార్మాట్లకు వీడ్కోలు పలికేశాడు.

ఇంటర్నెట్ డెస్క్‌:  కర్ణాటకకు చెందిన రాబిన్ ఉతప్ప.. విరాట్ కోహ్లీ కంటే ముందే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. వన్డే స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. వికెట్‌ కీపర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు. అయితే ఎంఎస్ ధోనీ ఉండటంతో ఉతప్పకు అవకాశాలు తక్కువగానే వచ్చాయి. భారత్‌ తరఫున కేవలం 46 వన్డేలు, 12 టీ20లకు మాత్రమే ఆడగలిగాడు. టెస్టు జట్టులోకే ఎంట్రీ కాలేకపోయాడు. కానీ భారత టీ20 లీగ్‌లో మాత్రం అదరగొట్టేశాడు. ఇప్పటి వరకు 205 మ్యాచుల్లో 130.30 స్ట్రైక్‌రేట్‌తో 4,952 పరుగులు సాధించాడు. ఇందులో 27 అర్ధశతకాలు ఉన్నాయి. బెంగళూరు, రాజస్థాన్‌, ముంబయి, కోల్‌కతా, చెన్నై జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

పాక్‌పై అర్ధశతకం

పాకిస్థాన్‌ జట్టుతో భారత్‌ తలపడేటప్పుడు ప్రతి ఆటగాడిపై ఒత్తిడి ఉంటుంది. అయితే 2007 టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి ఆడిన రాబిన్ ఉతప్ప మాత్రం ఏమాత్రం బెరుకు లేకుండా అర్ధశతకం కొట్టేశాడు. మహమ్మద్ అసిఫ్, ఉమర్ గుల్, యాసిర్ అరాఫత్ లాంటి బౌలర్లను ఎదుర్కొని కేవలం 39 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ తరఫున ఉతప్పదే అత్యధిక స్కోరు. అంతర్జాతీయ టీ20 మ్యాచుల్లో భారత్‌ తరఫున అర్ధశతకం సాధించిన తొలి బ్యాటర్‌గానూ రాబిన్‌ ఉతప్ప రికార్డు సృష్టించాడు. తర్వాత జాతీయ జట్టు తరఫున కొన్ని మ్యాచ్‌లను ఆడినా.. సరైన గుర్తింపు రాలేదు. అయితే భారత-ఏ జట్టుకు సారథిగా వ్యవహరించాడు. టీమ్‌ఇండియా తరఫున తన చివరి మ్యా్చ్‌ను 2015లో ఆడాడు.

భారత టీ20 లీగ్‌లో..

జాతీయ జట్టులో స్థానం కోసం పోరాడిన రాబిన్.. భారత టీ20 లీగ్‌లో మాత్రం దుమ్మురేపాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఓపెనర్‌గా వచ్చి దూకుడు ప్రదర్శించాడు. 2008లోనే ముంబయి తరఫున తొలి సీజన్‌ ఆడాడు. మొదటి మ్యాచ్‌లోనే 38 బంతుల్లో 48 పరుగులు సాధించాడు. ఆ తర్వాత 2009 సీజన్‌కే బెంగళూరుకు మారిపోయాడు. అయితే ఆ సీజన్‌లో పెద్దగా రాణించలేదు. 2010లో పంజాబ్‌ జట్టులో చేరిన ఈ కుడిచేతివాటం ఆటగాడు.. మరుసటి సీజన్‌లో అప్పటి పుణె వారియర్స్‌లో చేరాడు. పుణె జట్టును తొలగించిన తర్వాత కోల్‌కతా (2014-19) తరఫున ఆడాడు. 2020 సీజన్‌లో రాజస్థాన్‌కు మారిపోయిన రాబిన్‌ ఉతప్ప.. గత రెండు సీజన్లలో మాత్రం చెన్నై జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

Read latest Sports News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని